DJ Tillu Review: రివ్యూ: డీజే టిల్లు

డీజే టిల్లు సినిమా ఎలా ఉందంటే..?

Updated : 07 Dec 2022 21:02 IST

చిత్రం: డీజే టిల్లు; నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్‌, బ్రహ్మాజీ, ప్రగతి, తదితరులు; సినిమాటోగ్రఫీ: సాయిప్రకాశ్‌; ఎడిటర్‌: నవీన్‌ నూలీ; నేపథ్య సంగీతం: తమన్‌; నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ; సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌; కథ, రచన: విమల్‌ కృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ; దర్శకత్వం: విమల్‌ కృష్ణ; విడుదల తేదీ: 12-02-2022

పేరున్న నిర్మాణ సంస్థ నుంచి భారీ చిత్రాలే కాదు.. అప్పుడ‌ప్పుడు ప‌రిమిత వ్యయంతో కూడిన సినిమాలూ వ‌స్తుంటాయి. అలా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థలో రూపొందిన చిత్రమే ‘డీజే టిల్లు’. సిద్ధూ జొన్నలగడ్డ-నాగవంశీ కాంబినేష‌న్‌లో సినిమా మొద‌లైనప్పట్నుంచే ‘డీజే టిల్లు’ ప్రేక్షకుల్లో ఆస‌క్తి మొదలైంది. ప్రచార చిత్రాలు కూడా అందుకు దీటుగా ఉండ‌టంతో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు ఏర్పడ్డాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

క‌థేంటంటే: ఇంట్లో బాల‌గంగాధ‌ర్ తిల‌క్ అని పేరు పెడితే దాన్ని టిల్లుగా మార్చుకుని డీజే నిర్వహిస్తున్న ఓ యువ‌కుడే.. క‌థానాయ‌కుడు (సిద్ధూ జొన్నల‌గ‌డ్డ‌). అంద‌రూ డీజే టిల్లు అని పిలుస్తుంటారు. మంచి మాట‌కారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ అయిన రాధిక (నేహాశెట్టి)ని తొలిసారి చూడ‌గానే ఇష్టప‌డ‌తాడు. ఆమెకి త‌న‌దైన శైలిలో మాట‌లు చెబుతూ చెలిమి చేస్తాడు. ఇంత‌లో అనుకోకుండా రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో చెలిమి చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుపోయే ప‌రిస్థితి వ‌స్తుంది. దాంతో రాధిక చెప్పింద‌ల్లా టిల్లు చేయాల్సి వ‌స్తుంది. మ‌రి ఆ హ‌త్య కేసు నుంచి ఈ ఇద్దరూ బ‌య‌ట‌ప‌డ్డారా? లేదా? ఇంత‌కీ హ‌త్యకి గురైన వ్యక్తి ఎవ‌రు? అదెలా జ‌రిగింది?త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: క్రైమ్‌ నేప‌థ్యంలో సాగే ఓ కామెడీ క‌థ ఇది. క‌థానాయ‌కుడి పాత్ర, అందులో అమాయ‌క‌త్వం, స‌ర‌దాత‌నం, వృత్తి.. ఈ సినిమాకి కొత్తద‌నాన్ని చేకూర్చాయి. క‌థ‌లో యువ‌త‌రాన్ని అల‌రించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు ఆస‌క్తిక‌రమైన క‌థ‌నం వ‌ల్ల ఆరంభ స‌న్నివేశాలు ప‌రుగులు పెడ‌తాయి. ప్రేక్షకుడినీ వేగంగా క‌థ‌లో లీనం చేస్తాయి. రాధిక‌ని ప్రేమ‌లోకి దించాల‌నే ఆలోచ‌న‌తో రంగంలోకి దిగిన డీజే టిల్లు అనుకోకుండా హ‌త్యకేసులో ఇరుక్కుపోవ‌డం.. దాంతో అత‌డిలో పొంగుకొచ్చే ఆవేశం.. అడుగ‌డుగునా అనుమానాస్పదంగా క‌నిపించే రాధిక ప్రవ‌ర్తన‌.. ఆమెని న‌మ్మాలో లేదో తెలియ‌ని టిల్లు సందిగ్ధం.. ఆ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల‌న్నీ ప్రేక్షకుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. న‌ర్రా శ్రీనివాస్‌, బ్రహ్మాజీ, ప్రిన్స్.. ఇలా వ‌రుస‌గా ఒక్కొక్క పాత్ర క‌థ‌లోకి రావ‌డంతో క‌థ‌నం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంది. ప్రథ‌మార్ధం వ‌ర‌కూ కథప‌రంగానూ, కామెడీప‌రంగానూ బ‌లంగా  క‌నిపించిన సినిమా ద్వితీయార్ధంలో మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపించ‌లేక‌పోయింది. క్రమంగా కామెడీ త‌గ్గడం, చెప్పాల్సిన క‌థ కూడా లేక‌పోవ‌డంతో స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. మెమ‌రీ లాస్ అంటూ ద్వితీయార్ధంలో క‌థానాయ‌కుడు చేసే హంగామా పెద్దగా మెప్పించ‌దు. కోర్ట్ రూమ్‌లో హంగామా న‌వ్వించ‌క‌పోగా, ఆ స‌న్నివేశాలు ఏమాత్రం హుందాగా అనిపించ‌వు. క‌థానాయిక పాత్రని కూడా పూర్తిస్థాయిలో ఆవిష్కరించ‌లేక‌పోయారు. క‌థానాయ‌కుడి పాత్రలో ఉన్నంత బ‌లం మిగ‌తా పాత్రల్లోనూ క‌నిపించుంటే ఈ సినిమా మ‌రో స్థాయిలో ఉండేది.

ఎవ‌రెలా చేశారంటే: డీజే టిల్లుగా సిద్ధూ జొన్నల‌గ‌డ్డ ఆక‌ట్టుకున్నారు. ఆ పాత్రకి త‌గ్గ హావ‌భావాలు,  తెలంగాణ యాస‌లో చెప్పిన సంభాష‌ణ‌లు న‌వ్వించ‌డంతోపాటు, సినిమాకి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలిచాయి. క‌థానాయిక నేహాశెట్టి అందంగా క‌నిపించ‌డంతోపాటు, రాధికగా మంచి అభిన‌యం ప్రద‌ర్శించింది. బ్రహ్మాజీ, న‌ర్రా శ్రీను త‌దిత‌ర హాస్యన‌టులున్నా వాళ్ల పాత్రలు సినిమాపై చూపించిన ప్రభావం త‌క్కువే. ప్రిన్స్ క‌థ‌లో కీల‌క‌మైన పాత్రలో క‌నిపిస్తారు. సంగీతం సినిమాకి ప్రధాన‌బ‌లం. రామ్‌ మిరియాల, శ్రీచరణ్‌ పాకాల అందించిన పాట‌లు సినిమాకి మ‌రింత ఊపునిస్తాయి. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం బాగుంది. ద‌ర్శకుడు విమ‌ల్ కృష్ణ ద్వితీయార్ధంపై ప‌ట్టుకోల్పోయిన‌ట్టు అనిపిస్తుంది. క‌థానాయ‌కుడి పాత్రపై త‌ప్ప ఇత‌ర పాత్రల‌పై పెద్దగా క‌స‌ర‌త్తులు జ‌రిగిన‌ట్టు అనిపించ‌దు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గట్టుగా ఉన్నాయి. క‌థానాయ‌కుడిగానే కాకుండా, మాట‌ల ర‌చ‌న బాధ్యత‌ని కూడా భుజాన వేసుకున్న సిద్ధూ అందులోనూ ప్రభావం చూపించారు.

బ‌లాలు

+ సిద్ధూ జొన్నల‌గ‌డ్డ న‌ట‌న‌, మాటలు

ప్రథ‌మార్థం

సంగీతం

బ‌ల‌హీన‌త‌లు

- ద్వితీయార్ధం

కొన్ని సంభాషణలు

చివ‌రిగా: డీజే టిల్లు.. న‌వ్విస్తాడు

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు