Narappa: ఓటీటీ రిలీజ్‌ బాధగా ఉంది

‘కొత్తబంగారు లోకం’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’ వంటి ఫీల్‌గుడ్‌ చిత్రాలు తెరకెక్కించి ఫ్యామిలీ డైరెక్టర్‌గా ప్రేక్షకులకు చేరువయ్యారు శ్రీకాంత్‌ అడ్డాల. ఇప్పటివరకూ తెరకెక్కించిన వాటికి...

Updated : 19 Jul 2021 15:38 IST

‘బ్రహ్మోత్సవం’ పరాజయం.. షాక్‌ ఏమీ కాదు.. కానీ

హైదరాబాద్‌: ‘కొత్తబంగారు లోకం’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’ వంటి ఫీల్‌గుడ్‌ చిత్రాలు తెరకెక్కించి ఫ్యామిలీ డైరెక్టర్‌గా ప్రేక్షకులకు చేరువయ్యారు శ్రీకాంత్‌ అడ్డాల. ఇప్పటివరకూ తెరకెక్కించిన వాటికి విభిన్నంగా మొదటిసారి యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జానర్‌లో ఆయన రూపొందించిన చిత్రం ‘నారప్ప’. వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జులై 20న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘నారప్ప’ విడుదలపై ఎన్నో సరదా సంగతులను ఆయన విలేకర్లతో పంచుకున్నారు. ఆ విశేషాలివే..

శ్రీకాంత్‌ అడ్డాలలోని మాస్‌ యాంగిల్‌ ‘నారప్ప’తో ప్రేక్షకులకు తెలియనుందా?

శ్రీకాంత్‌: అంతేకదండి(నవ్వులు). ట్రైలర్‌ విడుదలైన తర్వాత చాలా మంది ప్రేక్షకుల నుంచి కామెంట్లు కూడా వచ్చాయి. ‘శ్రీకాంత్‌ అడ్డాల ఇలాంటి మాస్‌ సినిమాలు కూడా తీయగలడురా’ అని అందరూ చెప్పుకుంటున్నారు.

‘నారప్ప’ కోసం ‘అసురన్‌’ కథలో ఎలాంటి మార్పులు చేశారు?

శ్రీకాంత్‌: క్లాసిక్‌ సినిమాలు రీమేక్‌ చేసినప్పుడు.. మాతృక ప్రకారమే సినిమా నిర్మించడం ఉత్తమమని నా ఉద్దేశం. అది దృష్టిలో ఉంచుకునే.. ‘అసురన్‌’లో పెద్ద మార్పులు ఏమీ చేయలేదు. మన తెలుగు స్థానికతకు దగ్గరగా ఉండేలా మాత్రమే కథలో చిన్న చిన్న మార్పులు చేశాను.

షూటింగ్‌కి ఏమైనా బ్రేక్స్‌ పడ్డాయా?

శ్రీకాంత్‌: కరోనా ప్రారంభమైన కొత్తలో మేము ‘నారప్ప’ షూట్‌ ప్రారంభించాం. 58 రోజులపాటు నిరంతరాయంగా ఓ షెడ్యూల్‌ కొనసాగింది. ఇంత లాంగ్‌ షెడ్యూల్‌ చేయడం ఇదే మొదటిసారి అని వెంకటేశ్‌ కూడా అన్నారు. ఆ షెడ్యూల్‌ చివరి 5 రోజులు సెట్‌లోని వాళ్లందరూ నీరసించిపోయారు. ‘మాకు బ్రేక్‌ కావాలి సర్‌. ఒక వారం రోజులు టైమ్‌ ఇస్తే కంటినిండా నిద్రపోతాం’ అన్నారు. ఆ తర్వాత కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా కొన్నినెలలపాటు షూట్‌ వాయిదా వేశాం.

‘అసురన్‌’ చిత్రీకరించిన లొకేషన్స్‌లోనే ‘నారప్ప’ షూట్‌ చేయడానికి కారణమేమిటి?

శ్రీకాంత్‌: మేము ఈ ప్రాజెక్ట్‌ అనుకున్నప్పుడే ఒరిజినల్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేయాలనుకున్నాం. ఆ ప్రాంతాల్లోనే షూట్‌ చేశాం. కాకపోతే తెలుగు స్థానికతకు దగ్గర ఉండాలని భావించి సినిమాలోని కొన్ని సన్నివేశాలను అనంతపురములో షూట్‌ చేశాం. సుమారు 12 రోజులపాటు అనంతపురము జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది.

ఈ కథలోకి మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు?

శ్రీకాంత్‌: వెంకటేశ్‌ ఓసారి ‘అసురన్‌’ చూశారు. ఆ సినిమాలోని భావోద్వేగాలకు ఆయన బాగా కనెక్ట్‌ అయ్యారు. తెలుగులో ఎలాగైనా రీమేక్‌ చేయాలని ఆయన భావించారు. వాళ్ల అన్నయ్య సురేశ్‌బాబుతో చెప్పి హక్కులు కొనుగోలు చేశారు. అదే సమయంలో నేను వేరే కథ పనిలో బిజీగా ఉన్నాను. ఓసారి నా అసిస్టెంట్‌ ‘అసురన్‌’ గురించి చెప్పడంతో దాన్ని చూశాను. అది నాకెంతో నచ్చింది. తెలుగువారికి ఈ కథ అందించాలని భావించాను. అలాంటి సమయంలోనే నేను ఓ కథ రాసి.. దాని గురించి మాట్లాడదామని వెంకటేశ్‌ని కలిశాను. అదే సమయంలో ‘అసురన్‌’ రీమేక్‌కి డైరెక్టర్‌ సెట్‌.. ఫిక్స్ అయ్యారా లేదా అని ఆయన్ని అడగ్గా.. ఇంకా లేదని చెప్పారు. అవకాశం ఇస్తే నేను దాని రీమేక్‌ బాధ్యతలు తీసుకుంటానని చెప్పాను. ఆయన ఓకే అన్నారు. అలా, నేను ఆ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను.

ఇప్పటివరకూ మీరు తెరకెక్కించిన సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్. సెన్సిటివ్‌ అంశాలు. వాటన్నింటికీ విభిన్నంగా ‘నారప్ప’ కథ తెరకెక్కించడం ఎలా ఉంది?

శ్రీకాంత్‌: ‘నారప్ప’ కూడా ఎంతో సెన్సిటివ్‌ కథ. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్‌ ఉంటాయి. భావోద్వేగాల్లో భాగంగానే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సాగాయి.

మీరు రాసుకున్న కథలతో సినిమాలు తీయడం కష్టమా? లేదా రీమేక్‌ చేయడం కష్టమా?

శ్రీకాంత్‌: ఒకరకంగా చెప్పాలంటే రెండింటిలో వేరు వేరు అంశాలు కష్టంగా ఉంటాయి. రీమేక్‌ తెరకెక్కిస్తే అల్రెడీ ఉన్న కథను అందరికీ నచ్చేలా రీక్రియేట్‌ చేయడమనేది సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఒకవేళ మనం తీసిన రీమేక్‌ అందరికీ నచ్చితే.. బాగుందని చెబుతారు. అది కనుక కొంచెం అటు ఇటు అయినా సరే.. ‘చక్కగా ఉన్న కథను చెడగొట్టారు’ అని కామెంట్లు చేస్తారు.

‘నారప్ప’ చిత్రీకరణలో మీకు బాగా క్లిష్టంగా అనిపించిన విషయమేమిటి?

శ్రీకాంత్‌: ‘నారప్ప’ను కష్టంగా కాదు ఇష్టంగా భావించి తెరకెక్కించా. ఇందులోని ప్రతి సీన్‌కి  ఉత్సాహంగా ఫీలయ్యాను. కాకపోతే, మాతృకలో ఉన్న అన్నిరకాల భావోద్వేగాలు రీమేక్‌లోనూ అదే మాదిరిగా వచ్చేలా చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది.

‘నారప్ప’ను ఓటీటీలో విడుదల చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి?

శ్రీకాంత్‌: ‘నారప్ప’ పెద్ద సినిమా. దీన్ని తెరకెక్కించే సమయంలో థియేటర్‌లోనే రిలీజ్‌ చేయాలని అనుకున్నాం. థియేటర్‌లో ప్రేక్షకుల కేరింతలు చూడాలనుకున్నాం. కాకపోతే, పరిస్థితుల కారణంగా ఓటీటీ బాటపట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్మాత ఎస్‌.థాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎంతో బాధగా అనిపించింది. ఆ నిరాశ నుంచి బయటకు రావడానికి రెండు రోజులు సమయం పట్టింది. వెంకటేశ్‌ కూడా ఎంతో ఫీలయ్యారు.

మణిశర్మతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

శ్రీకాంత్‌: నేను దర్శకత్వం వహించిన సినిమాలకు ఎక్కువగా మిక్కీ జె.మేయర్‌ స్వరాలు అందించారు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి మణిశర్మ నేపథ్య సంగీతం అందించారు. ఆ పరిచయంతోనే ‘నారప్ప’కు ఆయనైతే మంచి మ్యూజిక్‌ అందించగలరని భావించి, మా టీమ్‌లోకి తీసుకున్నాను.

‘నారప్ప’ టీమ్‌లోకి కథానాయికగా ప్రియమణిని తీసుకోవడానికి ప్రధాన కారణమేమిటి?

శ్రీకాంత్‌: ‘అసురన్‌’ చూస్తున్న సమయంలోనే .. ఈ సినిమాని తెలుగులోకి రీమేక్‌ చేస్తే అందులో మంజూవారియర్‌ పోషించిన పాత్ర ప్రియమణికి సరిపోతుందని భావించాను. ఎందుకంటే మంజూవారియర్‌ కట్టూబొట్టుతోపాటు ఒక తల్లి పాత్రలో ప్రియమణి న్యాయం చేయగలదని నాకు అనిపించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. ‘గ్యాప్‌ తీసుకోలేదు.. వచ్చింది’ అని మీరు అన్నారు?

శ్రీకాంత్‌: అవును. ఓ ఇంటర్వ్యూలో అడిగారు.. ‘మీరు ఎందుకని ఇంత గ్యాప్‌ తీసుకుని సినిమా చేశారు?’అని. ‘తీసుకోలేదు. అది వచ్చింది’ అని చెప్పాను. నిజంగానే గ్యాప్‌ వచ్చింది కాబట్టి.

‘బ్రహ్మోత్సవం’ షాక్‌ నుంచి బయటకు రావడానికి ఎంతకాలం పట్టింది?

శ్రీకాంత్‌: ‘బ్రహ్మోత్సవం’ ఫలితంలో షాక్ కాలేదు. ఫెయిల్యూర్‌ సినిమాకి మాత్రమే మనిషికి కాదు. కానీ, సినిమా పరాజయం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. భవిష్యత్తు చిత్రాల్లో అలాంటివి రిపీట్‌ కాకూడదని నిర్ణయించుకున్నాను. అదే సమయంలో కరోనా వల్ల ‘నారప్ప’ కొంత ఆలస్యమైంది. దానివల్లే గ్యాప్‌ వచ్చింది.

షూటింగ్‌లో వెంకటేశ్‌ బాగా ఇబ్బందిపడ్డారా?

శ్రీకాంత్‌: ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించే యువకుడి పాత్ర మనందరం రెగ్యులర్‌గా చూసే వెంకటేశ్‌గారే. ఆ పాత్ర కోసం ఆయన శారీరకంగా సిద్ధమయ్యారు అంతే. కానీ, 60 యేళ్ల వృద్ధుడి పాత్రలో కనిపించడం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. షూటింగ్‌ కూడా ఎక్కువశాతం ఎర్రటి ఎండలో అడవుల్లో ఉండేది. కొండలు ఎక్కాలి.. దిగాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన మాత్రం సినిమాపై ఉన్న మక్కువతో అవేమీ పట్టించుకోకుండా వర్క్‌ చేశారు. ‘నారప్ప’ పాత్రలోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారు.

షూట్‌ సమయంలో వెంకీ నటన చూసి మీరు ఎలా ఫీలయ్యారు?

శ్రీకాంత్‌: వెట్రిమారన్‌ గొప్ప దర్శకుడు. ‘అసురన్‌’ లాంటి అద్భుతమైన కథను తెరకెక్కించినందుకు ముందు ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. సినిమా అంతా డీ గ్లామర్‌గా కనిపించినప్పటికీ.. అందులోని ప్రతి సన్నివేశం కూడా అదిరిపోయేలా ఉంటుంది. ఇక, ‘నారప్ప’ గురించి చెప్పాలంటే.. సినిమాలోని ఓ సన్నివేశంలో వెంకటేశ్‌ (నారప్ప) వాళ్లబ్బాయి చనిపోతాడు. ఎప్పటినుంచో ఆ అబ్బాయితో ఫొటో తీయించుకోవాలని నారప్ప అనుకుంటాడు. ఇంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. ఆ సీన్‌ చిత్రీకరణ సమయంలో వెంకటేశ్‌.. చేసిన యాక్షన్‌ చూసి నా హృదయం ద్రవించింది. మాటలు కూడా రాలేదు. అది ఒక్కటే కాదు.. వెంకటేశ్‌ నటన ఈ సినిమాలో పీక్‌లో ఉంటుంది.

ఒరిజినల్‌లో ఉన్న అమ్ము అభిరామిని ‘నారప్ప’లో కూడా రిపీట్‌ చేశారా?

శ్రీకాంత్‌: ఒరిజినల్‌లో నటించిన అమ్ము అభిరామి అనే అమ్మాయిని ఈ సినిమాలో రిపీట్‌ చేశాం. ఎందుకంటే ఆమె నటన చాలా బాగుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఆమె పాత్ర అందరికీ నచ్చుతుంది. ఆ పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేయగలదని భావించి.. ఆమెనే తీసుకున్నాం.

మీ సినిమాల్లో ఎక్కువగా గోదావరి మాండలికం వినిపించేది. కానీ ఇప్పుడు ‘నారప్ప’లో అనంతపురం మాండలికం వినిపిస్తుంది. ఎవరైనా రైటర్‌ని పెట్టుకున్నారా?

శ్రీకాంత్‌: మేము ఫస్ట్‌ షెడ్యూల్‌ కోసం అనంతపురం వెళ్లినప్పుడు సాయి సింహా అనే అబ్బాయి మా సెట్‌కి దగ్గర్లో ఫోన్‌ మాట్లాడుతూ కనిపించాడు. అతని భాష చాలా బాగున్నట్లు అనిపించింది. వెంటనే మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో మాట్లాడి ఆ యువకుడి వివరాలు సేకరించి.. హైదరాబాద్‌కి పిలిపించి.. రెండు నెలలపాటు రాయలసీమ మాండలికంపై హోమ్‌ వర్క్‌ చేశాం.

ఈ గ్యాప్‌లో ఎన్ని కథలు రెడీ చేసుకున్నారు?

శ్రీకాంత్‌: నా తదుపరి సినిమా ‘అన్నాయ్‌’. మూడు భాగాల్లో రానున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా చేయనున్నాను. ఇప్పుడున్న మార్కెట్‌కి ఈ కథ చక్కగా సరిపోతుందని భావిస్తున్నాను. పిరియాడికల్‌ డ్రామా నేపథ్యంలోనే ఆ సినిమా రానుంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌ ప్రీ ప్రొడెక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను.

వెంకటేశ్‌-కమల్‌తో సినిమా చేస్తానని చెప్పారు?

శ్రీకాంత్‌: సినిమా గురించి అనుకున్న మాట వాస్తవమే. కాకపోతే దాని గురించి నాకంటూ ఓ క్లారిటీ వచ్చిన తర్వాత చెబుతాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని