Aparna Balamurali: ఆ విద్యార్థి ప్రవర్తన నన్ను బాధించింది: అపర్ణా బాలమురళీ

ఎర్నాకులం న్యాయకళాశాల విద్యార్థి అనుచిత ప్రవర్తన పట్ల నటి అపర్ణా బాలమురళీ స్పందించారు.

Updated : 20 Jan 2023 18:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి అపర్ణా బాలమురళీ (Aparna Balamurali)తో ఎర్నాకులం న్యాయకళాశాల విద్యార్థి అనుచిత ప్రవర్తన వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నటి అపర్ణ మాట్లాడారు. అది తనని ఎంతగానో బాధించిందని వాపోయారు. ‘అదొక తీవ్రమైన చర్య. న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరమన్న విషయం అర్థం చేసుకోలేరా? బలవంతంగా నా చేయి పట్టుకుని కుర్చీలో నుంచి పైకి లేపడం సరైన పద్ధతి కాదు. అంతేకాకుండా అతని చేతులు నా భుజాలపై వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళపట్ల ప్రవర్తించాల్సిన తీరు కాదిది’ అని అన్నారు. ఈ ఘటనపై తానేమీ పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని అపర్ణా బాలమురళీ తెలిపారు. ఫిర్యాదు చేసి, దాని వెనుక పరిగెత్తే సమయం తనకు లేదన్నారు. సదరు విద్యార్థి చేసిన చర్యను తాను ఖండిస్తున్నానని అన్నారు. ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు తనకు క్షమాపణ చెప్పారని ఆమెను వివరించారు.

మరోవైపు  అపర్ణ పట్ల అనుచితంగా ప్రవర్తించిన యువకుడిని కళాశాల యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. అతడిపై వారం రోజులపాటు సస్పెన్షన్‌ విధించినట్లు స్థానిక ప్రతికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. అంతేకాకుండా ఈ ఘటనపై విద్యార్థి వివరణ కోరింది. మరోవైపు, కళాశాల యూనియన్‌.. నటికి క్షమాపణలు చెబుతూ ఓ లేఖను విడుదల చేసింది. ‘‘లా కళాశాలలోని ఓ కార్యక్రమానికి హాజరైన నటికి ఇలాంటి సంఘటన ఎదురుకావడం నిజంగా దురదృష్టకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే యూనియన్‌ అధికారి ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆమెకు ఇబ్బంది కలిగేలా చేసినందుకు మరోసారి క్షమాపణలు తెలుపుతున్నాం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, సదరు విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొంది.

తన తదుపరి చిత్రం ‘తన్కమ్‌’ (Thankam) ప్రమోషన్స్‌లో భాగంగా సహనటుడు వినీత్‌ శ్రీనివాసన్‌తో కలిసి అపర్ణా బాలమురళీ (Aparna Balamurali) కేరళలోని ఓ లా కాలేజీలో సందడి చేశారు. అపర్ణ స్టేజ్‌పై కూర్చొని ఉండగా.. ఓ విద్యార్థి అక్కడికి చేరుకుని ఆమెకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. అనంతరం కుర్చీలో కూర్చొన్న ఆమె చేయి పట్టుకుని పైకి లాగాడు. దీంతో చేసిదిలేక ఆమె నిల్చొగానే.. ఆ యువకుడు భుజంపై చేయి వేయబోయాడు. యువకుడి అనుచిత ప్రవర్తనకు కంగుతిన్న ఆమె.. అతడి నుంచి దూరంగా జరిగింది. దీనికి సంబంధించి వీడియో ఒకటి బయటకు రాగా.. నెటిజన్లు ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని