Dulquer Salmaan: అవార్డు వస్తే.. డబ్బులతో కొన్నానని ట్రోల్‌ చేశారు: దుల్కర్‌ సల్మాన్‌

‘మహానటి’తో తెలుగువారికి ఎంతగానో చేరువైన మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan)‌. ‘సీతారామం’ (SitaRamam) లాంటి మనసుని హత్తుకొనే....

Published : 25 Sep 2022 11:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మహానటి’తో తెలుగువారికి ఎంతగానో చేరువైన మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan)‌. ‘సీతారామం’ (SitaRamam) లాంటి మనసుని హత్తుకొనే ప్రేమకావ్యంలో ఓ వైపు ప్రేమికుడిగా, మరోవైపు సైనికుడిగా తన నటనతో ఆయన అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడైతే దుల్కర్‌ ప్రశంసలు అందుకుంటున్నారు కానీ గతంలో ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. స్టార్‌హీరో మమ్ముట్టి కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ దుల్కర్‌ సూటిపోటి మాటలు ఎదుర్కొక తప్పలేదు. ఇదే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన బయటపెట్టారు.

‘‘నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. ముఖ్యంగా 2016లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడిగా అవార్డు అందించింది. ఆ తర్వాత కొన్నిరోజులకే సోషల్‌మీడియాలో నేనొక ట్రోల్‌ చూశా. ‘‘నీ అవార్డుని అమ్మాలనుకుంటున్నావా? అయితే దాన్ని నాకు ఇచ్చెయ్‌. నువ్వు కొన్న దానికంటే రూ.50 వేలు ఎక్కువ ఇస్తా’’ అని ఉంది. అందులో నా ఫొటో ఉపయోగించారు. ఈ ఒక్క ట్రోల్‌ నన్ను తీవ్ర నిరాశ, బాధకు గురి చేసింది. ఒకవేళ నేను నిజంగానే ఆ అవార్డుని డబ్బుతో కొనుక్కొని ఉంటే.. అన్ని సంవత్సరాలు ఆగడమెందుకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే కొనుగోలు చేసేవాడిని కదా. ఇదే విషయంపై నాకొక స్నేహితుడు మంచి సందేశం ఇచ్చాడు. మనం చేసిన పనికి మాత్రమే అవార్డులు ఇచ్చారనుకుంటాం. కానీ, భవిష్యత్తులో చేయనున్న పనుల్లో ఉత్సాహాన్ని నింపడానికి వాటిని ఇచ్చి ప్రోత్సహిస్తారు. కాబట్టి, నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని అతడు చెప్పడంతో బాధ నుంచి బయటకు వచ్చా’’ అని దుల్కర్‌ ఆనాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని