దీపావళి రేసులో రజనీ, కమల్‌

రజనీకాంత్, కమల్‌హాసన్‌... తమిళ సూపర్‌స్టార్లు ఇద్దరూ దీపావళికి బాక్స్‌ఫీసు వద్ద పోరుకు సిద్ధమవుతున్నారా?.. అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఇప్పటికే రజనీకాంత్‌ నటిస్తున్న ‘అన్నాత్తై’ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు...

Published : 11 Apr 2021 12:25 IST

చెన్నై: రజనీకాంత్, కమల్‌హాసన్‌... తమిళ సూపర్‌స్టార్లు ఇద్దరూ దీపావళికి బాక్స్‌ఫీసు వద్ద పోరుకు సిద్ధమవుతున్నారా?.. అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఇప్పటికే రజనీకాంత్‌ నటిస్తున్న ‘అన్నాత్తై’ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇందులో తలైవా గ్రామాధ్యక్షుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత చిత్రీకరణ కోసం రజనీ హైదరాబాద్‌ వచ్చారు. ఇక్కడి రామోజీఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణలో పాల్గొంటున్నారు. వేగంగా షూటింగ్‌ పూర్తిచేసి... తదనంతర పనులు చేపట్టాలని ఈ బృందం ప్రణాళికతో ఉంది. మరోవైపు కమల్‌హాసన్‌-లోకేశ్‌ కనగరాజ్‌ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘విక్రమ్‌’ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని సంకల్పించారు. తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ పూర్తి అయిన వెంటనే కమల్‌ దీనికోసం రంగంలోకి దిగారు. ఇందులో ఆయన పోలీసు అధికారిగా నటిస్తున్నారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జోరుగా షూటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమానీ దీపావళి రేసులో నిలపాలని చిత్రబృందం ఆలోచిస్తోంది. ఇదే నిజమైతే తమిళనాట ఇద్దరూ అగ్ర కథానాయకుల చిత్రాలతో అభిమానులు హోరెత్తనున్నారు. ఈ రెండు చిత్రాలు తెలుగులోనూ విడుదల కానున్నాయి. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఈ ఇద్దరూ బాక్స్‌ఫీసు వద్ద తలపడ్డారు. రజనీ నటించిన      ‘చంద్రముఖి’, కమల్‌ ‘ముంబయి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రాలు 2005 తమిళ సంవత్సరాదికి పోటీపడి అభిమానులను అలరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని