Vetrimaaran: మంచి రివ్యూలు వచ్చినా.. రూ.1.45 కోట్లే కలెక్ట్‌ చేసింది: వెట్రిమారన్‌

సోషల్‌ మీడియా రివ్యూలపై ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ స్పందించారు. మంచి రివ్యూలు వచ్చిన సినిమా కూడా బాక్సాఫీసు వద్ద తక్కువ వసూళ్లు చేసిందని పేర్కొన్నారు.

Updated : 20 Nov 2023 19:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా రివ్యూల వల్ల సినిమాలపై ప్రభావం పడుతుందనే విషయాన్ని కొందరు సమర్థిస్తే మరికొందరు కొట్టిపారేస్తుంటారు. ఈ రెండో జాబితాలోనే తాను ఉన్నానంటున్నారు కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ (Vetrimaaran). సామాజిక మాధ్యమాల్లో కనిపించే రివ్యూలు పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సినిమాల వసూళ్లపై ప్రభావం చూపవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ‘డైరెక్టర్స్‌ రౌండ్‌ టేబుల్‌’ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘దాదాపు ఏడేళ్ల క్రితం నేను ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించా. దానికి సోషల్‌ మీడియాలో మంచి రివ్యూలు దక్కాయి. కానీ, బాక్సాఫీసు వద్ద రూ.1.45 కోట్లే రాబట్టింది. అదే సమయంలో విడుదలైన మరో సినిమాకి నెగెటివ్‌ రివ్యూలు వచ్చినా రూ. 9 కోట్ల వసూళ్లు చేసింది’’ అని గుర్తుచేసుకున్నారు.

రివ్యూ: ది రైల్వేమెన్‌.. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనపై వచ్చిన సిరీస్‌ మెప్పించిందా?

‘ప్రభావం చూపనప్పటికీ నిర్మాతలెందుకు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు డబ్బులిచ్చి మరీ పాజిటివ్‌ రివ్యూలు రాయిస్తారు?’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఇదే విషయమై ఓసారి నేను అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడా. సోషల్ మీడియా రివ్యూలు నేరుగా వసూళ్లను ప్రభావితం చేయవని వారు నాకు చెప్పారు. కానీ, మంచి విషయాలు రాయమని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే ఆయా సినిమాలకు పనిచేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తదితరులు సోషల్‌ మీడియా చూస్తుంటారు. వారు తమ సినిమాల గురించి చెడు అభిప్రాయాలు విన్నప్పుడు బాధపడతారు. వారు ఫీల్‌ అవ్వకుండా ఉండేందుకు అలా చేస్తుంటారు’’ అని చెప్పారు. వ్యక్తిగతంగా తాను సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటానన్నారు.

తన ‘విడుదలై: పార్ట్‌ 1’ (Viduthalai Part 1) సినిమా విడుదలైన సమయంలో రోజుకు 2000కిపైగా ఫోన్‌కాల్స్‌ (ప్రశంసించేందుకు) వచ్చేవని, ప్రస్తుతం తెలియని నంబర్ల నుంచి కాల్స్‌ వస్తే లిఫ్ట్‌ చేయట్లేదని పేర్కొన్నారు. ఈ దర్శకుడు నేరుగా తెలుగులో సినిమాలు చేయలేదుగానీ ఇక్కడ క్రేజ్‌ దక్కించుకున్నారు. టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం ఉందని, అందుకు చాలా సమయం పడుతుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం వెట్రిమారన్‌ ‘విడుదలై: పార్ట్‌1’కు కొనసాగింపుగా ‘పార్ట్‌2’ తెరకెక్కించే పనిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని