Thalapathy 68: డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు కల నిజమైంది.. విజయ్‌తో సినిమా ఫిక్స్‌ అయింది

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ హీరోగా దర్శకుడు వెంకట్‌ ప్రభు ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఆ వివరాలివీ..

Published : 21 May 2023 15:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ అగ్ర నటుడు విజయ్‌ (Vijay) హీరోగా దర్శకుడు వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) ఓ సినిమా తెరకెక్కించే అవకాశాలున్నాయంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై తాజాగా స్పష్టత వచ్చింది. విజయ్‌- వెంకట్‌ ప్రభు కాంబోకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడింది. #thalapathy68 వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రాన్ని ప్రకటించిన వెంకట్‌ ప్రభు.. ‘విజయ్‌తో సినిమా చేయాలనే నా కల నిజమైంది’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఓ వీడియో ద్వారా దర్శక, నిర్మాతలు, హీరో, సంగీత దర్శకుడి వివరాలను పజిల్‌లో చూపించిన తీరు సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కళపతి ఎస్‌. అఘోరం నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించనున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలోని హీరోయిన్‌ వివరాలు ఇంకా వెల్లడించలేదు. వెంకట్‌ ప్రభు గత చిత్రాల్లానే ఈ సినిమా కూడా విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందబోతున్నట్టు తెలుస్తోంది.

విజయ్‌ ప్రస్తుతం ‘లియో’ (Leo) సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. త్రిష కథానాయిక. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌, ప్రియా ఆనంద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 19న విడుదల కానుంది. సూర్య ‘రాక్షసుడు’, శింబు ‘ది లూప్’ తదితర డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వెంకట్‌ ప్రభు నాగచైతన్య హీరోగా నేరుగా తెలుగు సినిమా (కస్టడీ) తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని