Srinivasa Murthy: ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్టు శ్రీనివాసమూర్తి కన్నుమూత

పలువురు తమిళ హీరోలకు తెలుగులో గాత్రదానం చేసి ఆ పాత్రలకు ప్రాణం పోసిన డబ్బింగ్‌ ఆర్టిస్టు శ్రీనివాసమూర్తి (Srinivasa Murthy) (50) శుక్రవారం ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు.

Updated : 28 Jan 2023 07:15 IST

లువురు తమిళ హీరోలకు తెలుగులో గాత్రదానం చేసి ఆ పాత్రలకు ప్రాణం పోసిన డబ్బింగ్‌ ఆర్టిస్టు శ్రీనివాసమూర్తి (Srinivasa Murthy) (50)  శుక్రవారం ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. విజయనగరం నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడిన శ్రీనివాసమూర్తి ఆరంభంలో గాయకుడు కావాలని ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత 1993లో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ మొదలుపెట్టారు. కాంచన్‌బాబు తెరకెక్కించిన ‘పక్కపేజీ’ చిత్రానికి తొలిసారి డబ్బింగ్‌ చెప్పారు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలోని ‘దొంగ దొంగ’ చిత్రానికి ప్రశాంత్‌కు డబ్బింగ్‌ చెప్పారు. అప్పటి నుంచే కథానాయకులకు గాత్రం ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ‘ప్రేమికుడు’, ‘ప్రేమదేశం’, ‘ప్రేమలేఖ’ ఇలా చాలా సినిమాలకు గాత్రం ఇచ్చారు. అంతేకాకుండా నటుడిగా సాయికుమార్‌ బిజీ కావడంతో ఓ దశలో రాజశేఖర్‌కు కూడా డబ్బింగ్‌ చెప్పారు. ‘మా ఆయన బంగారం’ లాంటి పలు సినిమాలకు గాత్రం అందించారు. అజిత్‌కు ‘ప్రేమలేఖ’ చిత్రం నుంచి అన్ని సినిమాలకు చెప్పారు. ‘గజిని’ చిత్రంతో సూర్యతో ఆయన ప్రయాణం మొదలైంది. ‘సింగం’తో పాటు ఆయన నటించిన అన్ని చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పారు. అలాగే విక్రమ్‌ చిత్రాలకు కూడా గాత్రం అందించారు. ‘అపరిచితుడు’లో రెమో పాత్రకు విక్రమ్‌ డబ్బింగ్‌ చెప్పినప్పటికీ.. ఆయనకే నచ్చకపోవడంతో శ్రీనివాసమూర్తిని పిలిపించి డబ్బింగ్‌ చెప్పించడం విశేషం. అలాగే ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానరుపై వచ్చిన ‘పాడుతా తీయగా’లో వినీత్‌కు, ‘డాడి డాడి’లో హరీష్‌కు డబ్బింగ్‌ చెప్పారు. తమిళంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో బాలకృష్ణ పాత్రకు గాత్రం అందించారు. శ్రీనివాసమూర్తి మృతిపట్ల డబ్బింగ్‌ సంఘాలు,  సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘శ్రీనివాసమూర్తి మరణం వ్యక్తిగతంగా తీరనిలోటు. నా నటనకు ఆయన తన మాటలతో ప్రాణం పోశారు. మిమ్మల్ని కోల్పోవడం బాధాకరంగా ఉంది’ అని ట్విట్‌ చేశారు సూర్య. శ్రీనివాసమూర్తికి కుమార్తె అపర్ణ, కుమారుడు నవీన్‌శర్మ ఉన్నారు. కుమార్తె డెంటిస్టు. కుమారుడిని హీరో చేయాలని ఆశ పడేవారు. శ్రీనివాసమూర్తి అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి.

న్యూస్‌టుడే, కోడంబాక్కం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని