Dasara Movie: లెక్కలేసుకొని చేసిన సినిమా కాదు

నాని సినిమాలతో కొత్త దర్శకులు వెలుగులోకి వస్తుంటారు. అలా ‘దసరా’ సినిమాతో పరిచయమవుతున్న మరో దర్శకుడు... శ్రీకాంత్‌ ఓదెల. ఆయన తొలి చిత్రమే పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది.

Updated : 31 Mar 2023 14:44 IST

నాని సినిమాలతో కొత్త దర్శకులు వెలుగులోకి వస్తుంటారు. అలా ‘దసరా’ సినిమాతో పరిచయమవుతున్న మరో దర్శకుడు... శ్రీకాంత్‌ ఓదెల. ఆయన తొలి చిత్రమే పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. నాని, కీర్తిసురేశ్‌ జంటగా నటించిన ‘దసరా’ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు శ్రీకాంత్‌ ఓదెల. ఆ విషయాలివీ...

నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తితోనే ఈ కథ రాసుకున్నా. వీర్లపల్లి అనే గ్రామం నేపథ్యంలో సాగుతుంది. నా బాల్యం అంతా ఆ ఊళ్లోనే గడిచింది. ఆ ప్రభావం నాపై చాలానే ఉంటుంది. అందుకే ఆ నేపథ్యంలోనే ఒక ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కించా. స్నేహం ఈ కథలో కీలకం. భావోద్వేగాలు హత్తుకునేలా ఉంటాయి. పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ముందే అనుకున్నాం.

అన్ని భాషల్లోనూ నాణ్యమైన సినిమాని అందించాలని దానిపైనే దృష్టిపెట్టాను తప్ప, ఎప్పుడూ ఒత్తిడిగా అనిపించలేదు. నిజాయతీగా తీసిన సినిమా ఇది. కథానాయకుడు నానిని ఇప్పటివరకు చూడని మాస్‌ పాత్రలో నేను చూపించాలనో లేక ఇతరత్రా లెక్కలేవో వేసుకుని చేసిన సినిమా కాదు. నాకు అలాంటి లెక్కలేవీ తెలియవు. కథ కోణంలోనే  ఆలోచిస్తూ ఎంత నిజాయతీగా చెబుతున్నాం అనే విషయంపైనే దృష్టిపెట్టి పనిచేశా. ప్రేక్షకులు కూడా ఆ కోణం నుంచే చూస్తారని నమ్ముతున్నా.

‘‘సుకుమార్‌ దర్శకత్వం వహించిన ‘జగడం’ చూశాకే నాకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. మా నాన్న సింగరేణి ఉద్యోగి.  పెద్దపల్లి దగ్గర సింగరేణి క్వార్టర్స్‌ మా నివాసం. పదో తరగతి చదువుతున్నప్పుడు విడుదలైన ‘జగడం’ చూశాక సినిమా తీయాలనే ఆసక్తి పెరిగింది. సుకుమార్‌ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాలనుకున్నా. కానీ నాకు దారి కనిపించలేదు. నాలుగేళ్లు రకరకాలుగా ప్రయత్నాలు చేశా. ఆయన దృష్టిలో పడేందుకు వాళ్ల ఇంటికి ఎదురుగా నిలుచునేవాణ్ని.

నాలుగేళ్ల తర్వాత ఆయన నన్ను పిలిచి ఓ లఘు చిత్రం చేసుకుని రమ్మన్నారు. నేను చేసిన ఆ చిత్రం ఆయనకి నచ్చి ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకి ఆయన  దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం ఇచ్చారు. ‘రంగస్థలం’ సినిమాకి చేశాక ‘దసరా’ కథ రాసుకున్నా. అప్పుడే నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కథ విని, నానికి చెప్పమన్నారు. నాని అన్నకు వినగానే కథ నచ్చినా, నేనేలా తీస్తానో అనే సందేహం వచ్చింది. కొన్ని సన్నివేశాల్ని టెస్ట్‌ షూట్‌గా చేసుకొని రమ్మన్నారు. ఆ సన్నివేశాలు నచ్చాక సినిమా చేయడానికి అంగీకారం తెలిపారు’’.

* ‘‘ఆరంభమైన కొంతసేపటికే ఆ కథా ప్రపంచంలోకి తీసుకెళ్లి లీనమయ్యేలా చేస్తుంది సినిమా. పాత్రలతో ప్రేక్షకుల మనసులతోపాటే ప్రయాణం చేస్తాయి’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని