Rajamouli: ఆమె ప్రశ్నే రాజమౌళిలో మార్పు తెచ్చింది.. రూ.5000తో మొదలై!

ప్రముఖ దర్శకుడు ఎస్‌. ఎస్‌. రాజమౌళి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం..

Published : 10 Oct 2022 10:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పనిలో ఆయన పర్‌ఫెక్షనిస్ట్‌. అందుకే తను ఎలాంటి కథను తెరకెక్కించినా అది సూపర్‌ హిట్‌. ఆయనది హీరోకు తగ్గ కటౌట్‌. అయినా దర్శకత్వానికే ఆయన ఓటు. ఒక్క ప్రశ్న మార్చింది ఆ డైరెక్టర్‌ రూటు. ఆ దర్శకుడు మరెవరో కాదు ఎస్‌. ఎస్‌. రాజమౌళి (SS Rajamouli). సెన్సేషన్‌, సక్సెస్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రయాణం గురించి తెలుసుకుందాం.. (Happy Birthday Rajamouli)

పుస్తకాల పురుగు..

రాజమౌళి (Rajamouli) కర్ణాటకలోని రాయచూర్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. కుటుంబమంతా అక్కడే ఉండేది. రాజమౌళి మాత్రం తన సోదరితో కలిసి కొవ్వూరులో నానమ్మ దగ్గర ఉండేవారు. ఆయన బాల్యమంతా అక్కడే గడిచింది. ఆ ఊరి గ్రంథాలయంలో ఎక్కువగా ‘అమరచిత్ర కథలు’ చదువుతూ రాజమౌళి వేరే ప్రపంచంలో విహరించేవారు. బాలభారతం, రామాయణం, బాల భాగవతం.. ఇలా ప్రతి పుస్తకాన్ని ఆయన చదివేవారు. ‘ఏదైనా పుస్తకం చదువు. లేదంటే ఆడుకో ఖాళీగా మాత్రం ఉండకు’ అని తన నానమ్మ చెప్పిన మాటలే పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచాయని చెబుతుంటారాయన.

కథలు చదవడమే కాదు వాటిని ఇతరులకు చెప్పటమూ నానమ్మ నుంచే నేర్చుకున్నారు జక్కన్న. పుస్తకాల్లోని కథలకు తనదైన శైలిలో కొన్ని విశేషాలు జోడించి చెప్పటంతో రాజమౌళికి అందరూ ఫిదా అయ్యేవారు. సాధారణ కథలను భారీ తరహా కథలుగా మార్చటం అప్పుడే అలవరచుకున్నారు. క్రమంగా క్రియేటివిటీ ఎక్కువైపోవడంతో రాజమౌళి చెప్పింది వినలేక కొందరు అసహనం వ్యక్తం చేసేవారట. ‘వామ్మో ఇతను మళ్లీ కథ మొదలుపెడుతున్నాడురా’ అని అనుకునేవారట. ఆ సంఘటనలు రాజమౌళిని తాను ఉన్న ఊరి వదిలి వేరు ప్రాంతానికి వెళ్తే బాగుణ్ణు అని అనిపించేలా చేశాయి.

అప్పట్లో అప్పారావుగా..

రాజమౌళి బాధపడిన ఆ సమయంలోనే.. ఏలూరులో ఉండే అత్తయ్య ఆయన్ను తీసుకెళ్లింది. అక్కడ.. నాలుగో తరగతి నుంచి నేరుగా ఏడో తరగతిలో చేరారాయన. అప్పటి రికార్డుల్లో రాజమౌళి పేరు విజయ అప్పారావు అని ఉండేది. అది వాళ్ల తాతయ్య పేరు. ఆ పేరుతో తనను పిలిస్తే మొదట్లో బాగానే అనిపించినా ఆ తర్వాత  తెగ ఫీలయిపోయేవారట జక్కన్న. రాజమౌళి ఇంటర్మీడియట్‌ చదివే సమయానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ రచయితగా చెన్నైలో స్థిరపడ్డారు. దాంతో జక్కన్న కూడా అక్కడికి వెళ్లారు.

ఇంటర్‌ పూర్తిచేశాక రాజమౌళి కొన్నాళ్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో ఆయన సోదరుడు ఎం. ఎం. కీరవాణికి పెళ్లైంది. ఆయన సతీమణి శ్రీవల్లి రాకతో రాజమౌళి జీవితంలో మార్పు చోటు చేసుకుంది. ‘జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నారు’ అని ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని రాజమౌళి అప్పటి నుంచే జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవటం ప్రారంభించారు. విజేయంద్ర ప్రసాద్‌ చెప్పటంతో కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్‌ అసిస్టెంట్‌గా చేరారు. తర్వాత, విజయేంద్ర ప్రసాద్‌కి మంచి పేరు రావటంతో ఎక్కడో పనిచేయటం ఎందుకని ఆయన దగ్గరే అసిస్టెంట్‌గా చేరారు. ప్రతి సన్నివేశం పూర్తవగానే ‘నేనైతే ఇంకా బాగా తీసేవాడిని’ అని జక్కన్న అనుకుంటుండేవారు. ఆ ఆలోచనే ఆయనలోని దర్శకుడిని బయటకు తీసింది.

నాన్న దగ్గర చేస్తే సొంత గుర్తింపు ఉండదనుకున్న రాజమౌళి.. హైదరాబాద్‌కు వచ్చి గుణ్ణం గంగరాజు ఇంట్లో కొన్నాళ్లు ఉన్నారు. ఇక్కడ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటితో కలిసి తిరిగేవారు. ఆ తర్వాత వారిద్దరు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర పనిలో చేరారు. వీరితోపాటు ‘నా అల్లుడు’ డైరెక్టర్‌ ముళ్లపూడి వర రాఘవేంద్రరావు దగ్గర సహాయకుడిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వానికి ప్రకటనలు చేసేందుకు దర్శకేంద్రుడికి నచ్చేలా కాన్సెప్ట్‌ తయారు చేస్తే ఒక ప్రకటనకు రూ. 5000 ఇచ్చేవారు. అదే జక్కన్నకు తొలి సంపాదన.

రోజుకు పద్దెనిమిది గంటల కష్టం..

ప్రకటనలు విజయవంతం అయ్యాక ‘శాంతి నివాసం’ సీరియల్‌కి పనిచేసే అవకాశం వచ్చింది. ముళ్లపూడి వర, రాజమౌళిలతో రాఘవేంద్రరావు ఆ ధారావాహిక మొదలుపెట్టారు. జక్కన్న సన్నివేశాన్ని వివరించి, దాని కోసం పనిచేసే తీరు దర్శకేంద్రుడికి బాగా నచ్చింది. ‘శాంతి నివాసం’ సమయంలో రాజమౌళి ఏడాదిన్నరపాటు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడేవారు.

సీరియల్‌ పూర్తయిన ఏడాదికి రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్‌ నెం. 1’ సినిమా వచ్చింది. ఆ సినిమానూ ముళ్లపూడి వర, రాజమౌళి కలిసి చేయాల్సింది. కానీ, ఇద్దరూ చేస్తే సినిమాపై ప్రభావం పడుతుందనే అభిప్రాయంతో వర ఆ ప్రాజెక్టును వదిలేశారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రాజమౌళి మెగాఫోన్‌ పట్టిన ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. అయినా జక్కన్నలో ఏదో వెలితి. తొలి ప్రయత్నంలో తనదైన ముద్ర వేయలేదనే భావన ఆయనది. తదుపరి ‘సింహాద్రి’ అనే ఓ పవర్‌ఫుల్‌ కథని తెరకెక్కించి, తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత ‘సై’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లతో రాజమౌళి ఎంతటి సంచలనం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఓ భారీ ప్రాజెక్టు ఖరారు చేశారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథతో యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందించనున్నారు.

మరికొన్ని:

*  రాజమౌళి హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాసేందుకే ఎక్కువ ఇష్టపడతారు.

* సన్నివేశం అనుకున్నది అనుకున్నట్టు వచ్చేంత వరకు సమయాన్ని, నటుల ఓపికను పట్టించుకోకుండా టేక్‌ మీద టేక్‌ తీస్తుంటారు కాబట్టే రాజమౌళిని జక్కన్న అంటారు. ఇంతకీ ఆ పేరుపెట్టిందెవరో కాదు.. నటుడు  రాజీవ్‌ కనకాల

* నటుల నుంచి తనకు కావాల్సిన ఔట్‌పుట్‌ రాబట్టుకోవటమే తప్ప పూర్తి స్థాయిలో నటించాలంటే రాజమౌళికి నచ్చదు. అందుకే ఆయన అతిథి పాత్రల్లోనే కనిపించారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని