Jayamma Panchayathi: సుమ లేకపోతే.. ‘జయమ్మ పంచాయితీ’ లేదు

‘‘దర్శకుడిగా ఓ జానర్‌కు పరిమితమవ్వాలని అనుకోవట్లేదు. నా కథల్లో బలమైన సంఘర్షణ.. లోతైన భావోద్వేగాలు ఉండేలా చూసుకుంటా’’ అన్నారు విజయ్‌ కుమార్‌ కలివరపు. ‘జయమ్మ పంచాయితీ’తో తెలుగు తెరపైకి అడుగు పెడుతున్న కొత్త దర్శకుడాయన. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది.

Updated : 28 Apr 2022 07:25 IST

‘‘దర్శకుడిగా ఓ జానర్‌కు పరిమితమవ్వాలని అనుకోవట్లేదు. నా కథల్లో బలమైన సంఘర్షణ.. లోతైన భావోద్వేగాలు ఉండేలా చూసుకుంటా’’ అన్నారు విజయ్‌ కుమార్‌ కలివరపు. ‘జయమ్మ పంచాయితీ’తో తెలుగు తెరపైకి అడుగు పెడుతున్న కొత్త దర్శకుడాయన. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. బలగ ప్రకాష్‌ నిర్మించారు. మే 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు విజయ్‌ కుమార్‌.  

‘‘ఇది కల్పిత కథే అయినప్పటికీ.. కొన్ని వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొందా. మా ఊరిలో చూసిన వ్యక్తుల జీవితాల నుంచి ప్రేరణ పొంది రాసుకున్న కథ. ఇందులోని పాత్రలకి మా చుట్టు పక్కల వాళ్ల పేర్లే పెట్టుకున్నా. సతీ సావిత్రి, యముడి పురాణం అందరికీ తెలుసు కదా. అలాగే సినిమాలో జయమ్మ తనకున్న సమస్యలతో ఓ పోరాటం చేస్తుంది. అయితే ఆమె పోరాటం వల్ల గ్రామంలోని ఇతరులు ఇబ్బందులకు గురవుతారు. దీంతో ఆమె పోరు పెద్ద వివాదంగా మారుతుంది. ఆ సమస్య ఏంటి? కలిగిన ఇబ్బందులేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి’’.

‘‘తొలుత ఈ జయమ్మ పాత్రకు రమ్యకృష్ణ లాంటి నటి బాగుంటుందనుకున్నా. సుమ దగ్గరకి వెళ్లి కథ చెప్పగానే బాగా నచ్చింది, చేస్తానన్నారు. ఇంత బరువైన పాత్ర ఆమె చేయగలరా అని నాకు సందేహం కలిగింది. అందుకే తొలుత టెస్ట్‌ షూట్‌ చేశాం. అది నాకు చాలా నమ్మకాన్నిచ్చింది. ఫస్ట్‌ కాపీ చూసుకున్నాక సుమ లేకపోతే ఈ చిత్రం సాధ్యమయ్యేది కాదనిపించింది’’.

‘‘సుమ శ్రీకాకుళం మాండలికాన్ని చాలా త్వరగా నేర్చుకున్నారు. ఆమె సహకారంతోనే సింక్‌ సౌండ్‌లో చక్కగా తీయగలిగాం. మాది   శ్రీకాకుళం సమీపంలోని ఓ గ్రామం.  పీజీ వరకు వైజాగ్‌లోనే చదివాను. తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇటువైపు వచ్చాను. 6ఏళ్లలో పలు లఘు చిత్రాలు తెరకెక్కించాను. వాటి వల్లే ఈ సినిమా అవకాశం వచ్చింది’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని