Sita Ramam Review: రివ్యూ: సీతారామం

దుల్కర్‌-మృణాల్‌ల ‘సీతారామం’ ఎలా ఉందంటే 

Updated : 05 Aug 2022 14:02 IST

Sita Ramam Review.. చిత్రం: సీతారామం; తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, సుమంత్, గౌతమ్ మేనన్, ప్రకాష్ రాజ్, తదితరులు; ఛాయాగ్రహణం: పీఎస్ వినోద్, శ్రేయాస్‌ కృష్ణన్‌; సంగీతం: విశాల్ చంద్రశేఖర్; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు; ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు; ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి; సమర్పణ: వైజయంతీ మూవీస్; నిర్మాణ సంస్థ‌: స్వప్న సినిమాస్‌; నిర్మాత: అశ్వనీదత్; దర్శకత్వం: హను రాఘవపూడి; విడుద‌ల‌: 05-08-2022

భారీ అంచ‌నాల మ‌ధ్య ఆగ‌స్టు నెల మొద‌లైంది. అగ్రతార‌ల సినిమాలు కాక‌పోయినా.. ఆకర్షించే కాంబినేషన్‌లలో సినిమాలు ముస్తాబ‌య్యాయి. ఈవారం విడుద‌లైన రెండు సినిమాలు ప్రచార‌ హంగామాలతో  ప్రేక్షకుల దృష్టిని బాక్సాఫీసు వైపు మ‌ళ్లించాయి. ఆ రెండింటిలో ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కిన ఒక చిత్రం ‘సీతారామం’ (Sita Ramam). పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

క‌థేంటంటే: ఇండియ‌న్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌).. మ‌ద్రాస్ రెజిమెంట్‌లో ప‌నిచేస్తుంటాడు. మాన‌వ‌త్వం ఉన్న వ్యక్తి. అనాథ అయిన రామ్ క‌శ్మీర్‌లో ప్రాణాలు ఎదురొడ్డి దేశం కోసం పోరాటం చేస్తుంటాడు. ఒక మిష‌న్ త‌ర్వాత.. అత‌డు, అతడి బృందం పేరు మార్మోగిపోతుంది. ఆల్ ఇండియా రేడియోలో తానొక అనాథ అని చెప్పిన‌ప్పట్నుంచీ.. అత‌డికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ సీతామ‌హాల‌క్ష్మి ఎవ‌రు?  అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడినుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? వీళ్లిద్దరి క‌థ‌తో ఆఫ్రిన్‌(ర‌ష్మిక‌)కు సంబంధ‌మేమిటనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: ఆర్మీ నేప‌థ్యంలో సాగే ఓ పీరియాడిక‌ల్ ప్రేమ‌క‌థా చిత్రమిది. చాలా రోజుల త‌ర్వాత తెలుగులో రూపుదిద్దుకున్న ప్రేమ‌క‌థ కావ‌డం.. అది కూడా ఆర్మీ నేప‌థ్యంలో సాగ‌డంతో ప్రేక్షకుల‌కు ఓ స‌రికొత్త అనుభ‌వాన్ని పంచుతుంది. పాత్రల్ని, వాటి నేప‌థ్యాన్ని ప‌రిచ‌యం చేసే క్రమంలో అస‌లు క‌థ‌లోకి వెళ్లడానికి స‌మ‌యం తీసుకున్నాడు ద‌ర్శకుడు. సీతారామం మిష‌న్‌లో భాగంగా బాలాజీ (త‌రుణ్ భాస్కర్‌)తో క‌లిసి ఆఫ్రిన్ రంగంలోకి దిగ‌డంతో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఫ్లాష్ బ్యాక్ మొద‌ల‌య్యాక.. సీత కోసం రామ్ చేసిన ప్రేమ‌ప్రయాణం, ఆమెను క‌లిశాక ఇద్దరూ ద‌గ్గర‌య్యే తీరు, ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేనంతగా అనుబంధం ఏర్పడిన వైనం, ఆ త‌ర్వాత క‌థ‌లో చోటు చేసుకునే సంఘ‌ర్షణ ఆక‌ట్టుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని స‌న్నివేశాలు సుదీర్ఘంగా సాగుతున్నట్టు అనిపిస్తాయి. రామ్‌, సీత‌ల ప్రేమ‌క‌థ‌ను ఉత్తరాలతో మొద‌లుపెట్టిన తీరు ఆక‌ట్టుకుంటుంది. విరామ స‌మ‌యంలో వ‌చ్చే మ‌లుపు క‌థ‌ని మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుస్తుంది. ద్వితీయార్ధం విష‌యంలో త‌డ‌బాటుకి గుర‌వుతుంటార‌నే ఫిర్యాదు ద‌ర్శకుడు హ‌ను రాఘ‌వ‌పూడిపై ఉంది. కానీ.. ఈ సినిమాకి మాత్రం రివర్స్ అయ్యింది. ప్రథ‌మార్ధంలో స‌న్నివేశాలు ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టుగా, నత్తన‌డ‌క‌గా సాగిన‌ట్టు అనిపించినా.. ద్వితీయార్ధంపై మాత్రం మంచి ప‌ట్టు ప్రద‌ర్శించారు. ఇంత‌కీ రామ్ రాసిన లేఖ‌లో ఏముంది?  సీతామ‌హాల‌క్ష్మి, రామ్ ఒక్కట‌య్యారా? లేదా? ఆఫ్రిన్ ఎవ‌రు? అనే విష‌యాలు సెకండాఫ్‌లో కీల‌కం. ప‌లు పార్శ్వాలుగా క‌థ‌ని రాసుకుని, అంతే ప‌క‌డ్బందీగా న‌డిపించారు ద‌ర్శకుడు. ర‌చ‌న‌, మేకింగ్‌లో క‌వితాత్మక‌త ఉట్టిప‌డుతుంది. ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి మ‌రో హైలైట్‌గా నిలుస్తాయి. క‌థ‌లో వేగం కొర‌వ‌డటం, ఆరంభ స‌న్నివేశాలు మిన‌హా సినిమా ప్రేక్షకుల మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా ఉంటుంది.

ఎవ‌రెలా చేశారంటే: ప్రేమ‌క‌థ‌ల‌కు ప్రధాన జోడీ మ‌ధ్య కెమిస్ట్రీ కీల‌కం. ఆ విష‌యంలో దుల్కర్‌, మృణాల్ మంచి ప్రతిభ‌ చూపించారు. దుల్కర్ క‌ళ్లతోనే భావాల్ని ప‌లికించాడు. మృణాల్ ఠాకూర్ రాణిలా క‌నిపిస్తూనే చ‌క్కటి భావోద్వేగాల్ని పండించింది. ఆమె న‌ట‌న సినిమాకు హైలైట్‌. ర‌ష్మిక‌, సుమంత్‌, త‌రుణ్ భాస్కర్ త‌దిత‌రుల పాత్రలు కూడా ఆక‌ట్టుకుంటాయి. వెన్నెల కిషోర్‌, సునీల్ న‌వ్వించ‌డంలో ప‌ర్వాలేద‌నిపించారు. స‌చిన్ ఖేడ్కర్‌, ముర‌ళీశ‌ర్మ‌, ప్రకాశ్‌రాజ్‌, గౌత‌మ్ మేన‌న్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా అత్యుత్తమంగా ఉంది. పీరియాడిక‌ల్ నేప‌థ్యానికి త‌గ్గట్టుగా అప్పటి వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌డంలో చిత్రబృందం తీసుకున్న జాగ్రత్తలు తెర‌పై స్పష్టంగా క‌నిపిస్తాయి. క‌శ్మీర్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు చాలా బాగుంటాయి. కెమెరా, సంగీతం విభాగాలు సినిమాకి ప్రాణం పోశాయి. ద‌ర్శకుడి ర‌చ‌న‌లో బ‌లం క‌నిపిస్తుంది. మాట‌లు ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణం భేష్‌.

బ‌లాలు
+క‌థ‌, క‌థ‌నం
+దుల్కర్‌, మృణాల్ కెమిస్ట్రీ
+ద్వితీయార్ధం
+పాట‌లు, సంగీతం

బ‌ల‌హీన‌త‌లు
-ప్రథ‌మార్ధం
-అక్కడ‌క్కడా నిదానంగా సాగే స‌న్నివేశాలు

చివ‌రిగా: ‘సీతారామం’ ఓ క‌వితాత్మక ప్రేమ‌క‌థ‌
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని