K Vasu: ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కె.వాసు ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు

Updated : 26 May 2023 20:38 IST

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటుడు శరత్‌బాబు మరణవార్తను మరవక ముందే ప్రముఖ దర్శకుడు కె.వాసు (K Vasu) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

సీనియర్‌ దర్శకుడు కె.ప్రత్యగాత్మ కుమారుడే కె.వాసు. ఆయన బాబాయి హేమాంబరధరరావు దర్శకులే.  కృష్ణాజిల్లా ముదునూరుకు చెందిన ఆయన తండ్రి బాటలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి, ప్రేక్షకులను అలరించేలా పలు చిత్రాలు తెరకెక్కించారు. కె.వాసు దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘ఆడపిల్లల తండ్రి’. కృష్ణంరాజు హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ‘ప్రాణం ఖరీదు’తో ఈయనే చిరంజీవిని నటుడిగా పరిచయం చేశారు. ‘కోతల రాయుడు’, ‘సరదా రాముడు’, ‘పక్కింటి అమ్మాయి’, ‘కలహాల కాపురం’, ‘అల్లుళ్ళొస్తున్నారు’, ‘కొత్త దంపతులు’, ‘ఆడపిల్ల’, ‘పుట్టినిల్లా మెట్టినిల్లా’ వంటి చిత్రాలు వాసుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. వాసు దర్శకత్వం వహించిన ‘అయ్యప్పస్వామి మహత్యం’, ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్స్‌ అందుకున్నాయి. ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ పాటలు అప్పటికి, ఇప్పటికీ అజరామరం. 2008లో విడుదలైన ‘గజిబిజి’ సినిమా తర్వాత వాసు దర్శకత్వానికి దూరమయ్యారు.

కె.వాసు మృతి పట్ల పవన్‌ కల్యాణ్‌ సంతాపం

దర్శకులు కె.వాసు మృతి పట్ల జనసేన అధినేత, సినీ నటులు పవన్‌ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘దర్శకులు కె.వాసు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్నయ్య చిరంజీవి  ముఖ్యపాత్రలో నటించిన ప్రాణం ఖరీదు సినిమా దర్శకులుగా వాసు గారిని మరిచిపోలేం. చిరంజీవి తొలిసారి వెండితెరపై  కనిపించింది ఆ సినిమాతోనే. వినోదాత్మక కథలే కాకుండా భావోద్వేగ అంశాలను తెరకెక్కించారు. కె.వాసు సినిమాల్లో శ్రీషిర్డీ సాయిబాబా మహత్యం ప్రత్యేకమైంది. తెలుగు నాట షిర్డీ సాయిబాబా చరిత్ర ప్రాచుర్యం పొందటంలో ఆ సినిమా ఓ ముఖ్య కారణమైంది. వాసుగారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని పవన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని