Ravanasura: రవితేజ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా: ఫరియా అబ్దుల్లా

రవితేజ సరసన ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) నటించిన సినిమా ‘రావణాసుర’ (Ravanasura). తాజాగా ఆమె ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను మీడియాతో పంచుకుంది.

Published : 21 Mar 2023 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాస్‌ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). సుధీర్‌ వర్మ దర్శకత్వంలో పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్‌లు, డైలాగులు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఏప్రిల్‌7న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని హీరోయిన్స్‌లో ఒకరైన ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)  మీడియాతో మాట్లాడుతూ ‘రావణాసుర’ విశేషాలు పంచుకుంది. మరి ఈ చిట్టి చెప్పిన విషయాలేంటో మీరు చూసేయండి. 

‘రావణాసుర’లో మీ పాత్ర ఎలా ఉండనుంది?

ఫరియా అబ్దుల్లా: ఈ సినిమాలో నేను లాయర్‌ పాత్రలో నటించాను. నా పాత్ర పేరు కనకమహాలక్ష్మి. జాతిరత్నాల్లో లాయర్‌లా కాదు(నవ్వుతూ). చాలా సీరియస్‌గా ఉండే పాత్ర. విభిన్నమైన షేడ్స్‌ ఉంటాయి. కథతో పాటు మారుతూ ఉంటుంది. 

రవితేజతో కలిసి నటించడం ఎలా అనిపించింది?

ఫరియా అబ్దుల్లా: ఆయనతో కలిసి నటించడం కొత్త అనుభూతినిచ్చింది. నటుడిగానే కాదు వ్యక్తిగా కూడా ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. షూటింగ్‌లో బ్రేక్‌ సమయంలో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన నుంచి నేను సహనాన్ని నేర్చుకున్నాను. 

బ్రేకప్‌ సాంగ్‌ గురించి చెప్పండి? ఈ సినిమాలో సీత ఎవరు?

ఫరియా అబ్దుల్లా: ఈ సినిమా కథలో ఫ్లాష్‌బ్యాక్‌ పాయింట్‌ ఉంటుంది. అందులో ఈ పాట వస్తుంది. ఈ సాంగ్‌ షూటింగ్‌ను చాలా ఎంజాయ్‌ చేశాను. ఈ చిత్రంలో సీత ఎవరు అనే విషయాన్ని మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అప్పటి వరకు సస్పెన్స్‌. 

కథ వినగానే మీకు ఏమనిపించింది? దర్శకుడి గురించి చెప్పండి?

ఫరియా అబ్దుల్లా: రచయిత శ్రీకాంత్‌ నాకు కథ చెప్పారు. వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. ఇక ఈ సినిమా దర్శకుడు సుధీర్ వర్మ చాలా క్లారిటీగా ఉంటారు. ఆయనతో వర్క్‌ చెయ్యడం చాలా మంచి అనుభూతినిచ్చింది.

లాయర్‌ పాత్రలో నటించడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

ఫరియా అబ్దుల్లా: ఈ కథకు లాయర్‌ పాత్ర అవసరం. కోర్టులో తక్కువ సీన్స్‌ ఉంటాయి. లాయర్‌ నేపథ్యం చాలా కీలకంగా ఉంటుంది. మ్యారీడ్‌ వుమెన్‌. బాడీ లాంగ్వేజ్‌ కూడా కొంచెం పరిణితి చెంది ఉండాలి. 

ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌ కదా.. వాళ్ల కాంబినేషన్‌లో మీకు సీన్స్‌ ఉన్నాయా?

ఫరియా అబ్దుల్లా: ఇందులో మేఘా ఆకాశ్‌తో మాత్రమే నాకు కాంబినేషన్‌ సీన్స్‌ ఉంటాయి. ఐదుగురు హీరోయిన్స్‌ ఉన్నా అందరివీ భిన్నమైన పాత్రలు. నటనకు ఆస్కారం ఉండే పాత్రలు.

మీరు చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు ఎందుకు?

ఫరియా అబ్దుల్లా: త్వరగా ఎక్కువ సినిమాలు చెయ్యాలనే ఆలోచన నాకు లేదు. నా ప్రయాణంపై నాకు స్పష్టత ఉంది. మరో ఐదేళ్లలో ఎక్కడ ఉంటానో నాకు అంచనా ఉంది. అందుకే సినిమాల ఎంపిక విషయంలో తొందరపడను. అవకాశాలు వస్తాయా.. రావా అనే భయం కూడా లేదు. నాకు ప్రయోగాలు చెయ్యడం ఇష్టం.  నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు, యాక్షన్‌ పాత్రలు.. ఇలా భిన్నమైన క్యారక్టర్లు చెయ్యడం ఇష్టం. 

దర్శకత్వం చేసే ఆలోచన ఉందా? మీ కొత్త ప్రాజెక్ట్‌ల గురించి చెప్పండి?

ఫరియా అబ్దుల్లా: దర్శకత్వం చెయ్యాలనే ఆలోచన ఉంది. అలాగే ప్రొడక్షన్ చెయ్యాలని కూడా ఉంది. అయితే వాటికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒక్కో సినిమా చేస్తున్నా. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి(Faria Abdullah interview).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని