Pushpa: ‘పుష్ప: ది రూల్‌’ కోసం సుక్కు మార్పులు చేస్తున్నారా?

‘సెకండ్‌ ఇంటర్వెల్‌’ అంటూ ‘పుష్ప: ది రైజ్‌’(pushpa: the rise) చివర్లో ఎండ్‌కార్డు వేసి ఆసక్తిని రేకెత్తించారు దర్శకుడు సుకుమార్‌.

Published : 11 Jan 2022 17:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సెకండ్‌ ఇంటర్వెల్‌’ అంటూ ‘పుష్ప: ది రైజ్‌’(pushpa: the rise) చివర్లో ఎండ్‌కార్డు వేసి ఆసక్తిని రేకెత్తించారు దర్శకుడు సుకుమార్‌. సాధారణ కూలీగా జీవితం మొదలు పెట్టిన పుష్పరాజ్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎర్రచందనం సిండికేట్‌కు నాయకుడెలా అయ్యాడో ఇందులో చూపించారు. ‘పుష్ప: ది రూల్‌’లో మొదటి భాగానికి మించి యాక్షన్‌ డ్రామా ఉంటుందని టాక్‌ వినిపిస్తోంది. పాన్‌ ఇండియా సినిమాగా విడుదలైన ‘పుష్ప-1’కు హిందీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో వారిని కూడా దృష్టిలో పెట్టుకుని రెండో భాగం స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేయనున్నారట దర్శకుడు సుకుమార్‌. తొలుత అనుకున్న దాని ప్రకారం కాకుండా, హిందీ ప్రేక్షకులను కూడా మెప్పించేవిధంగా ఆ మార్పులు ఉంటాయట.

అయితే, ‘పార్ట్‌-2’ కోసం హిందీ నటులను కూడా రంగంలోకి దింపనున్నట్లు వినిపిస్తున్న టాక్‌ను మాత్రం చిత్ర బృందం తోసిపుచ్చుతోంది. పాన్‌ ఇండియా హీరోగా అల్లు అర్జున్‌ స్టార్‌డమ్‌ సరిపోతుందని భావిస్తోంది. దీంతో పాటు, రెండో భాగంలో పుష్పతో ఢీ అంటే ఢీ అనేలా ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర ఉంటుందట. తనని అవమానించిన పుష్పరాజ్‌పై పగ తీర్చుకునేందుకు భన్వర్‌సింగ్‌ వేసే ఎత్తులు, వాటి వల్ల పుష్ప పడే ఇబ్బందులు భావోద్వేగంతో సాగుతాయని అంటున్నారు. ప్రస్తుతం ‘పుష్ప’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న చిత్ర బృందం త్వరలోనే రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌, లొకేషన్ల వేట మొదలు పెట్టనుంది. ఏప్రిల్‌ నెలలో చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఈలోగా హిందీ ప్రేక్షకులను మెప్పించేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేయనున్నారని తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని