Updated : 07 Jul 2022 08:31 IST

Gowtham raju: కూర్పు కళలో రారాజు

ఎడిటర్‌ గౌతంరాజు ఇకలేరు

ఎడిటింగ్‌.. గౌతంరాజు... రూపు తెరపై కనిపించకున్నా.. ఆ పేరెప్పుడూ సినీప్రియులకు సుపరిచితమే. కూర్పు కళలో స్టార్‌. తెరపై కనిపించని హీరో. ఎడిటింగ్‌ అంటే కత్తెరతో ఫ్రేమ్స్‌ కట్‌ చేయడమే కాదని.. ఏది కట్‌ చేయాలో.. ఏది కంటిన్యూ చేయాలో.. ఆర్డర్‌ మార్పులతో ఓ కథని ఎంత కొత్తగా, అందంగా చెప్పొచ్చో.. సూటిగా సుత్తి లేకుండా ప్రేక్షకుల్ని ఎలా రంజింపచేయొచ్చో.. విజయవంతంగా చేసి చూపిన కళా మాంత్రికుడాయన. ఎడిటింగ్‌ టేబుల్‌పైనే చిత్ర ఫలితాల్ని చెక్కగలిగిన.. చెప్పగలిగిన మేధావి. అందుకే స్టార్‌ హీరోల తొలి ఛాయిస్‌ ఎప్పుడూ ఆయనే. ఇప్పుడా కూర్పు కళా శిల్పి  చిత్రసీమను, కళాభిమానుల్ని విషాదంలోకి నెట్టేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతంరాజు(68) (Gowtham Raju) కన్నుమూశారు.  కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన తన మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో 850పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసి.. చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు. అగ్ర హీరో.. కుర్ర హీరో అని తేడాల్లేకుండా పరిశ్రమలోనే అందరి చిత్రాలకు పని చేశారు. ఎన్నో బ్లాక్‌బస్టర్లలో కీలక భాగస్వామి అయ్యారు. గౌతంరాజుకు భార్య రత్నమాణిక్యం, ఇద్దరమ్మాయిలు ఉన్నారు. ఆయన అంత్యక్రియల్ని పెద్దల్లుడు రామకృష్ణ బుధవారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. దీనికి నటుడు మోహన్‌బాబు(Mohanbabu), దర్శకుడు వి.వి.వినాయక్‌(VV Vinayak) తదితరులు హాజరై నివాళులర్పించారు.

సినిమా ఆపరేటర్‌గా మొదలై..
తెల్లచొక్కా.. జులపాల జుట్టుతో చిరునవ్వులు చిందిస్తూ మౌన మునిలా కనిపించే గౌతంరాజు.. 1954 జనవరి 15న ఒంగోలులోని ఓ సామాన్య కుటుంబంలో పతి రంగయ్య, కోదనాయకి దంపతులకు జన్మించారు. ఆర్థిక సమస్యల వల్ల బి.ఎ.తో చదువు ఆపేసిన ఆయన.. ఆ తర్వాత ఓ వ్యక్తి సలహాతో అరుణాచలం స్టూడియోలోని రికార్డింగ్‌ థియేటర్‌లో ఆపరేటర్‌గా అప్రెంటిస్‌గా చేరారు. ఇక్కడే ఆయనకి సినిమాతో పరిచయం పెరిగింది. ఏడాది తర్వాత తమిళ నటుడు రాజేంద్రకు చెందిన ‘రాజేంద్ర టూరింగ్‌ టాకీస్‌’లో ఆపరేటర్‌గా చేరి లైసెన్స్‌ పొందారు. ఇదే సమయంలో ఎడిటర్‌ దండపాణి ప్రోత్సాహంతో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా చేరి.. సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు గౌతంరాజు. ఇదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.

తొలి అడుగు తమిళ చిత్రసీమలోనే..
అసిస్టెంట్‌ ఎడిటర్‌గానే ఏడాదిలో 30కి పైగా   చిత్రాలకు పని చేసి, ప్రతిభ చూపిన గౌతంరాజు.. ‘అవల్‌ ఓరు పచ్చికొళందై’ (Aval Oru Pachai Kulanthai) చిత్రంతో తొలిసారి పూర్తిస్థాయి ఎడిటర్‌గా మారారు. తమిళ స్టార్‌ విజయ్‌ (Vijay) తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఆయనే తెలుగులో చిరంజీవితో ‘సట్టం ఒరు ఇరుత్తరై’(
Sattam Oru Iruttarai) అనే తమిళ చిత్రాన్ని ‘చట్టానికి కళ్లులేవు’ (Chattaniki Kallu Levu) పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమాతోనే తెలుగు తెరకూ ఎడిటర్‌గా పరిచయమయ్యారు. ఇక అక్కడి నుంచి తెలుగులోనే వరుస అవకాశాలు అందుకుంటూ.. మంచి ఎడిటర్‌గా గుర్తింపు పొందారు. చిరంజీవి, బాలకృష్ణ,  నాగార్జున, వెంకటేష్‌ వంటి అగ్ర హీరోల నుంచి ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ వంటి ఈతరం స్టార్ల వరకు అందరి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి మెప్పించారు. ఇటీవల కాలంలో ‘రేసుగుర్రం’, ‘గోపాల గోపాల’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’, ‘అల్లుడు శీను’, ‘అదుర్స్‌’, ‘కిక్‌’, ‘ఖైదీ నంబర్‌ 150’, ‘పవర్‌’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’, ‘సన్నాఫ్‌ ఇండియా’ వంటి చిత్రాలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ‘శాసన సభ’ (Shasana Sabha) అనే చిత్రానికి పనిచేస్తున్నా.. అదింకా పూర్తి కాలేదని తెలిసింది.

అందుకే ఆయన ప్రత్యేకం..
‘‘ప్రసవం చేసే  గైనకాలజిస్ట్‌ తల్లి అరుపులను, రక్తస్రావాన్ని చీదరించుకుంటే ఎంత తప్పో.. ఎడిటర్‌ అనే వాడు ఎడిట్‌ చేసే సినిమాని చెత్తగానో, బోర్‌గానో ఫీలవడం అంతే తప్పు.
అది వృత్తి ద్రోహం.. దైవ దూషణతో సమానం’ అనేవారు గౌతంరాజు. కళ పట్ల, వృత్తి పట్ల ఆయనకున్న గౌరవం, నిబద్ధతకు ఈ మాటలే నిదర్శనం. ప్రతి చిత్ర విషయంలోనూ ఆయన ఈ మాటల్నే అనుసరించి పనిచేసేవారు. ఎడిటింగ్‌లో తెలుగు సినిమాకి ఎన్నో కొత్త పాఠాలు నేర్పించారాయన. ఆర్డర్‌ మార్పులతో రొటీన్‌ కథకు కొత్తదనం ఎలా అద్దొచ్చో.. సీన్లలో చిన్నపాటి మార్పులతో సినిమా వేగం ఎలా పెంచొచ్చో.. చేసి చూపించారాయన. కాలంతో పాటు మారిన సాంకేతిక మార్పుల్ని అందిపుచ్చుకుంటూనే.. ఎడిటింగ్‌కు తనదైన టెక్నిక్‌ జత చేసి కొత్త సొబగులు అద్దారు. అందుకే ఆయనతో పనిచేయడం కోసం స్టార్‌ హీరోలు, దర్శక  నిర్మాతలు ఎంతో ఉత్సాహం చూపేవారు. ప్రస్తుతం చిత్రసీమలో మెరుపులు మెరిపిస్తున్న చాలా మంది ఎడిటర్లకు ఆయనే గురువు. గౌతంరాజు... తన ఆయుష్షును ఇంకాస్త కూర్పు చేసుకొని మరికొంత కాలం ఈ రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు మార్గదర్శిగా నిలిస్తే బాగుండేదని పరిశ్రమ కన్నీరు పెడుతోంది.

ఆరు నంది అవార్డులు..
గౌతంరాజు ఎడిటర్‌గా తెలుగులో ఏకంగా ఆరు నంది అవార్డులు అందుకున్నారు. 1984లో ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (Srivariki Premalekha) చిత్రానికి గానూ తొలిసారి నంది అవార్డు అందుకున్న ఆయన.. తర్వాత ‘మయూరి’ (Mayuri), ‘హై హై నాయకా’ (Hai Hai Nayaka), ‘చందమామరావే’ (Chandamama Raave), ‘భారతనారి’ (Bharatha Nari), ‘ఆది’ (Aadi) సినిమాలకు అవార్డులు దక్కించుకున్నారు. 89లో ‘కృష్ణా నీకొనిదాగ’ అనే కన్నడ చిత్రానికి బెస్ట్‌ ఎడిటర్‌గా కర్ణాటక స్టేట్‌ అవార్డు అందుకున్నారు. ‘రణం’ (Ranam) చిత్రానికి గానూ భరతముని పురస్కారం దక్కింది.
లోపలికి  రానివ్వొద్దన్న గురువు
తన జీవితంలో ఒకే ఒక్కసారి తీవ్రంగా బాధపడ్డానన్నారు ఎడిటర్‌ గౌతంరాజు. ఆ సంఘటనని ఓ సందర్భంలో పంచుకున్నారాయన. ‘‘నా తొలి గురువు దండపాణి.. మలి గురువు సంజీవి. ఇక మూడో గురువు ఎడిటర్‌గా నాకు తొలి అవకాశం ఇచ్చిన ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌. అయితే ఎడిటర్‌గా తొలి అవకాశం అందుకొని నేను బయటకు వెళ్తున్నప్పుడు సంజీవి నాపై చాలా కోప్పడ్డారు. ‘గౌతంరాజు వస్తే లోపలికి రానివ్వొద్ద’ని తన సిబ్బందితో అన్నారు. అప్పుడు నేను చాలా బాధపడ్డా. నా జీవితంలో నేను తీవ్రంగా హర్ట్‌ అయిన సందర్భం అదొక్కటే. ఆయనే తను తీసిన ఒక ఒరియా చిత్రాన్ని నాకిచ్చి ఎడిట్‌ చేసి ఇవ్వమన్నారు. అప్పుడు అర్థం అయింది.. ఆయన కోపం తాత్కాలికమని, సహజమైనదని. నన్ను లోపలికి రానివ్వొద్దని చెప్పిన నా గురువు నాకు సినిమా ఇవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అని ఆనాటి సంఘటనని గుర్తుచేసుకున్నారు.

వాడి.. వేగం.. ప్రత్యేకం
‘చట్టానికి కళ్లు లేవు’ (Chattaniki Kallu Levu) నుంచి ‘ఖైదీ నెంబర్‌ 150’ (khaidi no 150) వరకు నేను నటించిన ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు మరణం వ్యక్తిగతంగా నాకు, మొత్తం పరిశ్రమకు పెద్ద లోటు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). గౌతంరాజు లాంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆయన చాలా సౌమ్యుడైనా.. ఎడిటింగ్‌ చాలా వాడిగా ఉంటుందని, మితభాషి అయినప్పటికీ ఎడిటింగ్‌ మెళకువలు అపరిమితమని, ఎంత నెమ్మదస్తుడో.. ఆయన ఎడిటింగ్‌ అంత వేగమని గౌతంరాజు ప్రతిభను కొనియాడారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ.. తక్షణ సాయం కింద రూ.2లక్షలు అందజేశారు.
* ‘‘ఎడిటర్‌గా గౌతంరాజు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఆయన మరణం చాలా బాధాకరం’’ అన్నారు హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna). ‘‘గౌతంరాజు నాకెంతో ఆత్మీయులు. మృధు స్వభావి. అనేక విజయవంతమైన సినిమాలకు కలిసి పనిచేశాం. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరమ’ని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
* ‘‘తెలుగు చిత్రసీమలో ఎడిటర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన గౌతంరాజు కన్నుమూయడం విచారకరం. నేను నటించిన ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘గబ్బర్‌ సింగ్‌’, ‘గోపాల గోపాల’ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని ట్విటర్‌ వేదికగా సంతాపం తెలియజేశారు నటుడు, జనసేనాధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan).
* గౌతంరాజు అకాల మరణం చెందడం తననెంతో బాధించిందన్నారు ఎన్టీఆర్‌. తాను చేసిన పలు సినిమాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. ఇలా పలువురు సినీప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని