Prabhas Movies: ‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్‌ కటౌట్‌కు అదిరిపోయే సీన్స్‌

సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ప్రభాస్‌ పాత్రతో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి, థియేటర్‌ దద్దరిల్లిపోయేలా చేశారు కొందరు దర్శకులు.. ఆ సినిమాలు ఏంటి? ఆ సీన్స్‌ ఏంటి?

Updated : 02 Jul 2024 16:47 IST

మాస్‌ హీరో కావాలి.. ప్రభాస్‌ ఉన్నాడుగా..
పౌరాణిక పాత్ర చేయాలి.. ప్రభాస్‌ ఉన్నాడుగా..
పీరియాడికల్‌ డ్రామా.. అరె మన ప్రభాస్‌ ఉన్నాడుగా..
ఫుల్‌ యాక్షన్‌ మూవీ... ఎవరో ఎందుకు ప్రభాస్‌ ఉన్నాడుగా.. ఇది ప్రస్తుత భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ సినిమాలు తీయాలనుకునే దర్శకులకు మొదటి ఛాయిస్‌. అందరికీ 24 గంటలే ఉంటాయి. దర్శకులు మాత్రం ప్రభాస్‌కు 48 గంటలు ఉంటే బాగుండు కదా అని ఆలోచిస్తున్నారు. ప్రభాస్‌ (Prabhas) కటౌట్‌కు ఉన్న డిమాండ్‌ అది. ఆ కటౌట్‌ను ఉపయోగించుకుని కొందరు దర్శకులు బాక్సాఫీస్‌ వద్ద రూ.వందల కోట్లు కొల్లగొడితే, ఆ కటౌట్‌తోనే యావరేజ్‌ సినిమా కూడా బతికిపోయిన సందర్భాలున్నాయి. సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ప్రభాస్‌ పాత్రతో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి, థియేటర్‌ దద్దరిల్లిపోయేలా చేశారు కొందరు దర్శకులు.. ‘కల్కి’ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న తరుణంలో ఆ సినిమాలు, ట్విస్ట్‌లేంటో చూసేయండి

మిర్చి.. నా ఫ్యామిలీ సేఫ్‌..

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి’లో ప్రభాస్‌ను చూపించిన తీరు ఎవరూ మర్చిపోలేరు ‘కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు’ అంటూ ప్రభాస్‌ డైలాగ్‌ చెబుతుంటే థియేటర్లు హోరెత్తిపోయాయి. ఇక తన కుటుంబంపై విలన్‌ గ్యాంగ్‌ అటాక్‌ చేసినప్పుడు ప్రభాస్ కత్తి పట్టుకుని వారి వెంటపడుతూ చేసే సీక్వెన్స్‌ నిజంగా ఒళ్లు గగుర్పొడుస్తుంది. టెన్షన్‌తో విలన్‌ ఫోన్‌ చేసి ‘ఏమైందో చెప్పరా..’ అంటూ అడిగితే ‘ముఖానికి కట్టిన రెడ్‌ టవల్‌ తీసి ‘నా ఫ్యామిలీ సేఫ్‌’ అంటూ ప్రభాస్‌ చెప్పే డైలాగ్‌, ఆ వెనుక దేవిశ్రీ  నేపథ్య సంగీతం అదుర్స్‌.


ఎవర్‌గ్రీన్‌ ‘బాహుబలి’

ప్రభాస్‌ కటౌట్‌ను సరిగ్గా ఉపయోగించుకున్న దర్శకుల్లో రాజమౌళిది ఫస్ట్‌ ప్లేస్‌. ‘బాహుబలి’లో మహేంద్ర, అమరేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. ‘బాహుబలి: ది బిగినింగ్‌’లో శివుడి(ప్రభాస్‌) కాలును తన నెత్తిన పెట్టుకుంటూ ‘బాహుబలి’ అంటూ ఆ పాత్రను  కట్టప్ప(సత్యరాజ్‌) రివీల్‌ చేస్తుంటే, ప్రేక్షకులు తమని తాము మర్చిపోయారు. అలాగే ‘పార్ట్‌-2’లో మాహిష్మతి సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సీన్‌ మొత్తం సినిమాకే హైలైట్‌.


రాజే సేనాధిపతిగా వస్తే..

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ను యాక్షన్‌ మోడ్‌లో సాహోలో చూపించాడు సుజీత్‌. సినిమాకు కొన్నిచోట్ల మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చినా, బాలీవుడ్‌ ప్రేక్షకులకు మాత్రం తెగ నచ్చేసింది. ఈ సినిమాలో మొదటి నుంచి ప్రభాస్‌ను కొద్దిసేపు పోలీస్‌ ఆఫీసర్‌గా, మరికొద్దిసేపు దొంగగా చూపిస్తూ వచ్చిన సుజీత్‌.. క్లైమాక్స్‌ మొత్తం మాఫియాకు అతడే కింగ్‌ అంటూ రివీల్‌ చేసే సీన్‌కు థియేటర్‌ విజిల్స్‌తో దద్దరిల్లిపోయింది. ‘రాజ్యాలను కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు. యుద్ధంలో పోరాడి వాడి రాజ్యాన్ని కాపాడుకున్నాక రాజై కూర్చొంటాడు’ అన్న డైలాగ్‌ను ఎవరూ మర్చిపోలేరు.


ఖాన్సార్‌ కా సలార్‌.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

ప్రభాస్‌ కటౌట్‌కు ఎలివేషన్స్‌ ఇస్తూ ఓ రేంజ్‌లో చూపించిన మూవీ ‘సలార్‌: సీజ్‌ ఫైర్’. విలన్‌ గ్యాంగ్‌ ఆద్య(శ్రుతిహాసన్‌)ను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తుంటే అడ్డుకునే సమయంలో ఖాన్సార్‌కా సలార్‌.. అంటూ రాధారమ(శ్రియా రెడ్డి) ప్రభాస్‌ పాత్రను పరిచయం చేయడం ఒక ఎత్తైతే.. క్లైమాక్స్‌లో దేవ శౌర్యాంగ అంటూ రివీల్‌ చేసే సీన్‌ సినిమాకే హైలైట్‌. మూడు గంటలసేపు థియేటర్‌లో కూర్చొన్న తర్వాత కూడా ఒకవేళ ‘శౌర్యంగపర్వం’ వేస్తే అలాగే కూర్చొని చూసేలా ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌ పాత్రను తీర్చిదిద్దారు.


‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా..’

ఇప్పటివరకూ మాస్‌, యాక్షన్‌, జానపద, ఇతిహాస గాథల్లో ప్రభాస్‌ను చూసిన ప్రేక్షకులకు నాగ్‌ అశ్విన్‌ సరికొత్తగా చూపించారు. ‘కల్కి 2898 ఏడీ’లో సినిమా మొత్తం బౌంటీ హంటర్‌గా కనిపించిన ప్రభాస్‌.. చివరి పది నిమిషాల్లో మహాభారతంలో కర్ణుడిగా కనిపించి స్క్రీన్‌ షేక్‌ చేసేశారు. ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్‌ విల్లు పట్టుకుని రథంపై నిలబడితే, థియేటర్‌ మొత్తం ప్రభాసే నిండిపోయిన ఫీలింగ్‌ ప్రేక్షకుడికి కలిగింది. ‘కల్కి పార్ట్-2’లో విజయ ధనుస్సుతో ప్రభాస్‌ వీర విహారం చేయడం ఖాయమంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని