Cinema News: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.. మీ ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ ఇక్కడ..!

2020.. కరోనా రాకతో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో వచ్చిన సరికొత్త అధ్యాయం ఓటీటీ. వైరస్‌ కారణంగా థియేటర్లు మూతపడిన వేళ విభిన్నమైన కంటెంట్‌తో

Updated : 12 Apr 2022 13:01 IST

ఓటీటీ రిలీజ్‌ కోసం సినీ ప్రియుల ఎదురుచూపులు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనాతో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో వచ్చిన సరికొత్త అధ్యాయం ఓటీటీ. వైరస్‌ కారణంగా థియేటర్లు మూతపడిన వేళ విభిన్నమైన కంటెంట్‌తో సినీ ప్రియులకు ఈ మాధ్యమం ఎంతో చేరువైంది. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత కూడా థియేటర్‌తో పాటు ఓటీటీల్లోనూ తమ చిత్రాలను విడుదల చేసి ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నాయి చిత్రబృందాలు. అలా, ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ‘రాధేశ్యామ్‌’, ‘పుష్ప’, ‘అఖండ’ వంటి భారీ బడ్జెట్‌, స్టార్‌ హీరోల సినిమాలు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాగా, మరికొన్ని వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సినీ ప్రేక్షకులు ఏ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారో ఓ లుక్కేద్దాం..!

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’

సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఓటీటీ రిలీజ్‌ల్లో మొదటి స్థానంలో ‘RRR’ ఉంది. రూ.వెయ్యి కోట్లు సాధించి ప్రస్తుతం బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోన్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ని ఇప్పటికే పలుసార్లు థియేటర్లలో చూసినవాళ్లు కూడా ఈ చిత్రాన్ని త్వరగా ఓటీటీలో విడుదల చేస్తే మరిన్ని సార్లు చూడొచ్చని అనుకుంటున్నారు. రామ్‌చరణ్‌, తారక్‌ల నటనను ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపిస్తోందని అభిమానులందరూ భావిస్తునారు.

‘‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’’

‘సాధారణ చిత్రాలు సైతం కొన్నిసార్లు అసాధారణమైన విజయాలు నమోదు చేసుకుంటాయి’ అని చెప్పడానికి సరైన ఉదాహరణ ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. 90 దశకంలో కశ్మీర్‌ పండిట్స్‌పై జరిగిన దారుణ మారణకాండ ఆధారంగా వివేక్‌ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివాదాస్పద కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులను మన్ననలు పొందింది.ఎలాంటి హడావుడి లేకుండా సాధారణ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.200 కోట్లు వసూళ్లు రాబట్టిందంటే ఈ చిత్రానికి ఉన్న ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం భారతీయులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు దర్శకుడు వివేక్‌.. ‘‘త్వరలోనే ఓటీటీలో విడుదల చేస్తాం’’ అని ప్రకటించారు.

‘‘గంగుబాయ్‌ కాఠియావాడి’’

ముంబయి మాఫియా క్వీన్‌గా పేరు తెచ్చుకున్న గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘గంగుబాయి కాఠియావాడి’. ఆలియాభట్‌ కథానాయిక. మాఫియా క్వీన్‌ బయోపిక్‌ కావడం, సంజయ్‌ లీలా భన్సాలీ ఆ చిత్రాన్ని తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఆలియా భట్‌ నటనకు ఎప్పటిలానే మంచి మార్కులు పడ్డాయి. ‘RRR’తో ఆలియా తెలుగు వారికీ చేరువ కావడంతో.. బాలీవుడ్‌ ప్రేక్షకులతోపాటు తెలుగువాళ్లూ ‘గంగూబాయి’ ఓటీటీ రాక కోసం వెయిట్‌ చేస్తున్నారు.

‘‘సన్‌ ఆఫ్‌ ఇండియా’’

చాలా సంవత్సరాల సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు తెరకెక్కించిన ఈ సినిమా డైరెక్ట్‌ ఓటీటీలోనే రిలీజ్‌ అవుతుందని మొదట అందరూ భావించారు. కానీ ఈ చిత్రబృందం దీన్ని థియేటర్‌లో విడుదల చేసింది. మిశ్రమ స్పందనలకే పరిమితమైనప్పటికీ ఇందులో మోహన్‌బాబు డైలాగ్‌లు, డైరెక్టర్‌ టేకింగ్‌, కెమెరా పనితనం బాగున్నాయని అందరూ చెప్పుకొన్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీలో వస్తే బాగుంటుందని అభిమానులు ఆశ పడుతున్నారు.

‘‘మిషన్‌ ఇంపాజిబుల్‌’’

తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. చిన్నారుల అపహరణ, ఆ రాకెట్టుని గుట్టురట్టు చేయడానికి ముగ్గురు పిల్లలతో జర్నలిస్ట్‌గా తాప్సీ చేసే ప్రయత్నాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. స్వరూప్‌ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఈ సినిమా ఓటీటీలో విడుదలైతే చూడాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని