Cinema News: పేలింది.. ప్రచార పటాకా

దీపావళి వేళ చిత్రసీమలో ప్రచార పటాకా పేలింది. డబుల్‌ షాట్‌ బాంబ్‌లా రెండు విడుదల తేదీలు వినిపించి మురిపించారు రవితేజ. ‘ఏజెంట్‌’తో అఖిల్‌.. ‘సార్‌’గా ధనుష్‌.. ‘వారసుడు’తో విజయ్‌.. ‘యశోద’తో సమంత తదితరులంతా కొత్త పోస్టర్లతో మతాబుల్లా తళుక్కున మెరిశారు.

Updated : 26 Oct 2022 09:40 IST

దీపావళి వేళ చిత్రసీమలో ప్రచార పటాకా పేలింది. డబుల్‌ షాట్‌ బాంబ్‌లా రెండు విడుదల తేదీలు వినిపించి మురిపించారు రవితేజ. ‘ఏజెంట్‌’తో అఖిల్‌.. ‘సార్‌’గా ధనుష్‌.. ‘వారసుడు’తో విజయ్‌.. ‘యశోద’తో సమంత తదితరులంతా కొత్త పోస్టర్లతో మతాబుల్లా తళుక్కున మెరిశారు. మరి ప్రచార చిత్రాలతో వెలుగుల పండక్కి కొత్త కాంతులు అద్దిన ఈ తారల సినీ విశేషాలు తెలుసుకుందాం పదండి..


రవితేజ ధమాకా..

దీపావళి సందర్భంగా ఒకేసారి రెండు విడుదల తేదీలు ప్రకటించి సినీప్రియుల్ని మురిపించారు కథానాయకుడు రవితేజ (Raviteja). అందులో ఒకటి నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ‘ధమాకా’ (Dhamaka). టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. శ్రీలీల కథానాయిక. వినోదం నిండిన మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమా డిసెంబరు 23న విడుదల కానుంది. ఇక రవితేజ హీరోగా నటిస్తున్న ‘రావణాసుర’ (Ravanasura) వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రమిది. అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పోన్నాడ కథానాయికలు. సుశాంత్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.


సంక్రాంతి బరిలోకి ‘ఏజెంట్‌’

టాలీవుడ్‌ సంక్రాంతి బెర్తులన్నీ ఇప్పటికే ఖరారయ్యాయి. ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ (Adipurush), చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, విజయ్‌ ‘వారసుడు’ (Varasudu) సినిమాలు పండగ బరిలో తలపడేందుకు సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి అఖిల్‌ ‘ఏజెంట్‌’ (Agent) వచ్చి చేరింది. సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. స్టైలిష్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని దీపావళి సందర్భంగా అధికారికంగా ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్‌ విడుదల చేశారు.


కొత్త పోస్టర్లు తళుక్కుమన్నాయి..

వెలుగుల పండగ వేళ ‘వారసుడు’ (Varasudu) కొత్త లుక్‌తో యాక్షన్‌ హంగామా రుచి చూపించారు విజయ్‌. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ ద్విభాషా చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీపావళి సందర్భంగా కొత్త లుక్‌ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో విజయ్‌ సుత్తి చేతబట్టి సీరియస్‌గా నడిచొస్తూ కనిపించారు. డిసెంబరు 2న ‘సార్‌’గా పలకరించనున్నారు కథానాయకుడు ధనుష్‌. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ ద్విభాషా చిత్రం తమిళంలో ‘వాతి’గా విడుదల కానుంది. పండగ సందర్భంగా కొత్త లుక్‌ విడుదల చేశారు. అందులో ధనుష్‌ను యాక్షన్‌ మోడ్‌లో ఆసక్తిరేకెత్తించేలా చూపించారు.


టిల్లు వినోదాలు మరోసారి..

‘డీజే టిల్లు’తో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ రూపొందుతోంది. మల్లిక్‌ రామ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ చిత్రానికి ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ విషయాన్ని దీపావళి సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ చిన్న ప్రచార చిత్రాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. అందులో టిల్లు మద్యం మత్తులో ట్రాఫిక్‌ పోలీసులతో వాదన పెట్టుకున్న తీరు ఆద్యంతం నవ్వులు పూయించింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి రామ్‌ మిరియాల స్వరాలందిస్తున్నారు. సాయి ప్రకాష్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


‘యశోద’ సందడి

మంత ‘యశోద’ (Yashoda), సుధీర్‌బాబు ‘హంట్‌’ (Hunt), అనురాగ్‌ - అవికాగోర్‌ ‘ఉమాపతి’, అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ట, అనిఖా సురేంద్రన్‌ల ‘బుట్టబొమ్మ’ తదితర చిత్రాల పోస్టర్లు దీపావళి శుభాకాంక్షలతో విడుదలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని