Published : 10 Jan 2022 23:25 IST

Hero: అందుకే అశోక్‌కు చిరంజీవి, మహేశ్‌బాబు సినిమాలు చూడమని చెప్పా: శ్రీరామ్‌ ఆదిత్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘శమంతకమణి’, ‘భలేమంచి రోజు’, ‘దేవదాస్‌’ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు శ్రీరామ్‌ ఆదిత్య. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు, మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్‌ను హీరోగా ఆయన పరిచయం చేస్తున్న చిత్రం ‘హీరో’. గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా జనవరి 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్‌ మీడియాతో ముచ్చటించారు.

* నేను రాసుకున్న కథకు కొత్త నటుడైతేనే న్యాయం జరుగుతుందని భావించా. ఆ ప్రయత్నంలో భాగంగా గల్లా అశోక్‌ కనిపించారు. వాళ్ల అమ్మగారికీ కథ బాగా నచ్చటంతో సినిమాను పట్టాలెక్కించారు. ఆమే నిర్మాతగా మారారు. అశోక్‌కు నటనపై చాలా ప్యాషన్‌ ఉంది. మనలో చాలామంది ఏదో సందర్భంలో హీరో అవ్వాలనుకుంటారు. నలుగురిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఫీల్‌ అవుతుంటారు. ఈ పాయింట్‌తో సినిమా తీస్తే బాగుంటుందనుకుని, అలాంటి కొందరిని స్టడీ చేసి కథను రాశా. హీరో అవ్వాలనుకునే కుర్రాడి కథ కాబట్టి ‘హీరో’ అనే టైటిల్‌ పెట్టాం.

* పూర్తిస్థాయి కమర్షియల్‌ హంగులతో ఈ చిత్రాన్ని తీశాం. ఈ సినిమా నాన్‌స్టాప్‌గా అలరిస్తుంది. అశోక్‌ నటన చూస్తే కొత్తవాడనే ఆలోచనే ప్రేక్షకులకు రాదు. అంత బాగా హీరో పాత్రను పండించాడు. కౌబాయ్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కించాలనేది నా కోరిక. ఇలాంటి చిత్రాల గురించి ఆలోచిస్తుంటే కృష్ణ, మహేశ్‌బాబు గుర్తుకొస్తారు. కథానుసారం ఈ సినిమాలో అశోక్‌ను కౌబాయ్‌, జోకర్‌గా చూపించే అవకాశం వచ్చింది. అశోక్‌ను చూస్తే కొత్త‌వాడ‌నే ఫీలింగ్ రాకూడ‌ద‌ని చిరంజీవి, మ‌హేష్‌ బాబు తదితరుల సినిమాలు చూడ‌మ‌ని అతనికి చెప్పాను. ఆ హీరోల కామెడీ టైమింగ్ నాకు బాగా న‌చ్చుతుంది. అశోక్‌ యూఎస్‌లో చ‌దివినా తెలుగులో స్పష్టంగా మాట్లాడ‌తాడు, బాగా రాస్తాడు. అందుకే తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకున్నాడు.

* లాక్‌డౌన్‌లో సమయంలో ఓటీటీ వేదికగా చాలామంది ఇతర భాషా చిత్రాల్ని బాగా ఆస్వాదించారు. అలాంటి వారందరికీ ‘హీరో’ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. థియేటర్లలోనే చూడాల్సిన సినిమా ఇది. ఇందులో ప్రయోగంతోపాటు వాణిజ్యాంశాలు మెండుగా ఉన్నాయి. నిధి అగర్వాల్‌ చాలా బాగా నటించింది. కృష్ణగారు గతంలో నేను తీసిన ‘భలేమంచి రోజు’ సినిమా చూసి మెచ్చుకున్నారు. ఇప్పుడు ‘హీరో’ విషయంలోనూ అభినందించారు. చాలా బాగా తీశానని మెచ్చుకోవడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. నా అభిమాన దర్శకుడు రాజమౌళి ట్రైలర్‌ విడుదల చేయటం ఆనందాన్నిచ్చింది.

ఈ చిత్రాన్ని నవంబ‌ర్‌లోనే విడుద‌ల చేద్దామ‌నుకున్నాం. కానీ ప్రేక్షకులు థియేటర్లు వస్తారా లేదా అని ఆ సయమంలో సందేహించాం. సంక్రాంతి రావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా ప‌డ‌డంతో మా సినిమాతో వినోదం పంచేందుకు సిద్ధమయ్యాం. నాకు ఓటీటీ వైపు వెళ్లాలనే ఆలోచన లేదు. భవిష్యత్తులో నిర్మాణ బాధ్యతలు చేపడతానేమో చూడాలి. ప్రస్తుతానికి నా దగ్గర చాలా కథలున్నాయి. అయితే ఇంకా ఏది పట్టాలెక్కించాలో ఖరారు చేయలేదు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్