Venkatesh Maha: నా మాటలు వెనక్కి తీసుకోను.. కానీ ఆ విషయంలో మాత్రం క్షమించండి: వెంకటేశ్ మహా

దర్శకుడు వెంకటేశ్‌ మహా (Venkatesh Maha) `కేజీఎఫ్‌` చిత్రంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఇప్పటికీ వాటిని సమర్థించుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Published : 07 Mar 2023 12:40 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ దర్శకుడు వెంకటేశ్‌ మహా (Venkatesh Maha) ‘కేజీయఫ్‌’ (KGF) సినిమాను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తన వ్యాఖ్యలపై మహా స్పందించారు. తన మాటలను వెనక్కి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.

‘‘నేను తాజాగా చేసిన వ్యాఖ్యలు చాలా మందికి అభ్యంతరకరంగా అనిపించాయి. నేను ఇప్పటికీ ఆ మాటలను వెనక్కి తీసుకోవడంలేదు. కానీ, నేను మాట్లాడేటప్పుడు ఉపయోగించిన భాష సరైనది కాదని అంగీకరిస్తున్నాను. ఓ దర్శకుడిగా నేను అలాంటి పదజాలాన్ని ఉపయోగించి ఉండకూడదు. అలాంటి పదాలు వాడినందుకు క్షమించండి. నేను ఒక ఇండస్ట్రీని కించపరిచేందుకు అలా మాట్లాడలేదు. మొత్తం సినీపరిశ్రమను ఉద్దేశించి మాట్లాడాను. అన్ని రకాల సినిమాలను ఆదరించాలని చెప్పాలనే ప్రయత్నంలో ఆ వ్యాఖ్యలు చేశాను. ఇప్పటికీ వాటినే సమర్థిస్తున్నాను’’ అని స్పష్టం చేశారు.

తాను సినిమాలోని కల్పితపాత్రనే దూషించానని.. నిజ జీవితంలోని వ్యక్తిని కాదని మహా తెలిపారు.‘‘నా సినిమాలు నచ్చిన వారు, నా నిర్ణయం నచ్చిన వాళ్లు నాకు సందేశాలు పంపారు. వాళ్లందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. నేను అన్న మాటలను నిజజీవితంలో వ్యక్తికి ఆపాదించి చూస్తున్నారు (venkatesh maha controversy). అది నా అభిప్రాయాన్ని మీరు విన్న విధానం వల్ల వచ్చిన సమస్య. నేను కల్పిత పాత్రని మాత్రమే దూషించాను. దానికి నన్ను ఎన్నోరకాలుగా విమర్శిస్తున్నారు. నన్ను అసభ్యంగా దూషిస్తున్నారు. ఇలాంటివి చాలా సార్లు చూశాను. ఇలాంటి ఘటనల కారణంగానే నాకు అలాంటి అభిప్రాయం ఏర్పడింది. అన్ని రకాల సినిమాలను ఒకేలా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని వెంకటేశ్‌ మహా అన్నారు.

ఇక తన కారణంగా చిత్ర పరిశ్రమలోని ఎంతో గొప్ప దర్శకులు కూడా విమర్శలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను పెట్టిన రెండు నిమిషాల వీడియో కారణంగా గత 24 గంటల నుంచి అంతటా చర్చ జరుగుతూనే ఉంది. నా మాటల వల్ల నా 
తోటి చిత్ర నిర్మాతలు ట్రోల్‌కు గురవుతున్నారు. ఈ విషయంలో బాధగా ఉంది. వాళ్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో గౌరవనీయులైన దర్శకులు. వాళ్లని విమర్శించకండి’’ అని మరో ప్రకటనలో తెలిపారు.

ఇటీవల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ చర్చా వేదికలో పాల్గొన్న వెంకటేశ్‌ మహా.. యశ్ (Yash) నటించిన ‘కేజీయఫ్‌’పై కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. ‘తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వెంకటేశ్‌ మహా వెంటనే క్షమాపణలు చెప్పాలని కొందరు డిమాండ్‌ చేశారు. అయితే తాజాగా వెంకటేశ్‌ మహా విడుదల చేసిన వీడియోపైనా కొందరు సినీప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని