Ayushmann Khurrana: నీ లుక్స్‌ బాలేవు.. వెళ్లిపో అన్నారు

2003లో జీ ఛానెల్‌ నిర్వహించిన ‘‘ఇండియా బెస్ట్‌ సినీ స్టార్స్‌’’లో ఆడిషన్స్‌లో పాల్గొన్నా. అప్పట్లో నేను సోడాబుడ్డి కళ్లద్దాలు ధరించి.. బక్కగా ఉండేవాడిని. ఎత్తు కూడా 6అడుగులలోపే. దీంతో లుక్స్‌ బాలేవు అని మొదటి ఆడిషన్స్‌లోనే పంపేశారు.

Published : 14 Sep 2021 22:29 IST

అప్పటి రోజులను గుర్తుచేసుకున్న బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా

ముంబయి: ‘‘ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి’’ అనే సామెతకు సరైన ఉదాహరణ బాలీవుడ్‌ యువ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా జీవితంలో జరిగిన ఓ సంఘటన. మంగళవారం ఆయన 37వ పుట్టినరోజు. ఈ సందర్భంగా కెరీర్‌ ఆరంభంలో జరిగిన ఓ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘ జీవితం వడ్డించిన విస్తరి కాదు.. కెరీర్‌ ఆరంభంలో నీ లుక్స్‌ బాగోలేవు అని ఓ రియాల్టీ షో నన్ను పక్కన పెట్టేసింది. 2003లో జీ ఛానెల్‌ నిర్వహించిన ‘‘ఇండియా బెస్ట్‌ సినీ స్టార్స్‌’’లో ఆడిషన్స్‌లో పాల్గొన్నా. అప్పట్లో నేను సోడాబుడ్డి కళ్లద్దాలు ధరించి.. బక్కగా ఉండేవాడిని. ఎత్తు కూడా 6అడుగులలోపే. దీంతో లుక్స్‌ బాలేవు అని మొదటి ఆడిషన్స్‌లోనే పంపేశారు. అదే షో ద్వారా నటులు అంకిత లోఖండే, అదితి శర్మా ఇలా కొందరు వెలుగులోకి వచ్చారు. నేను మాత్రం వెనుకబడిపోయా. అంతేకాదు.. దీనితోడు బంధుప్రీతి సైతం ఎదుర్కొవాల్సి వచ్చింది. అయితే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా! ప్రతిభ ఉంటే చాలు పరిస్థితులు ఎలా ఉన్నా అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి. అలా.. 2012లో నేను నటించిన  ‘విక్కీ డొనర్‌’ చిత్రం విడుదలైంది. అది కాస్త హిట్‌ అవ్వడంతో ఒక్కసారిగా నా కెరీర్‌ మలుపుతిరిగింది. కట్‌ చేస్తే.. గతంలో ఏ షోకి ఐతే నన్ను రిజెక్ట్‌ చేశారో.. 2014లో అదే షోకి నన్ను మెంటార్‌గా ఆహ్వానించారు. షో స్టేజీ ఎక్కగానే నన్ను ఆడిషన్‌లో రిజెక్ట్‌ చేసిన రోజులు గుర్తుచేసుకున్నా ’’ అని వివరించారు. ‘విక్కీ డొనర్‌’తో ప్రారంభమైన ఆయుష్మాన్‌ సినీ ప్రయాణం.. బదాయిహో, ఆర్టికల్‌ 15, డ్రీమ్‌గర్ల్‌, బదాయ్‌ హో, గులాబో సితాబో విజయాలతో ముందుకు సాగింది. అంతేకాదు 2018లో శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అంధాధున్‌’ చిత్రంతో ఉత్తమ జాతీయ నటుడు పురస్కారాన్ని అందుకున్నారాయన.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని