Faria Abdullah: ‘25 ఏళ్లు ఇండస్ట్రీలో పక్కాగా ఉంటావ్‌..’ అన్నారు!

నటి ఫరియా అబ్దుల్లా ఇంటర్వ్యూ. తన కొత్త చిత్రం ‘లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ సినిమా గురించి ఆమె పంచుకున్న విశేషాలివీ..

Published : 29 Oct 2022 01:37 IST

హైదరాబాద్‌: ‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన అందం ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అని యువకులు పాడుకునేలా చేసింది. ఇప్పుడు ‘లైక్‌, షేర్‌, సబ్‌స్క్రైబ్‌’ సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ‘‘హాయ్‌.. ఎలా ఉన్నారు? నేనండీ మీ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). ఇప్పుడెందుకు వచ్చాననే కదా మీ అనుమానం. నేను తొలిసారి కథానాయికగా నటించిన ‘చిట్టి’ (జాతిరత్నాలు) పాత్రపై మీరెంతో అభిమానం చూపించారు. నా కొత్త చిత్రం ‘లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’కూ (Like Share and Subscribe) మీ ఆశీస్సులు కావాలనే ఇలా వచ్చా. ఈ సినిమా నవంబరు 4న విడుదలవుతుంది. మీరంతా తప్పకుండా థియేటర్‌ వెళ్లి మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా. ‘ఏక్‌ మినీ కథ’, ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రాలతో మీకు బాగా దగ్గరైన సంతోష్‌ శోభన్‌ సరసన ఈ సినిమాలో నటించా. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ‘కొత్తగా ఏం చూపిస్తారని మేం సినిమాకి వెళ్లాలి?’ అని అంటారా.. ఇది అడ్వంచర్‌ యాక్షన్‌ కామెడీ. 40 శాతం సినిమా అడవి నేపథ్యంలోనే సాగుతుంది. మీరు ఊహించలేని ఎన్నో మలుపులుంటాయి.

ప్రారంభం నుంచి శుభం కార్డు పడేవరకూ మీరు ఈ సినిమాని ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం నాకుంది. విభిన్న లేయర్స్‌ ఉన్న స్క్రిప్టు ఇది. ఇందులోని కామెడీ సందర్భానికి తగ్గట్టే ఉంటుంది కానీ అతికించినట్టు ఉండదు. నేను ట్రావెల్‌ వ్లాగర్‌ వసుధగా కనిపిస్తా. యూట్యూబ్‌ ఛానల్‌లో వీడియోలు పోస్ట్‌ చేసేందుకు దేశమంతా తిరుగుతుంటా. ఆ ప్రయాణంలోనే హీరోని కలుస్తా. తనూ ట్రావెల్‌ వ్లాగరే. మా ఇద్దరి పరిచయం ఎక్కడి వరకు వెళ్లింది? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది. సంతోష్‌ శోభన్‌ మంచి నటుడు. సినిమా అంటే ఆయనకు ప్యాషన్‌. అలాంటి వ్యక్తితో కలిసి నటించినందుకు సంతోషించా. మేర్లపాక గాంధీ స్పష్టత ఉన్న దర్శకుడు. ఆయన చెప్పిందే నేను ఫాలో అయిపోయా. ఈ సినిమా జర్నీని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ చిత్రం వల్లే తొలిసారి నేను విదేశానికి (థాయ్‌లాండ్‌) వెళ్లా’’

‘‘చిట్టి’ పాత్ర నాకు ఓ ఎమోషన్‌. మీరు నాపై కురిపించిన ప్రేమకు ఆనందంతోపాటు బాధ్యత పెరిగింది. అందుకే ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నా. ప్రస్తుతం తమిళంలో సుశీంధిరన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. నా నటనకు మెచ్చిన ఆయన.. ‘25 ఏళ్లు ఇండస్ట్రీలో పక్కాగా ఉంటావ్‌’ అని ప్రశంసించినప్పుడు నాకు మాటలు రాలేదు. ఆ సినిమాలో విజయ్‌ ఆంటోని హీరో. తెలుగులో రవితేజ సరసన ‘రావణాసుర’ చిత్రంలో నటిస్తున్నా. ఓ వెబ్‌సిరీస్‌ (హిందీ)లో మంచి క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నా. ఫలానా జానర్‌లోనే సినిమాలు చేయాలి, అలాంటి పాత్రలే పోషించాలనే పరిధులు నాకు లేవు. దర్శకత్వంపై ఆసక్తి ఉంది. కానీ, ఇప్పుడప్పుడే మెగాఫోన్‌ పట్టుకోవాలని లేదు. దానికి పదేళ్ల సమయం తీసుకుంటా. అప్పటి వరకూ నన్ను ఇలానే ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా’’ ... మీ ఫరియా అబ్దుల్లా



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని