Published : 22 May 2022 23:40 IST

Raghavendra Rao: రాఘవేంద్రరావు ‘ప్రేమలేఖ’ పుస్తకావిష్కరణ..

హైదరాబాద్‌: యూట్యూబ్‌, బుల్లితెర వేదికగా తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్న ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈసారి ఓ పుస్తకమే రాశారు. తన 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ రచించిన ‘నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ’ పుస్తకాన్ని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌ పర్సన్‌, రచయిత్రి సుధామూర్తి ఆదివారం ఆవిష్కరించారు. పుస్తకం పేరు రాఘవేంద్రరావు మార్క్‌కు తగ్గట్టు ఉందని, ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అడవి రాముడు’, ‘అన్నమయ్య’ చిత్రాల గురించి తన తెలుగు స్నేహితులు పదే పదే చర్చిస్తుంటారని ఆమె అన్నారు. ‘ఇది రాఘవేంద్రరావుగారి జీవిత కథ కాదు. తెలుగు సినీ రంగ ప్రస్థానానికి నిలువుటద్దంలాంటిది’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వర్చువల్‌గా ఈ పుస్తకం గురించి మాట్లాడారు.

రాఘవేంద్రరావు పుట్టినరోజు (సోమవారం)ను పురస్కరించుకుని నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ఈవెంట్‌లో అగ్ర దర్శకులు సుకుమార్‌, త్రివిక్రమ్‌, హరీశ్‌శంకర్‌, అనిల్‌ రావిపూడి, వి. వి. వినాయక్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, నటుడు తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి తదితరులు పాల్గొని సందడి చేశారు. ‘‘సినిమా హాలును మంత్రనగరాన్ని చేస్తాడు. అందులోకి అడుగుపెట్టగానే కళ్లల్లోంచి కన్నీళ్లు మాయం చేస్తాడు. గుండెలోంచి బెంగను మాయం చేస్తాడు. జేబుల్లోంచి డబ్బును మాయం చేస్తాడు’ అంటూ తనికెళ్ల భరణి, ‘గులాబీకి వయసులేదు, అందమైన ఆడపిల్లకు వయసురాదు, రాఘవేంద్రరావుకు వయసు పోదు’ అంటూ త్రివిక్రమ్‌.. దర్శకేంద్రుడిని కొనియాడారు.

అబద్ధం రాయడం అనర్థమనిపించింది: రాఘవేంద్రరావు

అది 1963వ సంవత్సరం. ఆరోజు నాకింకా గుర్తుంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ‘పాండవ వనవాసం’ చిత్రానికి ఎన్టీఆర్‌పై క్లాప్‌కొట్టడంతో నా సినీ కెరీర్‌ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు నాకు తొలిసారి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లపాటు అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత మా నాన్న (కె. ఎస్‌. ప్రకాశ్‌రావు) కథ అందించిన ‘బాబు’ (1975) సినిమాతో దర్శకుడిగా మారా. అలా మొదలైన నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు, ఆనందాలు, కష్టాలు, ఎత్తులు, లోతులు, అవార్డులు, రివార్డులు అన్నింటినీ చూశా. నా సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకోవాలనే ఉద్దేశంతోనే ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ అనే ఈ పుస్తకాన్ని రాశా. నేను నడిచిన సినిమా దారిలో నాకు సహకరించిన స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, రచయితలను నేనెప్పుడూ మరిచిపోను.

నా ప్రేమ లేఖల్ని మీ ముందుకు తీసుకొచ్చా. నేనీ స్థాయికి చేరుకునేందుకు కారణమైన 24 విభాగాల వారికి, ప్రేక్షకులకు అన్నీ నిజాలే చెప్పాలనుకున్నా. అందుకే ‘అబద్దాలు రాయడం అనర్ధం, నిజాలు రాయటానికి భయం’ అనుకుంటూ మనసుతో అక్షరీకరించా. ‘సినిమా అనేది ఇలా ఉండాలి’ అంటూ ఓ గీత గీయకూడదు. ఇటీవల వచ్చిన ఎన్నో సినిమాలు ఈ హద్దులను చేరిపేయడం అభినందనీయం. సినీ అభిమానులు, పాఠకులు ఈ పుస్తకాన్ని చదివి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. అన్ని పుస్తక కేంద్రాల్లోనూ ఈ బుక్‌ లభిస్తుందని తెలిపారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని