RRR: తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మేనియా.. అభిమానుల సందడే సందడి

తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సందడి నెలకొంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Updated : 25 Mar 2022 13:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సందడి నెలకొంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణల్లోని థియేటర్ల వద్ద అభిమానులు కేరింతలు కొడుతున్నారు. పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ బ్యానర్లు కట్టడంతో పాటు తమ అభిమాన హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. పలు చోట్ల బాణసంచా కాలుస్తూ సందడిగా గడుపుతున్నారు.  హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, అనంతపురం తదితర నగరాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణ కనిపిస్తోంది. విశాఖలోని సంగం శరత్‌ థియేటర్‌ వద్ద అభిమానులు వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు.

కుటుంబసభ్యులతో కలిసి సినిమా చూసిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ తమ కుటుంబసభ్యులతో కలిసి సినిమాను వీక్షించారు. గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్‌లో ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్‌రామ్‌, భార్గవ్‌ రామ్‌ ఇతర కుటుంబసభ్యులతో కలిసి చూశారు. మరోవైపు రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన, ఇతర కుటుంబసభ్యులు కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో చిత్రాన్ని వీక్షించారు. 

ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద భారీ ట్రాఫిక్‌జామ్‌

సినిమా విడుదల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది. భారీగా అభిమానులు చేరుకోవడంతో ఐమాక్స్‌ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని