Thank You: ఆ క్రెడిట్‌ నాగ చైతన్యకే దక్కుతుంది: విక్రమ్‌ కుమార్‌

‘ఇష్క్‌’, ‘మనం’, ‘24’, ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’ తదితర చిత్రాలతో విభిన్న కథా దర్శకుడిగా పేరొందారు విక్రమ్‌ కె. కుమార్‌. ఇప్పుడు ‘థ్యాంక్‌ యూ’ సినిమాతో ప్రేక్షకుల హృదయాలన్ని హత్తుకునేందుకు సిద్ధమయ్యారు.

Published : 15 Jul 2022 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇష్క్‌’, ‘మనం’, ‘24’, ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’ తదితర చిత్రాలతో విభిన్న కథా దర్శకుడిగా పేరొందారు విక్రమ్‌ కె. కుమార్‌ (Vikram K Kumar). ఇప్పుడు ‘థ్యాంక్‌ యూ’ (Thank You) సినిమాతో ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునేందుకు సిద్ధమయ్యారు. నాగ చైతన్య (Naga Chaitanya)  ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. రాశీఖన్నా, మాళవిక నాయర్‌, అవికా గోర్‌ కథానాయికలు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జులై 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్రమ్‌ విలేకరులతో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు.

తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాలి

మనలో చాలామంది చెప్పాల్సిన సందర్భంలో ఎవరికీ థ్యాంక్‌ యూ చెప్పం. అవసరంలేని విషయాల్లో చెప్పి ఆ మాటకు విలువ లేకుండా చేస్తుంటాం. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా నాన్నే కారణం. అలా అని ఆయనకు నేను ఏ రోజూ థ్యాంక్స్‌ చెప్పలేదు. ఆయన ఇప్పుడు నాతో లేకపోవడం బాధాకరం. తమ పిల్లలు కృతజ్ఞత చూపించాలని తల్లిదండ్రులెవరూ కోరుకోరు. కానీ, మనం తప్పకుండా చెప్పాలి. మ‌న‌లో చాలా మంది ‘జీవితంలో ఎన్నో క‌ష్టాలు ప‌డి ఈ స్థాయికి వ‌చ్చాం’ అని అనుకుంటూ ఉంటారు. ఇత‌రుల స‌పోర్ట్ వల్లే విజయం అందుకుంటాం. దాన్ని ఎవ‌రూ గుర్తించ‌రు. మన విజయంలో భాగ‌మైన వారికి కృతజ్ఞతలు చెప్ప‌టంలో సంతోషం ఉంటుంది. మ‌న జీవితంలో గొప్ప మార్పులకు వ్య‌క్తులే కార‌ణంగా నిలవరు. కొన్ని పరిస్థితులూ మనల్ని మారుస్తాయి. ఏదిఏమైనా మనలో కృతజ్ఞతాభావం ఉండాలి.

మూడు పాత్రల్లో..

‘మనం’ తర్వాత మళ్లీ ఓ సినిమా చేయాలని నేనూ నాగ చైతన్య అనుకున్నాం. సుమారు నాలుగేళ్లు చర్చలు సాగాయి. ఆ క్రమంలోనే ఓసారి ఈ ‘థ్యాంక్‌ యూ’ ఆలోచన వచ్చింది. ఈ సినిమాలో చైతన్య మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. 16 ఏళ్ల కుర్రాడిగా, 21 ఏళ్ల యువకుడిగా, 35 ఏళ్ల వ్యక్తిగా ఆయా పాత్రల్లో ఆయన ఇమిడిపోయారు. 16 ఏళ్ల లుక్‌ కోసం ఆయన సుమారు 50 రోజులపాటు ప్రత్యేక డైట్‌ తీసుకుని బరువు తగ్గారు. ఈ పాత్రకు సంబంధించిన క్రెడిట్‌ అంతా చైతన్యకే దక్కుతుంది. ఈ చిత్రంలో హృదయాల్ని హత్తుకునే ఓ మ్యాజిక్‌ ఉంటుంది. ‘నా జీవితంలో కొందరు ప్రత్యేకమని, వారికి తప్పకుండా థ్యాంక్స్‌ చెప్పాలి’ అనే ఫీలింగ్‌ కథను చర్చించుకునే సమయంలో నాకూ, చైతన్యకు కలిగింది. అనుకున్నట్టుగానే కొందరికి థ్యాంక్స్‌ చెప్పి ఈ సినిమాను ప్రారంభించాం. ‘ప్రేమ‌మ్‌’, ‘నా ఆటోగ్రాఫ్’ వంటి గొప్ప సినిమాలతో కొందరు మా సినిమాని పోల్చడం ప్లస్‌ పాయింటే.

సంగీతం ప్రధానం

రచయిత బీవీఎస్‌ రవి ఈ కథను చెప్పగానే నాకు బాగా నచ్చేసింది. దాన్ని నా స్టైల్‌లో ప్రేక్షకులకు చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇలాంటి ఫీల్‌ గుడ్‌ స్టోరీని తెరపై చూపించాలంటే సంగీతానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఈ సినిమాకి తమన్‌ తన మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. ఈ చిత్రంలోని రాశీ ఖన్నా పోషించిన పాత్ర.. అభిరామ్ (నాగ చైతన్య) జ‌ర్నీలో చాలా కీల‌కమ‌ని చెప్పాలి. అభిరామ్ పాత్ర‌ను క‌థ‌కు క‌నెక్ట్ అయ్యేలా చేసే పాత్ర ఆమెది. ఓ సన్నివేశంలోని రాశీ నటనను మానిట‌ర్‌లో చూసిన‌ప్పుడు నా క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. అంతటి ఎమోషనల్‌ సీన్‌ అది. ఈ సినిమా విడుదల తర్వాత మాళవికా నాయర్‌కు నటిగా మరింత పేరొస్తుంది. అవికా గోర్‌ చిన్నప్పుడే తనేంటో నిరూపించుకుంది.

24.. సీక్వెల్‌ ఉంటుంది

ప్రస్తుతం.. నాగ చైత‌న్య‌తో ‘ధూత’ అనే వెబ్ సిరీస్‌ తెరకెక్కిస్తున్నా. తాజాగా నాగ చైత‌న్య పాత్ర‌కు సంబంధించిన‌ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మ‌రో 15 రోజుల్లో చిత్రీక‌రణంతా ముగుస్తుంది. ‘24’ సినిమాకు సీక్వెల్ చేయాల‌నే ఆలోచ‌న ఉంది. పూర్తి స్ర్కిప్టు సిద్ధమవలేదుగానీ కొంతమేర రాశా. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నా. మరోవైపు, యాక్షన్‌ నేపథ్యంలో ఓ హిందీ సినిమా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది అని విక్రమ్‌ పేర్కొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని