F3: ఓటీటీలోకి ‘ఎఫ్‌ 3’.. స్ట్రీమింగ్‌ అప్పటి నుంచేనా?

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్‌ రావిపూడి సృష్టించిన నవ్వుల సునామీ ‘ఎఫ్‌ 3’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అప్పుడే కాదులేండీ.. ఇంకా సమయం ఉంది.

Updated : 07 Dec 2022 18:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెంకటేశ్‌ (Venkatesh), వరుణ్‌ తేజ్‌ (Varun Tej), తమన్నా, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్‌ రావిపూడి సృష్టించిన నవ్వుల సునామీ ‘ఎఫ్‌ 3’ (F3) ఓటీటీలోకి వచ్చేస్తోంది. అప్పుడే కాదులేండీ.. ఇంకా సమయం ఉంది. థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే మా సినిమా ఓటీటీలోకి వస్తుందని స్పష్టం చేస్తూ చిత్ర బృందం జూన్‌లో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం మేరకే ఈ చిత్రాన్ని జులై 22 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం ‘సోనీలివ్‌’లో స్ట్రీమింగ్‌కానున్నట్టు సమాచారం. మే 27న థియేటర్లలో విడుదలైన ఈ ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి, మంచి వసూళ్లు రాబట్టింది.

క‌థేంటంటే: వెంకీ (వెంక‌టేష్‌)కి ఇంటి నిండా స‌మ‌స్య‌లే. స‌వ‌తి త‌ల్లి పోరు ఒక‌ ప‌క్క‌.. స‌మ‌స్య‌లు మ‌రో ప‌క్క.. వాటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు అడ్డ‌దారుల్లో సంపాద‌న‌పై దృష్టిపెడ‌తాడు. వ‌రుణ్ (వ‌రుణ్‌తేజ్‌) ఖ‌రీదైన క‌ల‌లు క‌నే యువ‌కుడు. కానీ చేతిలో మాత్రం చిల్లిగ‌వ్వ ఉండ‌దు. అత‌ను ఎలాగైనా ధ‌న‌వంతులైన కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమ‌లో ప‌డేసి ఆమెని అడ్డం పెట్టుకుని డ‌బ్బు సంపాదించాల‌నుకుంటాడు. హ‌నీ (మెహ్రీన్‌) కూడా త‌న కుటుంబం స‌మ‌స్య‌ల నుంచి గట్టెక్కాలంటే ధ‌నికుడైన అబ్బాయిని పెళ్లి చేసుకోవ‌డ‌మే మార్గం అనుకుంటుంది. అలా వ‌రుణ్‌, హ‌నీ ధ‌న‌వంతుల పిల్ల‌లుగా న‌టిస్తూ ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌వుతారు. వ‌రుణ్ డ‌బ్బున్న‌వాడిగా క‌నిపించేందుకని వెంకీ త‌న ఇల్లు తాక‌ట్టు పెట్టి మ‌రీ పెట్టుబ‌డి పెడ‌తాడు. కానీ, వాళ్లంద‌రి అస‌లు రంగు తొంద‌రలోనే బ‌య‌ట ప‌డుతుంది. ఒక‌రినొక‌రు మోసం చేసుకున్నామ‌ని అర్థ‌మ‌వుతుంది. స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌క‌పోగా అంద‌రూ మ‌రింత అప్పుల్లో కూరుకుపోతారు. ఇక ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్యం అనుకుంటున్న ద‌శ‌లో.. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అయిన ఆనంద్ ప్ర‌సాద్ (ముర‌ళీశ‌ర్మ‌) గురించి తెలుస్తుంది. చిన్న‌ప్పుడే త‌న నుంచి దూర‌మైన వార‌సుడి కోసం వెతుకుతున్న ఆయ‌న ఇంటికి వ‌రుస క‌డుతుంది వెంకీ, వ‌రుణ్ బ్యాచ్‌. మీ వార‌సుడిని నేనంటే నేనంటూ పోటీ ప‌డతారు. మ‌రి ఆనంద్‌ప్ర‌సాద్ త‌న వార‌సుడిగా ఎవ‌రిని స్వీక‌రించారు.. వీళ్లంద‌రూ డ‌బ్బు స‌మ‌స్య‌ల నుంచి ఎలా గ‌ట్టెక్కారనేదే మిగిలిన కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని