Welcome To Tihar College: అలాంటి విద్యా వ్యవస్థ అవసరం

‘‘ర్యాంకుల పోటీలో పడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా.. ఆలోచింపజేసే విధంగా చూపించే చిత్రమే మా ‘వెల్కమ్‌ టు తిహార్‌ కాలేజ్‌’.

Updated : 28 Oct 2022 08:55 IST

‘‘ర్యాంకుల పోటీలో పడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా.. ఆలోచింపజేసే విధంగా చూపించే చిత్రమే మా ‘వెల్కమ్‌ టు తిహార్‌ కాలేజ్‌’ (Welcome To Tihar College). యువతరం కలలు.. ఆశలు.. ఆలోచనలు.. అభిరుచులకు అద్దం పట్టేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు సునీల్‌ కుమార్‌ రెడ్డి (Sunil kumar Reddy). ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ వంటి సందేశాత్మక సినిమాలతో మెప్పించిన ఆయన.. ఇప్పుడు ‘వెల్కమ్‌ టు తిహార్‌ కాలేజ్‌’ చిత్రంతో పలకరించనున్నారు. మనోజ్‌ నందమ్‌, ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సునీల్‌ కుమార్‌.

‘‘పిల్లలకు విజ్ఞానంతో పాటు తమ మీద తమకు విశ్వాసం కలిగించేలా చేయాలి విద్యా వ్యవస్థ. అంతే కానీ, ర్యాంకులే జీవితం అన్నట్లుగా ఉండకూడదు. ఈ విషయాల్నే సినిమాలో చూపించాం. దీన్ని విద్యార్థుల కోణం నుంచే తెరపైకి తీసుకొచ్చాం. వాళ్లు పడే బాధలు ఎలా ఉంటాయో ఆసక్తికరంగా చూపించాం. కథకు తగ్గట్లుగా ఉంటారనే మనోజ్‌ నందమ్‌, చక్రవర్తి, మనీషా, సోనీ రెడ్డిలను ప్రధాన పాత్రలకు తీసుకున్నాం. ఈ నాలుగు పాత్రల్లో యువత తమని తాము చూసుకుంటారు’’.

* ‘‘ఈ రోజుల్లో ఉన్న మన విద్యా విధానం వల్ల యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ర్యాంకుల కోసం పిల్లల ప్రాణాల్ని తోడేస్తున్నాం. చాలా దేశాల్లో ఇలాంటి విద్యా విధానం లేదు. కొన్ని దేశాల్లో ప్రకృతితోనే ఎన్నో పాఠాలు నేర్పుతున్నారు. అలాంటి విద్యా వ్యవస్థ ఇక్కడా రావాలి. లేదంటే పిల్లలు ఇంకా నలిగిపోతారు. ఈరోజుల్లో ఫలానా దాని గురించి తెలుసుకోవాలంటే గూగుల్‌ని అడిగితే చెప్పేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ చదువుల్ని బట్టీ పట్టాల్సిన అవసరం ఏముంది. క్రియేటివ్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ ఉంటే బాగుంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’’.

* ‘‘ప్రస్తుతం చదలవాడ శ్రీనివాసరావు నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నా. అలాగే ట్రాన్స్‌ జెండర్స్‌పై ఓ చిత్రం చేయబోతున్నా. ఇది ప్రస్తుతానికి స్క్రిప్ట్‌ దశలో ఉంది. త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్తాం’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని