Geetha: చిరంజీవితో ఒక సినిమా చేయాలని ఉంది: నటి గీత

ఆలీతో సరదాగాలో నటి గీత పంచుకున్న విశేషాలివే

Published : 29 Sep 2022 10:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌‌: ఆమె అమ్మ పాత్రలు చేసినా.. అక్క పాత్ర వేసినా ఒదిగిపోతారు. హీరోయిన్‌గా చేసినప్పుడు ఆమె కోసమే కుర్రకారు సినిమాలు చూసేవారు. ఎలాంటి పాత్రకైనా జీవం పోసే నటి గీత. ఆమె పాత్రను పోషించినట్టు అనిపించదు.. ప్రేమించినట్టు ఉంటుంది. 40 ఏళ్ల నట ప్రస్థానంలో దక్షిణాది భాషల్లో 200లకుపైగా చిత్రాల్లో నటించారు. ఈటీవీ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్న గీత తన సినీ విశేషాలను పంచుకున్నారు.

అలీ: మీరు ఇప్పుడెక్కడ ఉంటున్నారు..? ఇండియాలోనా.. అమెరికాలోనా? ఈ ప్రశ్న ఎందుకంటే మీరు ఇక ఇండియాకు రారు అని ప్రచారం జరుగుతోంది..

గీత: అందరూ అనే విషయం నిజమే. పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లా. బాధ్యతలు తగ్గిన తర్వాత మళ్లీ చెన్నైకి వచ్చా. మా బాబు చదువు పూర్తైంది. జాబ్‌ చేస్తున్నాడు. మా ఆయన సీఏగా విధులు నిర్వర్తిస్తున్నారు.

అలీ: డ్యాన్స్‌ రాదంటున్నారు.. ‘సాగర సంగమం’లో కమల్‌హాసన్‌ పక్కన డ్యాన్స్‌ ఎలా చేశారు..?

గీత: ఆ సినిమాలో నేనెక్కడ డ్యాన్స్‌ చేశాను. ఆయనే కదా డ్యాన్స్‌ చేసింది. నేను కేవలం అటు ఇటు పరిగెత్తేదాన్ని. అలా పరిగెత్తడానికి కూడా రిహార్సల్స్‌ చేసేదాన్ని (నవ్వులు).

ఎన్ని భాషల్లో నటించారు..?

గీత: మొదటి సినిమా తమిళంలో ‘భైరవి’. రెండో సినిమా తెలుగులో చేశాను. కృష్ణంరాజు నటించిన ‘మనవూరి పాండవులు’. ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చా. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మాట్లాడతాను. అన్ని భాషల్లో కలిపి 250 సినిమాలు చేసి ఉంటా.

మీది పెద్దలు కుదిర్చిన వివాహమా? లేదా ప్రేమ పెళ్లి చేసుకున్నారా?

గీత: పెద్దలు కుదిర్చిన వివాహమే. ‘గుప్పెడు మనసు’ సీరియల్‌ చేస్తున్నప్పుడు హిందూ పత్రికకు చెందిన ఒకావిడ (నా భర్త వాళ్ల మేనత్త) నాకు తరచూ ఫోన్‌ చేసి మాట్లాడుతుండేవారు. ఓసారి ఆమె మా అమ్మతో మాట్లాడారు. ‘మీ అమ్మాయికి ఇంకా ఎందుకు పెళ్లి చేయలేదు’ అని అడిగారు. దానికి మా అమ్మ మంచి అబ్బాయి దొరికితే చేస్తామని బదులిచ్చింది. దాంతో ఆ మహిళ.. మా కుటుంబంలో ఓ అబ్బాయి ఉన్నాడని చెప్పింది. అలా సంబంధం కలిసింది. మా ఆయన నా సినిమాలు ఒక్కటీ చూడలేదు. మా నాన్నగారిది నెల్లూరు. మా అత్త వాళ్లది చెన్నై.

కన్నడ పరిశ్రమలో మీకు ముద్దు పేరు ఉందట.. నిజమేనా?

గీత: అక్కడికి నటిగా వెళ్లాను. అక్కడ నటించిన అన్ని సినిమాల్లో దాదాపు ఏడుపు పాత్రలే చేశాను.  అందుకే ఏడుపు గీత అని పిలుస్తారు.

తెలుగులో మీకు ‘మనవూరి పాండవులు’ తొలి సినిమా కదా..?

గీత: కృష్ణంరాజు, జయకృష్ణ వల్లే ఆ సినిమా వచ్చింది. నేను నటిగా తెలుగు తెరకు పరిచయం కావడానికి కృష్ణంరాజు ముఖ్య కారణం. ఆయన లేరంటే చాలా బాధగా ఉంది (కన్నీటి పర్యంతమయ్యారు).

ఇప్పటికీ చిరంజీవితో సినిమా చేయాలని ఉందని మీరు అందరితో చెబుతారట కదా..?

గీత: ఆయన నా అభిమాన హీరో. ఆయనతో ఒక్కసారైనా నటించాలని ఉంది. ఆయన కళ్లంటే నాకెంతో ఇష్టం. ఆయన డ్యాన్స్‌ బాగా చేస్తారు.

నాలుగో తరగతిలో ఏదో జరిగిందని మీ నాన్నగారు బడితపూజ చేశారట ఎందుకు..?

గీత: రోజూ 3.30 గంటలకు ఇంటికి వెళ్లేదాన్ని. కానీ ఓ రోజు సాయంత్రం ఆరున్నర అయినా ఇంటికి వెళ్లలేదు. జారుడు బండ ఆడుకుంటూ ఉండిపోయా. నేను ఎక్కడికి వెళ్లిపోయానో తెలియక ఇంట్లో వాళ్లందరూ కంగారుపడ్డారు. ఇంటికి వెళ్లగానే.. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు? అని నాన్న అడిగితే..  జారుడు బండ ఆడుకుంటూ ఆలస్యమైందని చెప్పా. బెల్ట్‌తో కొట్టారు. అప్పటి నుంచి అమ్మనాన్నలతో చెప్పకుండా ఏ పనిచేయలేదు. 8వ తరగతి వరకే చదువుకున్నా.

‘బాలచంద్రుడు’ సినిమాలో మహేశ్‌తో నటించారు కదా..?

గీత: అవును. అందులో కృష్ణుడు పాత్ర మహేశ్‌ చేశాడు. మహేశ్‌తో పాటు వాళ్ల అమ్మమ్మ వచ్చేది. వీడు పెద్ద హీరో అవుతాడని అప్పట్లో ఆమె అంటుండేది. ఇప్పుడు ఆయన సూపర్‌స్టార్‌ అయ్యారు కదా..!

మీరు నవ్వడం వల్ల ఇమిగ్రేషన్‌ అధికారి బాగా హర్ట్‌ అయ్యారట పాపం..!

గీత: నిజమేనండి. ఓసారి మలయాళం నటులతో కలిసి దుబాయ్‌లో మ్యూజికల్‌ నైట్‌కు వెళ్లా. ఎయిర్‌పోర్ట్‌లోనే మేమంతా కలిసి స్కిట్‌ ప్రాక్టీస్‌ చేశాం. అందులో నాది చాలా ఫన్నీ రోల్‌. స్కిట్‌లో భాగంగా జోక్స్ వేసుకుని నవ్వుకుంటుంటే.. నేను ఆయన్నే చూసి నవ్వుతున్నానని ఓ ఇమిగ్రేషన్‌ అధికారి అనుకున్నారు. నా ముందు ఉన్న వారందరికీ ఇమ్మిగ్రేషన్‌ స్టాంపు వేశారు.. నాకు మాత్రం అస్సలు అనుమతి ఇవ్వలేదు. భారత అధికారులు మాట్లాడిన తర్వాత పంపించారు. ఇకపై ఎయిర్‌పోర్ట్‌లో నవ్వకూడదని అప్పుడు ఫిక్స్‌ అయిపోయా.

అమెరికా ఎందుకు వెళ్లారు..?

గీత: పెళ్లయ్యింది కదా.. అందుకే వెళ్లా. అప్పట్లో చాలా బిజీగా ఉన్నా. బాబు పుట్టిన మూడేళ్లకు ఇండియా వచ్చా. కన్నడ, మలయాళంలో సినిమాలు చేశా.

మలయాళం నేర్చుకోవడానికి ఎంత కాలం పట్టింది..? అక్కడివాళ్ల పిలుపునకు హర్ట్‌ అయ్యారట ఎందుకు..?

గీత: మలయాళం భాష రాదని సినిమా ఓకే చేయలేకపోయా. నా డేట్స్‌ కోసం వాళ్లు చాలారోజులు తిరిగారు. చివరికి ఒప్పుకొన్నా. ట్యూటర్‌ని పెట్టి నెలరోజులు భాష నేర్పారు. తెలుగులో ఎక్కడికి వెళ్లినా గౌరవంగా పిలుస్తారు. మలయాళంలో కాస్త ఇబ్బంది పడ్డా. ఏయ్‌.. హుషు.. అని పిలుస్తుండేవారు. అది అక్కడివాళ్లకు అలవాటు. మొదట నాకు ఏమీ అర్థం కాలేదు. వాళ్లకు మర్యాదగా పిలవడం రాదనుకున్నాను.

ద్రోహి షూటింగ్‌లో పీసీశ్రీరామ్‌తో గుర్తుంచుకొనే సందర్భం ఉందట ఏంటది..?

గీత: రాజ్‌ కమల్‌ బ్యానర్‌లో సినిమా అది. అర్జున్‌తో నటించాలి. కమల్‌ వచ్చి డైలాగ్‌ చెప్పి సింపుల్‌గా ఉండాలని చెప్పారు. రిహార్సల్స్‌ లేదన్నారు. కానీ పీసీశ్రీరామ్‌ ఒకసారి రిహార్సల్‌ చేయాలన్నారు. కమల్‌ అవసరం లేదన్నారు. నటించిన తర్వాత కమల్‌ చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. సారిక కూడా మెచ్చుకున్నారు.

‘పట్నం వచ్చిన పతివ్రతలు’లో ఒకరికి గుణపాఠం చెప్పాలనుకున్నారట ఎవరికి..?

గీత: ఏలూరులో షూటింగ్‌. రాధిక చాలా అల్లరి అమ్మాయి. షూటింగ్‌ సమయంలో ప్రొడక్షన్‌ మేనేజర్‌  ఇబ్బందిపెట్టేవాడు. అతడిని ఓ ఆట ఆడుకోవాలని రాధిక.. ఓసారి విరేచనాలయ్యే బబుల్‌గమ్‌ తెచ్చి ఇచ్చింది. రెండు, మూడుసార్లు బాత్‌రూమ్‌కు పరిగెత్తాడు. ఇక నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి ఇంటికి వెళ్తానని వెళ్లిపోయాడు.

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణలతో సినిమాలు చేశారా?

గీత: ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో చాలా సినిమాలు చేశా.

ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చారు..? జాతీయ అవార్డు తృటిలో తప్పిపోయిందట..?

గీత: 1977లో వచ్చా. నాకు జాతీయ అవార్డు రాకుండా మిస్‌ చేశారనే అందరూ చెప్పుకొంటారు. ఎందుకంటే మలయాళంలో నేను నటించిన ‘పంచాగ్ని’ అద్భుతమైన చిత్రం. అందులో నేను నక్సలైట్‌ పాత్ర పోషించా. ఏడాది పాటు ఈ సినిమా థియేటర్లలో ఆడింది. దీనిని చూసిన వారు.. ‘సూపర్‌ మూవీ. ఈ ఏడాది మీకే తప్పకుండా జాతీయ అవార్డు వస్తుంది’ అని చెప్పారు. జాతీయ అవార్డుల జ్యురీలో నాకు తెలిసిన వాళ్లు కూడా ఉన్నారు. ఓసారి వాళ్లు నన్ను కలిసి.. ‘మీ సినిమా నామినేషన్‌కు వెళ్లింది. అందరికీ నచ్చింది. మీకు ఇవ్వాలనుకున్నాం. కాకపోతే అంతర్గతంగా ఉన్న కొంతమంది మాత్రం అంగీకరించలేదు’ అని చెప్పారు. ఎందుకు? అని అడగ్గా.. ‘మీరు మలయాళీ, కన్నడ నటి కాదని పక్కన పెట్టేశారు’ అని చెప్పారు.

ఒక సినిమాలో మిమ్మల్ని హీరోయిన్‌ అనుకున్న తర్వాత పక్కన పెట్టేశారట..?

గీత: ఆ సినిమా పేరు నాకు గుర్తు లేదు. అప్పట్లో నేను మలయాళంలో ఎంతో బిజీగా ఉండేదాన్ని. ఒక ఏడాదిలో 18 సినిమాలు చేశా. అలాంటి సమయంలో తెలుగులో ఓ ఆఫర్‌ వచ్చింది. ఓకే చేశా. డేట్స్‌ కూడా ఇచ్చా. ఏమైందో ఏమో ఆ పాత్రకు నేను సరిపోనని వాళ్లే అనేసుకుని నాకు ఒక్కమాట కూడా చెప్పకుండా నన్ను తొలగించేశారు.

పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదని అనుకున్నారా?

గీత: అలా ఏం లేదు. కొంత విరామం తీసుకున్నా. నా భర్త ఎప్పుడూ నాకు సపోర్ట్‌ చేస్తుండేవారు. ఇష్టమైతే సినిమాల్లో చెయ్‌. ఆసక్తి లేకపోతే వదిలేయ్‌ అని చెబుతుండేవారు. ప్రస్తుతం మా కుటుంబం మొత్తం చెన్నైలోనే ఉంటుంది.

మీ సినిమాలు చూసి మీ అమ్మగారే విమర్శించేవారట కదా?

గీత: అవునండి. సినిమాలో నీ పాత్ర బాగుందా? సెట్‌లో బాగానే చూసుకుంటున్నారా? ఈ రెండు ప్రశ్నలనే మా అమ్మ ఎక్కువగా అడుగుతుండేవారు. నేను నటించిన సినిమా ప్రివ్యూలకు అమ్మ వస్తుండేవారు. ప్రివ్యూ చూసిన వెంటనే తన స్పందన చెప్పేసేది. ‘ఈ సీన్‌లో నువ్వు బాగా నటించలేదు. ఇక్కడ చీర సరిగ్గా కట్టుకోలేదు. ఈ సీన్‌లో కళ్లు పక్కకు తిప్పావు’ అంటూ ఏదో ఒక వంక పెడుతుండేది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts