farzi review: రివ్యూ: ఫర్జీ (వెబ్‌సిరీస్‌)

farzi review: షాహిద్‌కపూర్‌, విజయ్‌ సేతుపతి, కేకే మేనన్‌ కీలక పాత్రల్లో నటించిన ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 10 Feb 2023 18:07 IST

farzi review; వెబ్‌సిరీస్‌: ఫర్జీ; నటీనటులు: షాహిద్‌ కపూర్‌, విజయ్‌ సేతుపతి, కెకె మేనన్‌, రాశీఖన్నా, భువన్‌ అరోడా, జాకీర్‌ హుస్సేన్‌, చిత్తరంజన్‌ గిరి, రెజీనా తదితరులు; సినిమాటోగ్రఫీ: తరుణ్‌ అచపల్‌, ప్రతా నారంగ్‌, అమిత్‌ సురేంద్రన్‌, పంకజ్‌ కుమార్‌; సంగీతం: మానుయ్‌ దేశాయ్‌, కేతన్‌ సోథి; స్టంట్స్‌: అజీజ్‌ గులాబ్‌; దర్శకత్వం: రాజ్‌ అండ్‌ డీకే (రాజ్‌ నిడుమోరు, కృష్ణ డీకే); స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

సినిమాలకు దీటుగా ప్రేక్షకులను అలరిస్తున్న వినోద మాధ్యమం ఓటీటీ. కొత్త మూవీలు నేరుగా విడుదలవడమే కాదు.. ఓటీటీ వేదికలు సైతం కొత్త కాన్సెప్ట్‌లతో వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కిస్తూ వినోదాన్ని పంచుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పోటీ నేపథ్యంలో అగ్ర తారలతోనూ సిరీస్‌లను నిర్మిస్తున్నారు. అలా బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor) నటిస్తున్న తొలి వెబ్‌సిరీస్‌ ‘ఫర్జీ’. ‘ఫ్యామిలీమ్యాన్‌ (The Family Man)తో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌-డీకే దీన్ని (Farzi) తీర్చిదిద్దారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon prime video) వేదికగా విడుదలైన ఈ సిరీస్‌ కథేంటి? (farzi review) ఎలా ఉంది?

కథేంటంటే: బొమ్మయినా, పెయింటింగ్‌నైనా అచ్చుగుద్దినట్లు గీయగల టాలెంట్‌ ఉన్న యువకుడు సందీప్‌ అలియాస్‌ సన్నీ (షాహిద్‌కపూర్‌). చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తాత మహదేవ్‌ (అమోల్‌ పాలేకర్‌) చేరదీసి పెంచుతాడు. స్వాతంత్ర్య సమరయోధుడైన ఆయన క్రాంతి అనే పత్రికను నడుపుతుంటాడు. పత్రిక కోసం, అందులోని సిబ్బంది కోసం తలకుమించిన అప్పులు చేస్తాడు. చివరకు పత్రికా కార్యాలయాన్ని అప్పులు వాళ్లు స్వాధీనం చేసుకునే వరకూ పరిస్థితి వెళ్తుంది. తాత బాధను చూడలేక ఎలాగైనా డబ్బు సంపాదించి పత్రిక కార్యాలయాన్ని తాతకు తిరిగి ఇవ్వాలనుకుంటాడు సన్నీ. దీంతో స్నేహితుడు ఫిరోజ్‌ (భువన్‌ అరోరా)తో కలిసి దొంగనోట్లను ముద్రించాలనుకుంటాడు. (farzi review) అద్భుతంగా బొమ్మలు గీయడంలో సన్నీ దిట్టయితే.. ప్రింటింగ్‌ సెక్షన్‌లో కలర్‌ కాంబినేషన్స్‌ చక్కగా తీర్చిదిద్దగల సమర్థుడు ఫిరోజ్‌. దీంతో వీరిద్దరూ కలిసి మూతబడిన క్రాంతి పత్రిక ఆఫీస్‌లో దొంగనోట్లను ముద్రిస్తారు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో దొంగ నోట్ల చలామణీ చేస్తుంటాడు మన్సూర్‌ దలాల్‌ (కేకే మేనన్‌). ఆర్‌బీఐ, స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌ మైఖేల్‌ వేదనాయగం (విజయ్‌ సేతుపతి) చర్యల వల్ల అతడు ముద్రించిన నోట్లను ప్రభుత్వం సులభంగా గుర్తించి ఏరి పారేస్తుంది. కానీ, సన్నీ ముద్రించిన నోట్లను బ్యాంకులు, ప్రత్యేక పరికరాలు కూడా గుర్తించలేవు. ఈ క్రమంలోనే సన్నీ గురించి తెలుసుకున్న మన్సూర్‌ పెద్ద ప్లాన్‌ వేస్తాడు. అందులోకి సన్నీని ఎలా తీసుకొచ్చాడు? అతడితో నోట్లను ముద్రించడానికి చేసిన పనులేంటి? మన్సూర్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో సన్నీ, ఫిరోజ్‌లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? మేఘా వ్యాస్‌ (రాశీఖన్నా) ఎవరు? (farzi review) తదితర వివరాలు తెలియాలంటే వెబ్‌సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ‘ధనం మూలం ఇదం జగత్‌’. (farzi review) ధనం ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. డబ్బుతోనే ఈ ప్రపంచం నడుస్తుంది. ధనమే అన్నింటికి మూలం. ఎనిమిది ఎపిసోడ్స్‌ ఉన్న ఈ సిరీస్‌ కథను ఒక్క లైన్‌లో చెప్పాలంటే.. ‘ఆశ’ మనిషిని బతికిస్తే.. ‘అత్యాశ’ ఎంతవరకైనా తీసుకెళ్తుంది.  డబ్బు కోసం మంచివాడైన కథానాయకుడు ఎలాంటి అడ్డదారులు తొక్కాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన అనుభవాలు ఏంటి? అన్న ఒక కల్పిత కథను మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకుడితో కనెక్ట్‌ అయ్యేలా ‘ఫర్జీ’ని తీర్చిదిద్దడంలో సృష్టికర్తలు రాజ్‌ అండ్‌ డీకే విజయం సాధించారు. ప్రచార చిత్రాల ద్వారా వెబ్‌సిరీస్‌ నేపథ్యం చూపించిన దర్శకులు..  ఫస్ట్‌ ఎపిసోడ్‌ను పాత్రల పరిచయానికి కథానాయకుడి పయనానికి బాటలు వేశారు. (farzi review)  చిన్నప్పటి నుంచి సన్నీ, ఫిరోజ్‌లకు బాగా డబ్బు సంపాదించాలని ఉన్నా అందుకోసం బొమ్మలు గీస్తూ, ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తారు తప్ప, అడ్డదారులు మాత్రం తొక్కరు. ఎప్పుడైతే పత్రికా కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటామని అప్పుల వాళ్లు చెబుతారో అప్పటి నుంచే అక్రమంగానైనా డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు సన్నీ మదిలో మెదులుతాయి. ఈ క్రమంలో జీవితమంతా లోన్లు కడుతూ ఎలా సాగుతుందో సన్నీ పాత్రతో చెప్పించిన తీరు బాగుంది. అయితే, తాత కోసం అడ్డదారి తొక్కి అయినా డబ్బులు సంపాదించాలన్ని కథానాయకుడి ఉద్దేశం బలంగా లేదు. ఇటీవల కాలంలో కథానాయకుడిని డాన్‌గా, స్మగ్లర్‌గా నెగెటివ్‌ షేడ్‌ ఆపాదిస్తూ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయడమన్నది పెరిగింది. ఇదే తరహాలో ‘ఫర్జీ’లో దొంగనోట్ల ముద్రించే వాడిగా చూపించారు. ఈ విషయంలో దర్శక-రచయితలు కథానాయకుడి వెనుక ఉన్న ఉద్దేశాన్ని మరోరకంగా చూపించి ఉంటే ప్రేక్షకులకు ఇంకా బాగా కనెక్ట్‌ అయ్యేది. అది పక్కన పెడితే మధ్యలో వచ్చే సన్నీ లవ్‌ సీన్స్‌, విజయ్‌ సేతుపతి ఫ్యామిలీ డ్రామా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఈ సన్నివేశాలన్నీ ‘వేదం’లో అల్లుఅర్జున్‌ లవ్‌, ‘ఫ్యామిలీమ్యాన్‌’ సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌-ప్రియమణిల మధ్య డ్రామాలా ఉంటాయి.

నకిలీ నోట్ల కట్టడికి టాస్క్‌ఫోర్స్‌తో కలిసి ప్రభుత్వం ‘ధనరక్షక్‌’ సాఫ్ట్‌వేర్‌/ చిప్‌ను తీసుకొచ్చినా, సన్నీ తయారు చేసిన నోటు అది గుర్తించలేదు. ఈ విషయం నకిలీ నోట్లను చలామణీ చేసే అంతర్జాతీయ సిండికేట్‌ మెంబర్‌ అయిన మన్సూర్‌ దలాల్‌ తెలియడంతో సన్నీని, అతడి స్నేహితుడిని కిడ్నాప్‌ చేయడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ‘ఈ ప్రపంచంలో ఒక విషయానికి చావే లేదు.. అదే అత్యాశ’ అంటూ సన్నీని ఎమోషనల్‌గా బ్లాక్‌ మెయిల్‌ చేయడం, అతడి సాయంతో ఏ సాఫ్ట్‌వేర్‌/చిప్‌ కూడా గుర్తించలేని విధంగా నోట్లను తయారు చేయించుకోవడం తదితర సన్నివేశాలన్నీ సన్నీని మరింత చిక్కుల్లో పడేలా చేస్తాయి. దీంతో వీటి నుంచి సన్నీ ఎలా బయటపడతాడా? అన్న ఉత్కంఠ సిరీస్‌ చూస్తున్న ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఆయా సీన్స్‌ తెరకెక్కించిన విధానం కూడా ఆసక్తికరంగా ఉంది. భారీ మొత్తంలో ముద్రించిన నకిలీ నోట్లు భారత్‌లోకి ప్రవేశించకుండా టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు, కోస్టల్‌ గార్డ్‌, ఆర్మీ ఇలా ఎన్ని ప్రతిబంధకాలు పెట్టినా, సన్నీ తన తెలివి తేటలతో తీసుకొచ్చే సన్నివేశాలు సగటు ప్రేక్షకుడిని అలరిస్తాయి. ‘పుష్ప’లో అల్లు అర్జున్‌ ఎర్ర చందనం స్మగ్లింగ్‌ సన్నివేశాలను గుర్తు చేస్తాయి. చివరి మూడు ఎపిసోడ్స్‌లో స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌ ఉండేలా తీర్చిదిద్దారు. క్లైమాక్స్‌ ట్విస్ట్‌  బాగుంది. కొనసాగింపు ఉండేలా ‘ఫర్జీ’ ముగించారు. (farzi review)

ఎవరెలా చేశారంటే: షాహిద్‌కపూర్‌కు ఇదే తొలి వెబ్‌సిరీస్‌. ఆర్టిస్ట్‌గా, ధనవంతుడిగా జీవించాలని కలలుగనే సగటు యువకుడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. నటనలో ఎక్కడా అతి ప్రదర్శించలేదు. మొదటి నుంచి చివరి వరకూ అతడి పాత్ర సెటిల్డ్‌గా ఉంటుంది. ఫిరోజ్‌గా భువన్‌ నవ్వులు పూయించాడు. తెలుగులో అతడి డైలాగ్‌ డిక్షన్‌ సరదాగా ఉంటుంది. టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటన చాలా బాగుంది. అయితే, ఆయన ఫ్యామిలీ సీన్స్‌ బోర్‌. ఆర్‌బీఐలో నిపుణురాలైన ఉద్యోగిగా రాశీఖన్నా కనిపిస్తారు. (farzi review)  నకిలీ నోట్ల సిండికేట్‌ మెంబర్‌ మన్సూర్‌ దలాల్‌గా కేకే మేనన్‌ నటన విభిన్నంగా ఉంటుంది. ‘క్షణక్షణం’లో పరేశ్‌ రావల్‌ పాత్రను స్టైలిష్‌గా చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. రెజీనా, కావ్య థాపర్‌ పాత్రలకు పెద్ద ప్రాధాన్యం లేదు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. ‘ఫ్యామిలీమ్యాన్‌’లో ఉండే ‘చెల్లం సర్‌’ పాత్ర ఇందులోనూ తళుక్కున మెరుస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. నేపథ్య సంగీతం వెబ్‌సిరీస్‌కు ప్రాణం పోసింది. చివరి ఎపిసోడ్‌లో బీజీఎం ఆయా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఈ సిరీస్‌లో కాస్త లోపం ఉందంటే అది ఎడిటింగ్‌. ఎనిమిది ఎపిసోడ్స్‌ ఉన్నాయి. ప్రతిదీ సుదీర్ఘంగా సాగుతుంది. చాలా సన్నివేశాలకు కోత పెట్టే అవకాశం ఉన్నా.. వాటి జోలికి పోలేదు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. వెబ్‌సిరీస్‌కు కావాల్సిన వనరులు సమకూర్చారు. (farzi review)

ఇక చివరిగా చెప్పుకోవాల్సింది దీని సృష్టకర్తలు/దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే గురించి. ‘ఫ్యామిలీమ్యాన్‌’ వెబ్‌సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న వీరిద్దరూ ‘ఫర్జీ’ని ఎంగేజింగ్‌ క్రైమ్‌ డ్రామాగా తీర్చిదిద్దడంలో ఓకే అనిపించారు. మొదటి ఎపిసోడ్‌ నుంచి చివరి వరకూ ప్రేక్షకుడికి కనెక్ట్‌ అయ్యేలా తీర్చిదిద్దినా, ఎక్కడా పెద్ద ట్విస్ట్‌లేమీ ఉండవు. పరిస్థితుల ప్రభావం కారణంగా నకిలీ నోట్లను ముద్రించే కథానాయకుడి ఉద్దేశాన్ని ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. (farzi review) ‘డబ్బుకు నువ్వు ప్రాధాన్యం ఇస్తే.. నిన్ను అది బానిసను చేస్తుంది’ అని ఒక డైలాగ్‌ ఉంటుంది. బహుశా దానికి కట్టుబడి చివరి వరకూ ఆ పంథాను అనుసరించారేమో. అశ్లీలతకు పెద్దగా చోటు ఇవ్వలేదు కానీ, అసభ్య పదజాలాన్ని మాత్రం యథేచ్చగా వాడేశారు. (ముఖ్యంగా తెలుగులో) అలాగే ‘ఆదర్శాలు మారడం వల్ల నిజం మారదు కదా’, ‘దొంగతనంలో ఆఖరిసారి అనే మాటకు, అత్యాశకు అంతం అనేదే ఉండదు’, ‘దేవుడు చేసేవన్నీ డబ్బు చేస్తోంది కదా’ వంటి సంభాషణలు బాగున్నాయి. దీనికి కొనసాగింపుగా మరో సిరీస్‌ ఉంటుందని చివర్లో చెప్పారు. అంతేకాదు, అంతర్జాతీయంగా నకిలీ నోట్లను చలామణీ చేసే సిండికేట్‌లో ఒక సభ్యుడిగా మన్సూర్‌ దలాల్ చూపించారు. ఆయన పాత్రనూ ముగించలేదు. రెండో భాగంలో ఇంకా కొత్త పాత్రలు వస్తాయేమో చూడాలి. ఈ వీకెండ్‌లో ఏదైనా ఆసక్తికర వెబ్‌సిరీస్‌ చూడాలంటే ‘ఫర్జీ’ చూడొచ్చు. పెద్దగా మెరుపులు, ట్విస్ట్‌లు లేవు కానీ, నిరాశైతే పరచదు.

బలాలు: 👍 షాహిద్‌ కపూర్‌, విజయ్‌ సేతుపతి, కేకే మేనన్‌ నటన 👍 ఎంగేజింగ్‌ స్క్రీన్‌ప్లే 👍 సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు: 👎 కథానాయకుడి పాత్రకు బలమైన మోటివ్‌ లేకపోవడం 👎 సుదీర్ఘ ఎపిసోడ్స్‌

చివరిగా: ‘ఫర్జీ’ (నకిలీ) నోటు కాదు.. సూపర్‌ నోట్‌ 💵

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని