Director teja: కేవలం స్టార్స్‌ని చూసి సినిమాకెళ్లేలా ఉంటే ఫ్లాప్‌లే రావు!
తేజ సినిమా అనగానే కొత్తతరం నటులు గుర్తొస్తారు. ఆయన సినిమాలతో తారలుగా ఎదిగినవాళ్లు చాలామందే. ఆయన మరోసారి కొత్త ప్రతిభని పరిచయం చేస్తూ తీసిన చిత్రం ‘అహింస’.
తేజ సినిమా అనగానే కొత్తతరం నటులు గుర్తొస్తారు. ఆయన సినిమాలతో తారలుగా ఎదిగినవాళ్లు చాలామందే. ఆయన మరోసారి కొత్త ప్రతిభని పరిచయం చేస్తూ తీసిన చిత్రం ‘అహింస’. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు మనవడు దగ్గుబాటి అభిరామ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. పి.కిరణ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
కొత్తతరాన్ని తెరకు పరిచయం చేయడం మీకు కొత్త కాదు. ఇదివరకటితో పోలిస్తే అభిరామ్‌ని పరిచయం చేయడంలో ప్రత్యేకత ఏమైనా ఉందా?
కథే ఆ వ్యత్యాసం చూపిస్తుంది. కథకి ఏం అవసరమో అదే చేస్తుంటా. మొదట కథని పట్టుకుంటా. అది ఎటు తీసుకెళితే అటు వెళతా. అలా కాకుండా... కథని కాదని ‘ఇతను ఫలానా అబ్బాయి కాబట్టి ఇది చేయాలి. ఇలా ఫైట్లు పెట్టాలి, డ్యాన్సులు పెట్టాలి’ అనే తత్వం నాది కాదు. అయితే ఇప్పుడు నేను సినిమా చేసింది రామానాయుడు కుటుంబమంలోని ఓ అబ్బాయితో. పెద్ద కుటుంబాలకి చెందిన హీరోలతో సినిమాలు చేసినప్పుడు సమస్య ఏమిటంటే వీళ్లని అందరూ భూతద్దంతో చూస్తారు. పోలికలు కూడా ఎలా ఉంటాయంటే... ఇప్పటికే స్టార్లు అయిపోయిన ఆ కుటుంబంలోని వెంకటేష్, రానా కోణంలోనే ఇతన్నీ చూడటం మొదలుపెడతారు. అదే ఎవ్వరికీ తెలియనివాళ్లని పరిచయం చేశామంటే... ఏదో ఒకడు వచ్చాడు వెళ్లాడన్నట్టే ఉంటుంది. సహజంగానే కొత్త నటులకి ఉండే బెరుకు, సమస్యలు కొన్ని ఉంటాయి. పెద్ద కుటుంబంలో నుంచి వచ్చాడు కాబట్టి వాటిని ఇంకా పెద్దగా చూస్తారు. ఇప్పుడు నాకంటే కూడా అభిరామ్ ఈదటం పెద్ద కష్టం.
ఇలాంటి హీరోల సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి కూడా ఎక్కువే ఉంటుంది. వాటితో మంచి ప్రారంభ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా?
ప్రేక్షకులు ఇప్పుడు చాలా స్మార్ట్‌గా తయారయ్యారు. ట్రైలర్, పోస్టర్ చూడగానే ఓ నిర్ణయానికొస్తారు.అప్పుడు ఆ సినిమాకీ, ప్రేక్షకుడికీ ఓ బంధం ఏర్పడుతుంది. దాన్నే మ్యాజిక్ అంటాం. అప్పుడే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు. ఇవన్నీ జరగకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్లడు. కేవలం స్టార్స్‌ని చూసి సినిమాకెళ్లే పరిస్థితులే ఉంటే పరాజయాలనేవే రావు కదా.
ఈ కథకి అభిరామ్‌నే ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి?
నేను నిర్మాత డి.రామానాయుడు సర్‌కి మాట ఇచ్చా. ఆ మాట ప్రకారమే అభిరామ్‌తో సినిమా చేశా. మరో విషయం ఏమిటంటే... నేను నా పెట్టుబడులు మనుషులపైనే పెడతాను. ఆస్తులు, డబ్బులు, నగలపై పెట్టుబడి పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఓ మనిషి నచ్చాడంటే చాలు... అతను మంచోడా చెడ్డోడా అనేది చూడను. అతనితో సినిమా చేయాలనుకుంటే చేసేస్తా. ఎందుకు చేస్తున్నానంటే నాకూ తెలియదు. కొంతమందిని ఎందుకు పరిచయం చేశానో నాకూ అర్థం కాదు.
‘అహింస’ కథకి మూలం ఏమిటి?
ఫిలాసఫీ ఆధారం చేసుకుని రాసిన కథ ఇది. అహింసని నమ్మే దేశం మనది. కానీ దేశంలో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి మనం నమ్మే అహింసావాదాన్ని అనుసరిస్తే అవి జరగకూడదు కదా? మనం అనుసరించడం లేదంటే మనకి అది అర్థం కావడం లేదు, ఆ విషయంలో మనకు స్పష్టం లేదనే కదా! అసలు అహింసని ఎలా అనుసరించాలనే విషయాన్నే వాణిజ్యాంశాలు మేళవించి చెప్పే ప్రయత్నం చేశా.
మరోసారి అటవీ నేపథ్యంలో సినిమా తీయడానికి కారణం?
‘జయం’ తర్వాత ఆ నేపథ్యంలో సినిమా తీయడం ఇప్పుడే. కానీ ‘జయం’ విజయవంతమైన సినిమా కాబట్టి దాంతో పోల్చి చూస్తున్నారు. సినిమా అనేది దృశ్య, శ్రవణ మాధ్యమం. కథకి తగ్గట్టుగా ఓ మంచి కాన్వాస్ కూడా ఉండాలి. ఈ కథకి ఆ కాన్వాస్ కావాలనిపించింది. అందుకే మధ్యప్రదేశ్ అడవుల్లో ఈ సినిమాని చిత్రీకరించాం. ఇందులో 14 యాక్షన్ ఘట్టాలు ఉంటాయి. అవన్నీ కూడా కథలో భాగంగానే ఉంటాయి. అందులో ఓ నాలుగు పోరాట ఘట్టాల్ని నేనే డిజైన్ చేసి తెరకెక్కించా. ఆర్పీ పట్నాయక్, అనూప్ కలిసే సంగీతం సమకూర్చారు.
కొత్తవాళ్లతో చేసినట్టుగా... అగ్ర తారలతో సినిమాలు చేయరెందుకు?
పేరున్న తారలతో ఎక్కువ డబ్బు కోసం ఎక్కువ పేరు కోసమే కదా చేయాలి. నేను చూడని ఆస్తులు, నేను చూడని పేరా? ఇప్పుడు కూడా నేను ఏ సినిమాకీ ఇంత డబ్బు ఇవ్వండని అడగను. నాకు ఎంత ఇవ్వాలనుకుంటారో అంత ఇవ్వండని చెబుతా. ఫుట్‌పాత్ నుంచి వచ్చిన వాడిని నేను. నాకొకరు బ్రేక్ ఇచ్చారు. కానీ చాలా ప్రతిభ ఉండి కూడా, మార్కెట్ చేసుకోలేక కృష్ణానగర్‌లో తిరుగుతున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లకి ఎవరున్నారు? నేనున్నంత వరకూ వాళ్లకి నేను అవకాశాలు ఇస్తూనే ఉంటా. ఓ పెద్ద స్టార్‌తో సినిమా చేసినా సరే, అందులో చాలావరకు కొత్తవాళ్లకి అవకాశాలు ఇచ్చాను. మా ఇంట్లోవాళ్లకి కూడా డబ్బు, ఆస్తులపై ఆసక్తి లేదు. ఫలానా వారిలా సినిమా చేయవెందుకు అని నన్నెప్పుడూ అడగరు.
మీ ముందున్న తదుపరి లక్ష్యం ఏమిటి?
ఇప్పటివరకూ నటుల్ని పరిచయం చేశాను. ఇకపై కొత్తరకం సినిమాలు తీసే దర్శకుల్ని పరిచయం చేయాలని ఉంది. రామ్‌గోపాల్ వర్మ, మణిరత్నం, శేఖర్ కమ్ముల, తేజ... ఇలా మాకు ఒకొక్కరికీ ఒక్కో శైలి ఉంది. అలా కొత్త స్టైల్‌తో సినిమాలు తీసే దర్శకుల్ని తీసుకొస్తే పరిశ్రమ మరో స్థాయికి వెళుతుందని నా అభిప్రాయం.
తదుపరి మీరు రానాతో చేయబోయే సినిమా ఎలా ఉంటుంది?
‘రాక్షసరాజు’ పేరుతో ఆ సినిమా ఉంటుంది.
‘‘స్టూడియో... థియేటర్ నాకు దేవుడి గుడితో సమానం. ఈ గుడిలో ప్రారంభమై, ఆ గుడిలో ప్రదర్శితం అవుతాయి. ఈ మధ్యలోనే స్టార్లు తయారవ్వడం, లాభాలు రావడం, పోగొట్టుకోవడం అన్నీ జరుగుతాయి. ఆ రెండు గుళ్లనీ కాపాడుకోవాలి. నేను దర్శకనిర్మాతనే కాదు, ఎగ్జిబిటర్‌ని కూడా. నాకు థియేటర్ ఉంది. దాన్ని అమ్మేసి ఆ డబ్బుని బ్యాంక్‌లో వేసుకుని హాయిగా బతికేయొచ్చు. కానీ నాకు అది ఇష్టం లేదు. నా థియేటర్‌లో పాప్‌కార్న్ అయినా, ఏదైనా సరే రూ.వందకి మించకూడదనే నిబంధన పెట్టా. సమోసాలు కూడా వేడివేడిగా ఉండాల్సిందే. ప్రేక్షకుడి ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం అని నమ్ముతా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
రోజుకు నాలుగు గంటలు ఫోన్లోనే.. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం
-
Hyderabad: వర్షంలోనూ కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనాలు
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2
-
Rahul Gandhi: రంపం పట్టిన రాహుల్.. వడ్రంగి పనివారితో చిట్‌చాట్
-
‘మార్కెట్లో సంపద సృష్టికి ఆయనే నిదర్శనం’.. వృద్ధుడి వీడియో వైరల్