Driver Jamuna Review: రివ్యూ: డ్రైవర్‌ జమున

Driver Jamuna Review: ఐశ్వర్యరాజేశ్‌ కీలక పాత్రలో నటించిన ‘డ్రైవర్‌ జమున’ఎలా ఉందంటే?

Updated : 23 Jan 2023 16:38 IST

Driver Jamuna Review; చిత్రం: డ్రైవర్‌ జమున; నటీనటులు: ఐశ్వర్య రాజేశ్‌, ఆడుకాలం నరేన్‌, కవితా భారతి, అభిషేక్‌ కుమార్‌, ఇలియ పాండి, మణికందన్‌ రాజేశ్‌ తదితరులు; సంగీతం: జిబ్రాన్‌; సినిమాటోగ్రఫీ: గోకుల్‌ బినోయ్‌; ఎడిటింగ్‌: ఆర్‌.రామర్‌; నిర్మాత: ఎస్పీ చౌదరి; రచన, దర్శకత్వం: పి.కిన్‌స్లిన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా

ప్రేక్షకులను అలరించడంలో ఇటీవల క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథలు ముందుంటున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం కాసేపు టీవీ, మొబైల్‌ ముందుకూర్చొన్న వారిని కదలకుండా రెండు గంటలు కూర్చోబెడితే చాలు.. ఆ సినిమా హిట్టయినట్టే. థియేటర్‌తో పాటు, ఓటీటీలోనూ ఇలాంటి సినిమాలు చూడటానికి ప్రేక్షకులకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఈ జానర్‌లో వచ్చిన చిత్రం ‘డ్రైవర్’ జమున. (Driver Jamuna Review) ఐశ్వర్య రాజేశ్‌ నటించిన ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను థ్రిల్‌ చేసే అంశాలు ఏమున్నాయి?

కథేంటంటే: తండ్రి చనిపోవడంతో అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తుంటుంది జమున (ఐశ్వర్యరాజేశ్‌). బంధువులు వద్దని చెప్పినా, పక్షవాతానికి గురైన తల్లికి వైద్యం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో క్యాబ్‌ డ్రైవర్‌గా మారుతుంది. మాజీ ఎమ్మెల్యేను హత్య చేయడానికి వెళ్తూ, యాక్సిడెంట్‌ అవడంతో ముగ్గురు కిరాయి హంతకులు జమున క్యాబ్‌ బుక్‌ చేసుకుని ఎక్కుతారు. మామూలు ప్రయాణికులు అనుకుని రైడ్‌ ఓకే చేసిన జమునకు వాళ్లు క్రిమినల్స్‌ అని ఎలా తెలిసింది? ఆ తర్వాత వాళ్ల నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది? (Driver Jamuna Review)  ఈ క్రమంలో జమునకు ఎదురైన పరిస్థితులు ఏంటి? వాళ్లు మాజీ ఎమ్మెల్యేను హత్య చేయడానికి జమున క్యాబ్‌లోనే ఎందుకు వెళ్లారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇదొక క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్. ఇలాంటి చిత్రాలకు కావాల్సింది చివరి వరకూ ప్రేక్షకుడిని తెరకు ఎంగేజ్‌ చేయడమే. ఆ విషయంలో దర్శకుడు కిన్‌స్లిన్‌ విజయం సాధించారు. జమున ఎవరు?ఆమె కుటుంబం పరిస్థితులు ఏంటి? అని చెబుతూ ఫస్ట్‌ గేర్‌ వేసి, కాస్త నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అక్కడి నుంచి రెండో గేర్‌ వేయడానికి కాస్త సమయం పట్టింది. కిరాయి హంతకులు క్యాబ్‌ ఎక్కిన తర్వాత ఆ గేర్‌ పడింది. అక్కడి నుంచి అటు కారు, ఇటు కథనం రెండింటిలోనూ వేగం పెరుగుతుంది. కారులో ఎక్కిన వారు హంతకులు అని జమునకు ఎలా తెలుస్తుందా? అన్న ఉత్కంఠ సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని తొలిచేస్తుంది. (Driver Jamuna Review)  అప్పుడే కథనంలో మూడో గేర్‌ వేశాడు దర్శకుడు. జమునకు ఆ విషయం తెలియడం, అనుకోకుండా పోలీసులతో ఆమె మాట్లాడుతున్న మాటలను క్యాబ్‌లోని స్పీకర్ల ద్వారా హంతకులు వినడంతో నాలుగు, ఐదు గేర్లను ఒకేసారి వేసేశాడు దర్శకుడు. అక్కడి నుంచి కథనం, కారు 100కి.మీ వేగంతో దూసుకుపోతాయి.

అటు వెంటాడుతున్న పోలీసులను తప్పించుకునేందుకు హంతకులు చేసే ప్రయత్నాలు.. ఇటు దుండగుల చేతిలో నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని జమున చేసే ప్రయత్నాలతో సినిమాను ఎక్కడా స్పీడ్‌ బ్రేకర్లు లేకుండా తీసుకెళ్లాడు దర్శకుడు. (Driver Jamuna Review)  ఒకవైపు పోలీసుల ఛేజింగ్‌ చూపిస్తూనే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే హత్యకు జరిగే కుట్ర సన్నివేశాలను సమాంతరంగా నడిపాడు. అయితే, తనపై హత్య జరుగుతుందన్న విషయం తెలిసిన తర్వాత కూడా సదరు నాయకుడు పోలీసులను ఆశ్రయించకపోవడం, అందుకు కిరాయి రౌడీలను పెట్టుకోవడం ఏమాత్రం లాజిక్‌గా అనిపించదు. ‘పోలీసులు హంతకులను పట్టుకునేందుకు తిరిగే కన్నా, నేరుగా మాజీ  ఎమ్మెల్యేకే రక్షణ కల్పించడానికి ప్రయత్నించి ఉంటే, బాగుండేది కదా అన్న లాజిక్‌’ సినిమా చూసిన తర్వాత రాకమానదు. అది వదిలేస్తే, మిగిలిన సన్నివేశాలన్నీ కథానుగుణంగానే సాగుతాయి. పతాక సన్నివేశాలు మరింత ఆసక్తిగా అనిపిస్తాయి. వాళ్లు మాజీ ఎమ్మెల్యేనే ఎందుకు హత్య చేయాలన్న విషయం చెప్పడానికి దర్శకుడు వేసిన రివర్స్‌ గేర్‌ అదేనండీ, ‘ఫ్లాష్‌బ్యాక్‌’ ఎమోషనల్‌గా అనిపించినా, అది రొటీన్‌గానే అనిపిస్తుంది. చివరిలో వచ్చే ఒకట్రెండు ట్విస్టులు మెప్పిస్తాయి. సస్పెన్స్‌ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ‘డ్రైవర్‌ జమున’ కచ్చితంగా నచ్చుతుంది. నిడివి కూడా తక్కువే.

ఎవరెలా చేశారంటే: సినిమా మొత్తం జమున పాత్ర చుట్టే సాగుతుంది. ఆమే ఈ కథకు కీలకం. సగటు మహిళగా ఆ పాత్రలో ఐశ్వర్య రాజేశ్‌ తనదైన నటనతో మెప్పించారు. హంతకుల నుంచి విషమ పరిస్థితులు ఎదురైనప్పుడు ఆమె నటన, పలికించిన హావభావాలు మెప్పిస్తాయి. మిగిలిన నటీనటులు ఎవరూ తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేదు. గోకుల్‌ బినోయ్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కారు డ్రైవింగ్‌, ఛేజింగ్‌ సన్నివేశాలను చాలా బాగా తీశారు. (Driver Jamuna Review)  ఆర్‌.రామర్‌ ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. అనవసర సన్నివేశాలకు పోకుండా రెండు గంటల నడివితో కట్‌ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పి.కిన్‌స్లిన్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తది కాకపోయినా స్క్రీన్‌ప్లేను నడిపిన విధానం, కారు ఛేజింగ్‌ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఉంది. ప్రేక్షకులకు మంచి థ్రిల్లర్‌ను ఇవ్వడంతో ఆయన విజయం సాధించారు.

బలాలు: + ఐశ్వర్య రాజేశ్‌; + కథనం; + పతాక సన్నివేశాలు

బలహీనతలు: - పాత్ర పరిచయానికి కాస్త సమయం; - అక్కడక్కడా లాజిక్‌ లేని సన్నివేశాలు

చివరిగా: ఆసక్తికర మలుపులతో డ్రైవింగ్‌ చేసిన జమున(Driver Jamuna Review)

గమనిక: ఈ  సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని