Bimbisara: రోజూ కొత్త ప్రపంచంలోకి వెళ్లొచ్చాం!

‘‘ఇండస్ట్రీలో కొత్త వాళ్లకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంది. మంచి బలమైన కథతో వస్తే చాలు.. అవకాశమివ్వడానికి ప్రతి హీరో సిద్ధంగానే ఉన్నార’’న్నారు వశిష్ఠ్‌. ‘బింబిసార’తో తెలుగు తెరకు పరిచయమవుతున్న కొత్త దర్శకుడాయన. కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన చిత్రమిది. కేథరిన్‌, సంయుక్తా మేనన్‌ కథానాయికలు.

Published : 02 Aug 2022 16:35 IST

‘‘ఇండస్ట్రీలో కొత్త వాళ్లకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంది. మంచి బలమైన కథతో వస్తే చాలు.. అవకాశమివ్వడానికి ప్రతి హీరో సిద్ధంగానే ఉన్నార’’న్నారు వశిష్ఠ్‌. ‘బింబిసార’తో తెలుగు తెరకు పరిచయమవుతున్న కొత్త దర్శకుడాయన. కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన చిత్రమిది. కేథరిన్‌, సంయుక్తా మేనన్‌ కథానాయికలు. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారాయన.

నాకు ఫాంటసీ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే తొలి ప్రయత్నంగా ఈ టైమ్‌ ట్రావెల్‌ చిత్రాన్ని ఎంచుకున్నా. ఈ కథ సిద్ధం చేయడానికి నాకు బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ స్ఫూర్తినిచ్చింది. ఇప్పటివరకు వచ్చిన టైమ్‌ ట్రావెల్‌ సినిమాల్లో హీరోలంతా ప్రస్తుతం నుంచి గతానికి లేదా భవిష్యత్తుకు వెళ్లడం చూశాం. ఇందులో హీరో గతం నుంచి ప్రస్తుతానికి వస్తాడు. కర్మ సిద్ధాంతంపై ఆధారపడి సాగే కథ ఇది. రావణాసురుడు, కీచకుడు, భకాసురుడు లాంటి రాక్షసులను మించిన రాక్షసుడైన బింబిసారుడు.. చివరికి ఎలా మారాడన్నది కథాంశం. ఇందులో కల్యాణ్‌రామ్‌ రెండు భిన్నమైన వేషధారణల్లో కనిపిస్తారు.

* ‘బింబిసార’.. 500ఏళ్ల క్రితం కథ. ఈ సినిమా కోసం త్రిగర్తల అనే సామ్రాజ్యాన్ని సృష్టించాం. అప్పట్లో ఎలా ఉండేదన్నది పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప.. ఎవరూ చూసింది లేదు. ఆ కాలానికి సంబంధించిన ప్రతిదీ గ్రాఫిక్స్‌లో సృష్టించుకోవాల్సిందే. సవాల్‌తో కూడుకున్న పని ఇది. అయితే దీన్ని మేం ఆస్వాదిస్తూ పూర్తి చేశాం. చిత్రీకరణ జరిగినన్ని రోజులూ మాకు ప్రతిరోజూ ఓ కొత్త ప్రపంచంలోకి టైమ్‌ ట్రావెల్‌ చేసి వస్తున్నట్లుగా ఉండేది. ఈ ప్రపంచం ప్రేక్షకులకూ కొత్త అనుభూతి పంచుతుంది. ఈ కథకు, చారిత్రక పురుషుడు బింబిసారుడికి ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా ఫిక్షనల్‌ కథాంశం. అందరూ ఈ సినిమాని ‘మగధీర’, ‘బాహుబలి’ చిత్రాలతో పోలుస్తున్నారు. అంత గొప్ప సినిమాలతో మా చిత్రాన్ని పోలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. వాస్తవానికి ఆ చిత్రాలకు మా ‘బింబిసార’ పూర్తి భిన్నంగా ఉంటుంది.

* ఈ కథ సిద్ధం చేశాక.. దీన్ని కల్యాణ్‌రామ్‌ చేస్తేనే బాగుంటుందనిపించింది. అప్పటికే నాకు తనతో పరిచయం ఉంది. ‘పటాస్‌’ చిత్ర సమయం నుంచి ఇద్దరం కలిసి ప్రయాణిస్తున్నాం. ఆ పరిచయంతోనే 2019లో ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆయనకు మెసేజ్‌ పెట్టా. ‘ఓ మంచి కథ ఉంది.. కలవొచ్చా’ అని. వెంటనే నన్ను పిలిపించి.. కథ విన్నారు. నచ్చడంతో.. చేద్దామన్నారు. తర్వాత నిర్మాత హరికృష్ణకు కథ వినిపించా. ఆయనా ఓకే చెప్పేశారు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది. దీన్ని మేము 135 రోజుల్లో చిత్రీకరించాం. గ్రాఫిక్స్‌ వర్క్స్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించాం.

* ఈ చిత్రానికి తొలుత ఎం.ఎం.కీరవాణినే సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకున్నాం. అయితే అప్పటికి ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మా సినిమా చేస్తారో? లేదో? అన్న సందేహంతో ఆయన్ని సంప్రదించలేదు. ఆ సమయంలో నా మనసులో మెదిలిన మరో సంగీత దర్శకుడు చిరంతన్‌ భట్‌. ఆయన అప్పటికే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘కంచె’ లాంటి చిత్రాలు చేసి ఉండటంతో.. తనని సంప్రదించాం. ఈ కథ వినిపించగానే ‘‘కర్మ..’’ గీతం ఇచ్చేశారు. దీంట్లోని ఓ జానపద గీతాన్ని వరికుప్పల యాదగిరి ట్యూన్‌ చేశారు. నేపథ్య సంగీతం కోసం సంతోష్‌ నారాయణను అనుకున్నా.. కుదర్లేదు. దీంతో కీరవాణిని సంప్రదించాం. విషయం చెప్పగానే ఆయన సినిమా చూసి చెప్తానన్నారు. మాకేమో లోపల టెన్షన్‌.. ఒప్పుకుంటారో లేదోనని. కానీ, ఆయన సినిమా చూసిన వెంటనే నేపథ్య సంగీతం అందిస్తానని చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది.  

* నేను పుట్టి పెరిగినదంతా హైదరాబాద్‌లోనే. మొదటి నుంచీ డైరెక్షన్‌ అంటేనే ఇష్టం. ఆరంభంలో హీరోగా ‘ప్రేమలేఖ రాశా’ అనే చిత్రం చేశా. తర్వాత ఇది నా దారి కాదనిపించి.. వెనక్కి వచ్చి కథలు రాసుకోవడంపై దృష్టి పెట్టా. రవితేజ, శిరీష్‌ వంటి వారికి కథలు వినిపించా. ఏదీ కుదర్లేదు. ఈ ‘బింబిసార’కు ముందు కూడా కల్యాణ్‌రామ్‌కు రెండు కథలు వినిపించా. వర్కవుటవ్వలేదు. ఏదేమైనా ఇప్పుడింత పెద్ద చిత్రంతో తెలుగు చిత్రసీమకు దర్శకుడిగా పరిచయమవుతున్నా. చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం నా దృష్టంతా ‘బింబిసార 2’పైనే ఉంది. ఇది ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశముంది. దీన్ని ఓ ఫ్రాంఛైజీలా
కొనసాగించే ఆలోచన ఉంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts