Ramabanam: ‘రామబాణం’ ఆ వెలితి పోగొడుతుంది: దర్శకుడు శ్రీవాస్‌

హీరో గోపీచంద్‌, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో చిత్రం ‘రామబాణం’. ఈ సినిమా మే 5న విడుదలకానున్న నేపథ్యంలో శ్రీవాస్‌ మీడియాతో ముచ్చటించారు.

Published : 02 May 2023 23:48 IST

హైదరాబాద్‌: ‘లక్ష్యం’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘లౌక్యం’ తదితర చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీవాస్‌ (Sriwass). గోపీచంద్‌ (Gopichand) హీరోగా ఆయన తెరకెక్కించిన మూడో సినిమా ‘రామబాణం’ (Ramabanam) మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘రామబాణం’ గురించి ఆయన చెప్పిన విశేషాలివీ..

* ఈ సినిమా ఎలా మొదలైంది?

శ్రీవాస్‌: ‘లక్ష్యం’, ‘లౌక్యం’ తర్వాత  గోపీచంద్‌తో నేను యాక్షన్‌ సినిమా చేయాలనుకున్నా. అయితే, మా కాంబినేషన్‌లో వచ్చిన గత రెండు చిత్రాల్లానే మూడో సినిమానీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తే బాగుంటుందని గోపీచంద్‌ సలహా ఇచ్చారు. ఆ మేరకు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో స్టోరీ చేస్తే బాగుంటుందనుకుని మొదలుపెట్టాం.

* టైటిల్‌ గురించి చెబుతారా?

శ్రీవాస్‌: ‘లక్ష్యం’ తర్వాత గోపీచంద్, జగపతి బాబు కలసి నటించిన సినిమా కాబట్టి ముందుగా ‘లక్ష్యం 2’ అని వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. అయితే, ఆ సినిమా వచ్చి చాలా సంవత్సరాలైంది. అప్పుడెప్పుడో వచ్చిన చిత్రానికి ఇది సీక్వెల్ అనుకునే అవకాశం ఉండడంతో ఆ పేరు పెట్టలేదు.

* ఆర్గానిక్‌ ఫుడ్‌ అనేది పెద్ద సబ్జెక్ట్‌. దాని మూలాల్లోకి వెళ్లారా?

శ్రీవాస్‌: ఆర్గానిక్‌ ఫుడ్‌ కాన్సెప్ట్‌ని కథకు ఎంత అవసరమో అంతే చూపించాం. పాండమిక్‌ అనంతరం అందరిలో పౌష్టికాహారంపై అవగాహన పెరిగింది. దాన్ని తెరపై చూపిస్తే కనెక్ట్‌ అవుతారనిపించింది.

* ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. మరి, ఇలాంటి కథ చేయడం మీకు రిస్క్ అనిపించించలేదా?

శ్రీవాస్‌: హారర్‌, థ్రిల్లర్‌ తదితర నేపథ్య సినిమాలు విజయం సాధిస్తే అందరూ అలాంటి చిత్రాలే చూస్తారని అనుకుంటాం. అలానే కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఒక మంచి సినిమా వస్తే బాగుణ్ను అని అనుకుంటాం. ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమా రావడం లేదనే వెలితి ఎప్పుడూ ఉంటుంది. ఆ వెలితిని ‘రామబాణం’ పోగొడుతుంది.

* మీరు ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రాలు చేస్తారు. ఇది మీ సేఫ్‌జోన్‌ అని భావిస్తారా?

శ్రీవాస్‌: ఫ్యామిలీ ఎమోషన్స్ కథలు తెరకెక్కించడం అంత తేలిక కాదండీ. అది సేఫ్ జానర్ కూడా కాదు. హారర్, థ్రిల్లర్స్, యాక్షన్‌ కథలకు సంబంధించి కొరియన్, ఇంగ్లిష్‌ చిత్రాలు చూసి ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. కానీ, కుటుంబ కథలకు అలా కుదరదు. కథ, అందులోని పాత్రలు మన జీవితానికి ముడిపడినవై ఉండాలి. ఇలాంటి తరహా సినిమాలు చేయడానికి నా నేపథ్యం ఓ కారణం కావచ్చు. దర్శకుడిగా అన్ని రకాల చిత్రాలు చేయడానికి నేను సిద్ధం.

* ఖుష్బూ స్టార్‌డమ్ ఈ సినిమాకి ఎలా ఉపయోగపడిందనుకుంటున్నారు?

శ్రీవాస్‌: ఖుష్బూ పోషించిన పాత్ర ఈ సినిమాకి కీలకం. ఆమే మెయిన్‌ పిల్లర్‌. జగపతిబాబు భార్య పాత్రలో, గోపీచంద్‌కు వదినగా ఎంతో హూందాగా కనిపిస్తారు. ఆమె, గోపీచంద్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తాయి.

* మిక్కీ జె. మేయర్  మ్యూజిక్ గురించి?

శ్రీవాస్‌: మిక్కీ జె. మేయర్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. నేపథ్య సంగీతం కూడా చాలా కొత్తగా ఉంటుంది.

* పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ గురించి?

శ్రీవాస్‌: ‘రామబాణం’ అనుకున్నంత స్థాయిలో రావడానికి కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

* మీరు రాసుకున్న కథను తెరకెక్కించడం ఇష్టమా? వేరే వాళ్ల కథను సినిమా తీయడం ఇష్టమా?

శ్రీవాస్‌: నాకు రెండూ ఇష్టమే. దాసరి నారాయణరావుగారిలా స్వయంగా కథ రాసుకుని దర్శకత్వం వహించగలను. ఎవరైనా మంచి పాయింట్‌ చెబితే రాఘవేంద్రరావుగారిలా స్క్రిప్ట్‌గా మలచుకుని సినిమాని తీయగలను. అయితే, రచయితల దగ్గర సిద్ధంగా ఉన్న కథల్లో మంచివి ఎంపిక చేసుకుని దర్శకత్వంపై ఎక్కువగా దృష్టి పెట్టాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం.

* ఒక్క ఎలిమెంట్‌తో సినిమాలు చేయడం కష్టమా? మిక్స్‌డ్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమాలు కష్టమా?

శ్రీవాస్‌: యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటే కేవలం యాక్షన్‌పై శ్రద్ధ పెడితే సరిపోతుంది. యాక్షన్‌, ఎమోషన్‌, సామాజిక అంశం కలిసిన ‘రామబాణం’ లాంటి సినిమా చేయాలంటే చాలా కష్టపడాలి. ఇందులోని ఒక్కో ఎలిమెంట్‌తో ఒక్కో చిత్రం చేయొచ్చు. ‘రామబాణం’ ఫుల్‌మీల్స్‌లా ఉంటుంది. ఈ వేసవిలో ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని