RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌ సాధ్యమవుతుందా?

ప్రస్తుతం తెలుగుతో పాటు, బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న చిత్రం‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన

Published : 08 Apr 2022 01:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం తెలుగుతో పాటు, బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR). ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram charan) కథానాయకులుగా రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సీక్వెల్‌ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఓ ఇంటర్వ్యూలో రచయిత విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ అడిగితే తన ఆలోచనలను పంచుకున్నానని, అవి రాజమౌళి, ఎన్టీఆర్‌కు బాగా నచ్చాయని చెప్పారు. దైవానుగ్రహం ఉంటే సీక్వెల్‌ వస్తుందని చెప్పడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం అటు రాజమౌళి, ఇటు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు ఉన్న కమిట్‌మెంట్‌లను చూస్తే సీక్వెల్‌ సాధ్యమయ్యే పనేనా? అంటే దాదాపు కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకు ఈ కారణాలు కూడా ఉన్నాయి.

రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఒకే కథను రెండు భాగాలుగా తీశారు. అందులో ‘కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడు’ అన్న ఆసక్తికర పాయింట్‌ ప్రేక్షకుడిని రెండేళ్లైనా వేచి చూసేలా చేసింది.  ‘ఆర్ఆర్‌ఆర్‌’కు అలాంటి వెసులుబాటు లేదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు తోడు రాజమౌళి అనే బ్రాండ్‌ ఈ సినిమాకు మంచి హైప్‌ తీసుకొచ్చింది. కమర్షియల్‌గా అన్ని హంగులతో తీర్చిదిద్దినా, సినిమా మొత్తం చూసిన తర్వాత ఏదో తెలియని వెలితితో ప్రేక్షకుడు బయటకు వస్తున్నాడు. నిండు భోజనం చేసిన ఫీలింగ్‌ రాలేదు. ఈ క్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’కు కొనసాగింపు అంటే ఆ కథలో బలమైన ఎమోషన్‌ ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్న రాజమౌళి, ఆయన టీమ్‌ తర్వాతి సినిమా కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే బ్యాగ్రౌండ్‌ వర్క్‌ మొదలు పెట్టినట్టు టాక్‌. మహేశ్‌బాబుతో జక్కన్న సినిమా చేయడం ఖాయం. అయితే, కథేంటి? నేపథ్యం ఏంటి? మహేశ్‌ పాత్ర ఏంటి? విలన్‌ ఎవరు? తెలియాల్సి ఉంది. అందుకు ఇంకా సమయం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి మహేశ్‌ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. రాజమౌళి స్కూల్‌ నుంచి బయటకు రావడానికి మహేశ్‌కు కనీసం రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో జక్కన్న ఓ సినిమా చేస్తారని టాక్‌. విజయేంద్రప్రసాద్‌ మరో మాట కూడా అన్నారు. ‘విక్రమార్కుడు2’ చేస్తున్నారట. ఇవన్నీ పూర్తయితే అప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌2’ ఉంటుందా? లేదా? కాలమే నిర్ణయిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని