Raghavendra Rao: కొంచెం తీపి.. కొంచెం కారం.. నా సినీ ప్రేమలేఖ

రాఘవేంద్రరావు.. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయనది ఓ  సువర్ణాధ్యాయం. తెలుగు సినిమాకి సరికొత్త కమర్షియల్‌ లెక్కలు నేర్పించి.. కోట్ల వసూళ్లు కురిపించిన దర్శకుడాయన. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల మొదలు.. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ల వరకు..

Updated : 23 May 2022 07:01 IST

రాఘవేంద్రరావు.. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయనది ఓ  సువర్ణాధ్యాయం. తెలుగు సినిమాకి సరికొత్త కమర్షియల్‌ లెక్కలు నేర్పించి.. కోట్ల వసూళ్లు కురిపించిన దర్శకుడాయన. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల మొదలు.. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ల వరకు.. అందరితోనూ హిట్లు కొట్టి, సినీప్రియులతో శభాష్‌ అనిపించుకున్న దర్శకేంద్రుడాయన. ఇన్నాళ్లు కెమెరా వెనకుండి వెండితెరపై మ్యాజిక్‌ చేసిన రాఘవేంద్రరావు.. ఇప్పుడు పుస్తక రచయితగా కలం కదిలించారు. ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ అంటూ తన సినీ ప్రయాణాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ఆ పుస్తకం ఇటీవలే భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వెంకటరమణ అభినందనలతో, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సోమవారం రాఘవేంద్రరావు 80వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ పుస్తకానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ‘‘ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు నామీద చూపించే అభిమానానికి కృతజ్ఞుడిని. దాదాపు 45 ఏళ్ల పాటు మీడియాలో, మైక్‌ ముందు మాట్లాడని నేను... ఈటీవీలో ప్రసారమైన ‘సౌందర్యలహరి’ కార్యక్రమంలో మనసు విప్పాను. తర్వాత ‘కేఆర్‌ఆర్‌ క్లాస్‌ రూమ్‌’ పేరుతో 40కిపైగా వీడియోలు చేసి యూట్యూబ్‌లో ఉంచాను. ఈ పుట్టిన రోజు నాకెంతో   ప్రత్యేకమైనది. నా జీవితంలో మొదటిసారి ఒక పుస్తకం రాశాను. దర్శకుడిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ క్రమంలో నేను నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు, అనుభూతుల్ని నా తర్వాతి తరాలకు ఉపయోగపడేలా ఈ పుస్తకం తీర్చిదిద్దాను. ఈ పుస్తకావిష్కరణ సభ ఈటీవీ ఆధ్వర్యంలో జరగడం ముదావహం. ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమలోని ఈతరం దర్శకులంతా ఒకే వేదికపైకి రావడం, నా నిర్మాతలు, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఈ వేడుక   జరగడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ‘అబద్ధాలు రాయడం అనర్థం. నిజాలు   రాయటానికి భయం..’ అంటూ దీన్ని మనసు పెన్‌తో రాశాను. ఈ పుస్తకాన్ని చాలా ఓపెన్‌గా రాశాను. ఏదీ కప్పి చెప్పలేదు. అలాగే విప్పి చెప్పలేదు. కొంచెం తీపి.. కొంచెం కారం. ఈ పుస్తకం త్వరలో నవోదయ ద్వారా మార్కెట్లోకి వస్తుంది. పాఠకులందరూ దీన్ని చదివి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు రాఘవేంద్రరావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని