Virata Parvam: అందుకే ‘విరాటపర్వం’ టైటిల్‌ పెట్టాం: వేణు ఊడుగుల

‘నీదీ నాదీ ఓకే కథ’ చిత్రంతో, తొలి ప్రయత్నంలోనే విభిన్న కథా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు ఊడుగుల. ద్వితీయ ప్రయత్నంగా ‘విరాట పర్వం’ తెరకెక్కించారు.

Published : 08 Jun 2022 22:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నీదీ నాదీ ఓకే కథ’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విభిన్న కథా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు ఊడుగుల. ద్వితీయ ప్రయత్నంగా ఆయన ‘విరాట పర్వం’ (Viarata Parvam) తెరకెక్కించారు. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు.

* రెండో సినిమాకే మీరు నక్సల్‌ నేపథ్యాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం?

వేణు: నేను పుట్టి, పెరిగిన వాతావరణం, చదివిన పుస్తకాలు తదితర అంశాలు నేను ఎలాంటి సినిమాలు తీయాలో అవగాహన కల్పించాయి. నేను చూసిన కొందరి జీవితాన్ని తెరకెక్కించాలని, చరిత్రలో దాగిన కథలు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగానే ‘విరాటపర్వం’ తీశా. బరువైన కథా? సులువైన కథా? అని ఎప్పుడూ నన్ను నేను ప్రశ్నించుకోను. నేను అనుకున్న కథ తెరపైకి సరిగ్గా వచ్చిందా? లేదా? అనేది మాత్రమే చూసుకుంటా.

* మీది లెఫ్ట్ నేపథ్యమా?

వేణు: నేను తెలంగాణకి చెందిన వాడిని. ఇదొక రాజకీయ ప్రయోగశాల. ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో పెరగడం వల్ల అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అంతేగానీ లెఫ్ట్‌, రైట్‌ అంటూ ఏమీ లేదు.

* ఈ సినిమా విడుదల చాలా ఆలస్యమైంది. ఎప్పుడైనా ఒత్తిడికి గురయ్యారా?

వేణు: ఒత్తిడి లేదుగానీ సినిమా త్వరగా విడుదలైతే బాగుండేదని అనిపించేంది. కొవిడ్‌/లాక్‌డౌన్‌ సమయంలో అందరి పరిస్థితి ఒక్కటే కదా. అందువల్లే ఈ సినిమా కూడా వాయిదా పడింది. ఆ గ్యాప్‌లో రెండు కథలు రాశా. మంచి నటులు, నిర్మాత కారణంగా ఈ సినిమా ప్రారంభం నుంచీ పాజిటివ్‌ ఆలోచనతోనే ఉన్నా.

* ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశారు?

వేణు: కథను కాదుగానీ వెన్నెల పాత్రను సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని రాశా. ఆ క్యారెక్టర్‌ రాస్తుంటే తనే మదిలో మెదిలేది. ఈ సినిమాకు ముందు ఎప్పుడూ ఆమెను నేను కలవలేదు. స్క్రిప్టు పూర్తయ్యాక సాయి పల్లవిని కలిశా. కథ వినగానే ఆమె సినిమాలో నటించేందుకు అంగీకరించారు.

* ఈ సినిమాలోని సాయి పల్లవి పాత్రకు ప్రేరణ ఎవరు?

వేణు: వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ అనే ఓ అమ్మాయి జీవితాన్ని చూపించా. ఆమె పాత్రలోనే వెన్నెలగా సాయి పల్లవి నటించింది.

* ప్రేమకి నక్సలిజానికి ఎలా ముడిపెట్టారు?

వేణు: విప్లవం అనేది ప్రేమైక చర్య. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేదే కాదు. ఒక సమూహానికి వ్యక్తి మధ్య కూడా ప్రేమ ఉంటుంది. జనం కోసం పని చేయాలంటే ఎంతో ప్రేమ ఉంటే తప్ప కొందరు తమ జీవితాలను త్యాగం చేయలేరు.

* ఈ సినిమాకి ఏమైనా ఓటీటీ ఆఫర్లు వచ్చాయా?

వేణు: పలు ఓటీటీ సంస్థలు ఈ సినిమాను తీసుకుంటామంటూ మంచి ఆఫర్లు ఇచ్చాయి. ‘ఇది థియేటర్లలోనే చూడాల్సిన సినిమా’ అని నిర్మాతలు సుధాకర్‌ చెరుకూరి, శ్రీకాంత్‌ వాటిని తిరస్కరించారు.

* ఈ సినిమా ముగింపు ఎలా ఉంటుంది?

వేణు: సినిమా విడుదలకు ముందే ముగింపు సన్నివేశం గురించి చెప్పడం కష్టం. ఈ సినిమా క్లైమాక్స్‌ ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపిస్తుందనే నమ్మకం బాగా ఉంది.

* ‘విరాటపర్వం’ టైటిల్ పెట్టడానికి కారణం?

వేణు: మహాభారతంలోని విరాటపర్వం గురించి అందరికీ తెలిసిందే. అందులో ఉన్నట్టే ఈ సినిమాలోనూ కుట్రలు, రాజకీయాలు, ఫిలాసఫీ కనిపిస్తాయి. అందుకే ఆ పేరునే పెట్టాం.

* మీరు చేస్తున్న ‘మైదానం’ ప్రాజెక్ట్ అప్‌డేట్‌ ఇస్తారా?

వేణు: ఓటీటీ ‘ఆహా’ కోసం ఈ ప్రాజెక్టును చేస్తున్నాం. దీనికి నేను షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నా. కవిత్వం అంటే నాకు ఇష్టం. అప్పుడప్పుడు రాస్తుంటా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని