Teja: ఉదయ్‌కిరణ్‌ చనిపోవడానికి కారణాలు నాకు తెలుసు: తేజ

‘నేనే రాజు నేనే మంత్రి’తో చాలా సంవత్సరాల తర్వాత హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు తేజ..  ప్రస్తుతం ‘అహింస’ కోసం వర్క్‌ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఉదయ్‌ కిరణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 18 Nov 2022 15:52 IST

హైదరాబాద్‌: నటుడు ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య గురించి ప్రముఖ దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి తనకంతా తెలుసని అన్నాడు. ‘‘నువ్వు నేను’ సినిమా సమయంలో ఎం.ఎస్‌. రాజు ఓసారి నాకు ఫోన్‌ చేశారు. తన దగ్గర ఒక కథ ఉందని.. ఉదయ్‌ ఫొటోలు పంపించమని.. ఓకే అయితే తన సినిమాలోకి తీసుకుంటానని చెప్పారు. వెంటనే నేను ‘గాజువాక పిల్లా’ వీడియోను ఆయనకు పంపించా. అది చూసిన ఆయన ఉదయ్‌కు ‘మనసంతా నువ్వే’లో ఆఫర్‌ ఇచ్చాడు. అలా, ఉదయ్‌ కిరణ్‌కు ‘నువ్వు నేను’, ‘చిత్రం’, ‘మనసంతా నువ్వే’తో బ్యాక్‌ టు బ్యాక్‌ మూడు హిట్స్‌ వచ్చాయి. దానివల్ల అతడు కాస్త బ్యాలెన్స్‌ మిస్‌ అయ్యాడు’’

‘‘స్టార్‌డమ్‌ వచ్చినప్పుడు మనిషి బ్యాలెన్స్‌ మిస్‌ కావడం సర్వసాధారణం. నేను దాన్ని పొగరు అనుకోలేదు.. అమాయకత్వం అనుకున్నా. ఆ తర్వాత అతడు చాలా సినిమాల్లో నటించాడు. సమస్యలూ ఎదుర్కొన్నాడు. అప్పుడు నేనే పిలిచి ‘ఔనన్నా కాదన్నా’లో అవకాశం ఇచ్చా. ఆ సినిమా షూటింగ్ సమయంలో  అతడు విచారం వ్యక్తం చేశాడు. ‘మీ విషయంలో నేను కాస్త పొగరుగా వ్యవహరించినా.. నన్ను గుర్తుపెట్టుకుని మరీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. మీ పాదాలు తాకుతా.. క్షమించానని ఒక్కసారి చెప్పండి చాలు’ అన్నాడు. అవేమీ అవసరం లేదని చెప్పా. అతడి జీవితంలో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నాకు అన్ని విషయాలు చెప్పాడు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలూ నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతా. నేను చనిపోయేలోపు ఆ విషయాలు వెల్లడిస్తా. ఇప్పుడు చెప్పడం సరైన పద్ధతి కాదు’’ అని తేజ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని