Suriya: ఈ క్షణాలు ఎప్పటికీ మర్చిపోను: సూర్య

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు (National Film Awards) పొందిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని నటుడు సూర్య (Suriya) అన్నారు.

Updated : 01 Oct 2022 10:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు (National Film Awards) పొందిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని నటుడు సూర్య (Suriya) అన్నారు. శుక్రవారం సాయంత్రం దిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ‘‘సురారై పోట్రు’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా. భారత ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. ఈ క్షణం ఎంతోమందికి థ్యాంక్స్‌ చెప్పాలి. ముఖ్యంగా చిత్ర దర్శకురాలు సుధాకొంగరకు. కొవిడ్‌ సమయంలో ఈ సినిమా అందరిలో ఒక ధైర్యాన్ని నింపింది. ఆమె పదేళ్ల కష్టమే ఈ సినిమా. జాతీయ అవార్డుతో మా ప్రయాణం సఫలీకృతమైందనుకుంటున్నా. మా చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి.. ఇంతకు మించిన గౌరవం ఇంకేం ఉంటుంది. ఈ అవార్డు మాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే.. ఉత్తమ చిత్రంగా ఒక తమిళ చిత్రం ఎంపికై సుమారు 13 ఏళ్లు అవుతోంది. ఇక, నా సతీమణి జ్యోతిక.. తానెప్పుడూ నాపై  వెలుగుని ప్రసరిస్తూనే ఉంటుంది. నా కంటే ముందు తానే ఈ సినిమాపై నమ్మకం ఉంచింది. రాష్ట్రపతి చేతులమీదుగా ఆమె అవార్డు అందుకోవడం చూసి నేనెంతో సంతోషించా’’ అని సూర్య పేర్కొన్నారు.

ఎయిర్‌ డెక్కన్‌ సంస్థ అధినేత కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘సురారై పోట్రు’. సుధా కొంగర దర్శకురాలు. సూర్య, అపర్ణా బాలమురళీ జంటగా నటించిన ఈ చిత్రం 2020లో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు వరించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ ప్లే, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని