Updated : 14 Jul 2022 10:57 IST

Vijayendra Prasad: వర్మపై విజయేంద్రప్రసాద్‌ ప్రశంసల వర్షం

నాలోని బాధ, కోపమే ఆరోజు అలా అనేలా చేశాయి

హైదరాబాద్‌: దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై(Ram Gopal Varma) రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ (Vijayendra Prasad) ప్రశంసల వర్షం కురిపించారు. వర్మలో మళ్లీ ‘శివ’ సినిమా నాటి డైరెక్టర్‌ కనిపించారని అన్నారు. బుధవారం ‘అమ్మాయి’(Ammayi) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన  మాట్లాడుతూ.. ‘‘సుమారు పది నెలల క్రితం ‘కనబడుట లేదు’ అనే ఆడియో ఫంక్షన్‌కు నన్ను అతిథిగా పిలిచారు. అదే కార్యక్రమానికి రాంగోపాల్‌ వర్మ కూడా హాజరయ్యారు. దాదాపు 15 ఏళ్ల నుంచి వర్మపై నాలో గూడుకట్టుకున్న కోపం, చిరాకు, అసహ్యం, బాధ అన్నీ కలగలిపి ఆరోజు స్టేజ్‌పై ఆయన్ని కొన్ని మాటలు అన్నాను. ‘‘శివ’ సినిమా చూశా. ఎంతో స్ఫూర్తి పొందా. నేనే కాదు నాలాంటి వందల మంది రచయితలు, టెక్నీషియన్స్‌, డైరెక్టర్స్‌ ఆయన వల్ల ప్రేరణ పొంది ఈ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కానీ, ఆనాటి వర్మ కనిపించడం లేదు. మీకేమైనా కనిపిస్తే మళ్లీ అలాంటి సినిమా తీయమని చెప్పండి’’ అని ఆరోజు అన్నాను. అలా అనొచ్చొ, అనకూడదో తెలియదు కానీ నాలోని ఆవేశం అలా అనిపించేలా చేసింది. కానీ, ఇప్పుడు ‘అమ్మాయి’ చూశాక గర్వంగా చెబుతున్నా. ‘రాము గారూ.. మీలో ఆనాటి డైరెక్టర్‌ మళ్లీ కనిపించారు. శివ కంటే వందింతలు ఎక్కువగా కనిపించారు’. అమ్మాయి సినిమా 40వేల థియేటర్లలో విడుదలవుతోందంటే నిజంగానే అద్భుతమైన విషయం. ఈ ఘనత ఇప్పటి వరకూ ఎవరూ సాధించలేదు. మన తెలుగువారందరికీ ఇది గర్వకారణం’’ అని విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఆనందం వ్యక్తం చేసిన వర్మ.. ‘‘మీరన్న మాటలు నాకెప్పటికీ గుర్తుంటాయి. ఇవే బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌’’ అని తెలిపారు.

మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రంగా రామ్‌ గోపాల్‌ వర్మ(RGV) తెరకెక్కించిన సినిమా Ladki. దీన్నే తెలుగులో ‘అమ్మాయి’గా (Ammayi) విడుదల చేయనున్నారు. పూజా భలేకర్‌(Pooja Bhalekar) ప్రధాన పాత్ర పోషించారు. జులై 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో ‘అమ్మాయి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయేంద్రప్రసాద్‌, కీరవాణి ముఖ్య అతిథులుగా పాల్గొని టీమ్‌ మొత్తాన్ని అభినందించారు. ఈ సినిమా కోసం సుమారు పదేళ్ల నుంచి కష్టపడుతోన్న పూజా భలేకర్‌ని మెచ్చుకున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని