Aishwarya Rajesh: తెలుగులో అలాంటి సినిమాలు చేయాలంటే స్టారై ఉండాలి: ఐశ్వర్య

‘ఫర్హానా’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నటి ఐశ్వర్య రాజేశ్‌. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌ ఆమె మాట్లాడారు.

Published : 08 May 2023 18:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగులో ఉమెన్‌ సెంట్రిక్‌ (నాయికా ప్రాధాన్య) సినిమాలు చేయాలంటే స్టారై ఉండాలని నటి ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh) అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు బిడ్డే అయినా టాలీవుడ్‌లో తనకు పెద్దగా అవకాశాలు రాలేదన్నారు. తన కొత్త సినిమా ‘ఫర్హానా’ (Farhana) ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘నాన్న, తాత, అత్తయ్య ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించారు. నేను ఇక్కడ తక్కువ సినిమాలు చేస్తుండడం వల్ల ‘చెన్నై నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అవ్వొచ్చు కదా’ అని చాలామంది సలహా ఇస్తుంటారు. నేను పుట్టి, పెరిగింది చెన్నైలోనే కాబట్టి అక్కడే నాకు కంఫర్ట్‌గా ఉంటుంది. అయితే, ఇంట్లో మేమంతా తెలుగులోనే మాట్లాడుకుంటాం. తమిళ్‌లోనే ఎక్కువగా అవకాశాలు రావడంతో మా అమ్మ నన్ను ప్రశ్నిస్తుంటుంది. ‘నాన్న హీరోగా తెలుగులో 40 సినిమాలు చేశారు. నువ్వెందుకు చేయవు?’ అని అడుగుతూనే ఉంటుంది. సాధారణ కథలతో తెలుగు సినిమాలు చేయకూడదు.. అక్కడ అదిరిపోయే చిత్రాలు చేయాలని నేను సమాధానమిస్తుంటా. నాయికా ప్రాధాన్య సినిమాల విషయంలోనూ అదే నా అభిప్రాయం. నేను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద అభిమానిని. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల నటన నాకు ఇష్టం’’ అని ఐశ్వర్య చెప్పారు. ‘ఫర్హానా’ మంచి విజయం అందుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహించిన ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘ఫర్హానా’ మే 12న తెలుగు, తమిళ్‌, హిందీలో విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ సినిమా టీమ్‌ పాల్గొంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఐశ్వర్య.. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’, ‘టక్‌ జగదీష్‌’, ‘రిపబ్లిక్‌’లో కనిపించారు. ప్రస్తుతం తమిళ్‌, మలయాళం సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘రెండు జెళ్ల సీత’వంటి హిట్‌ చిత్రాల్లో హీరోగా మెరిసిన దివంగత రాజేశ్‌ కుమార్తె ఈ ఐశ్వర్య. ఆమె మేనత్త ఎవరో కాదు ఎన్నో వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీలక్ష్మి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు