Virataparvam: ‘విరాటపర్వం’ క్లైమాక్స్‌లో ఈ మార్పులు చేసి ఉంటే.. పరుచూరి ఏమన్నారంటే..?

సాయిపల్లవి(Sai Pallavi) ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌తో సినీ ప్రియుల హృదయాలను హత్తుకున్న ప్రేమకథా చిత్రం ‘విరాటపర్వం’ (Virataparavam). వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా కీలకపాత్ర పోషించారు....

Updated : 30 Jul 2022 13:31 IST

హైదరాబాద్‌: సాయిపల్లవి(Sai Pallavi) ఆల్‌రౌండ్‌ టాలెంట్‌తో సినీ ప్రియులను అలరించిన ప్రేమకథా చిత్రం ‘విరాటపర్వం’ (Virataparavam). వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా కీలకపాత్ర పోషించారు. తెలంగాణలో 1990 దశకంలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. జూన్‌ నెలలో విడుదలైన ఈ సినిమా.. కథ, కథనం బాగునప్పటికీ అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోలేకపోయిందని సినీ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna).. ‘విరాటపర్వం’పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. క్లైమాక్స్‌లో మార్పులు చేసి ఉంటే సినిమా వేరేలా ఉండేదని ఆయన అన్నారు.

‘‘నిజం చెప్పాలంటే.. ఇందులో రానా దగ్గుబాటి పేరు వాడారు.. కానీ, ఇది సాయిపల్లవి మోనో యాక్షన్‌ చిత్రం. సినిమా ఆద్యంతం మన చూపు ఆమెపైనే ఉంటుంది. 400 సినిమాలు రాసిన నేను ‘విరాటపర్వం’ చూస్తున్నంతసేపు ఆమెనే చూస్తూ ఉండిపోయాను. అన్నిరకాల భావోద్వేగాలను ఆమె అద్భుతంగా పలకించింది. ఈ సినిమాకు ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వరిస్తుందేమో అనిపించింది’’

‘‘వేణు ఉడుగుల మూడేళ్లు రీసెర్చ్‌ చేసి మరీ దీన్ని రూపొందించారు. ఇది అనుకున్నంతగా విజయం సాధించకపోవడానికి ఓ కారణం.. సమయం కానీ సమయంలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం. ఎందుకంటే, ప్రజలందరూ కమర్షియల్‌ చిత్రాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఈ విధమైన విప్లవ భావాలున్న సినిమా రూపొందించడమంటే ధైర్యం చేశారనే చెప్పాలి. ఈ సినిమా విషయంలో రానాని అభినందించాలి. ఇది రిస్కీ ప్రాజెక్ట్ అని తెలిసి కూడా.. నిర్మాణంలో భాగమయ్యారు. అలాగే, కేవలం ఒక నటి కోసం.. తన పాత్రకు అంతగా ప్రాధాన్యం లేనప్పటికీ ఇందులో నటించారు. ఇక, నటీనటుల్ని ఎంచుకున్న విధానం, సాయిపల్లవి పాత్ర చిత్రీకరణ, కథా, కథనం నడిపిన తీరు.. ఇలా ప్రతిదీ అద్భుతంగా ఉన్నాయి’’

‘‘ఈ సినిమా ముగింపు చాలా హృదయ విదారకంగా ఉంది. వాస్తవ కథను చూపించాలనే ఉద్దేశంతో నిర్మాత, దర్శకుడు ఈ విధంగా దీన్ని రూపొందించారు. అందుకు, వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. కానీ, వాళ్లే కనుక సినిమాటిక్ అడ్వాంటేజ్‌ తీసుకున్నట్లయితే.. ఫలితం మరోలా ఉండేదని నా అభిప్రాయం. సినిమాలో చూపించిన విధంగా కాకుండా రవన్న-వెన్నెలకు పెళ్లి చేసి.. నక్సలైట్స్‌ రూల్స్‌ ప్రకారం పెళ్లైన వెంటనే వాళ్లిద్దర్నీ కొన్ని నెలల పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి.. ఇబ్బందులు ఎదుర్కొని చివరికి కలిసినట్లు చూపిస్తే ఫలితం మరోలా ఉండేదని నా ఉద్దేశం’’ అని పరుచూరి వివరించారు.



Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts