Fast X Movie Review: రివ్యూ: ‘ఫాస్ట్‌ X’

Fast X movie review in telugu: విన్‌ డీజిల్‌, జాసన్‌ మోమోయ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘ఫాస్ట్‌ ఎక్స్‌’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 18 May 2023 17:24 IST

Fast X Movie Review: చిత్రం: ఫాస్ట్‌ X; నటీనటులు: విన్ డీజిల్, మిచెల్లీ రోడ్రిజ్‌, జాసన్ మోమోవా, జాసన్ స్టాథమ్, జాన్‌ సెనా, జోర్డానా బ్రూవ్యూస్టర్‌ బ్రీ లార్సన్‌ తదితరులు; సంగీతం: బ్రియాన్ టైలర్; సినిమాటోగ్రఫీ: స్టీఫెన్‌ ఎఫ్‌.విన్‌డన్‌; ఎడిటింగ్‌: డైలాన్‌ హైస్మిత్‌, కెల్లీ, లారా ఎనోవించ్‌, కొర్బిన్‌ మెల్‌; కథ : డాన్ మజేయు, జస్టిన్ లిన్, జాక్ డీన్; స్క్రీన్‌ప్లే: డాన్ మజేయు, జస్టిన్ లిన్; నిర్మాణ సంస్థలు : యూనివర్సల్ పిక్చర్స్, ఒరిజినల్ ఫిల్మ్, వన్ రేస్ ఫిల్మ్స్, పర్ఫెక్ట్ స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్; దర్శకత్వం: లూయిస్ లెటెరియర్; విడుదల తేదీ: 18-05-2023

ప్రపంచవ్యాప్తంగా యాక్షన్‌ ప్రియులు అమితంగా ఇష్టపడే సిరీస్‌ ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’. ఇప్పటికే ఈ సిరీస్‌లో 9 చిత్రాలు వచ్చాయి. ఎంతో క్రేజ్‌ ఉన్న ఈ సిరీస్‌లో వచ్చిన పదో చిత్రమే ‘ఫాస్ట్‌ X’. (FAST X) గురువారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా కథేంటి? (Fast X movie review telugu) యాక్షన్‌ ప్రియులను అలరించేలా సన్నివేశాలు ఉన్నాయా?

కథేంటంటే: డొమినిక్ టొరెట్టో (విన్ డీజిల్) భార్య లెట్టీ(మిచెల్లీ రోడ్రిడ్జ్‌)తో కలిసి సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో రోమ్ నగరంలో చేయాల్సిన ఒక మిషన్‌కు సంబంధించి ఏజెన్సీ నుంచి సమాచారం అందుతుంది. అయితే, దానికి డొమినిక్‌ వెళ్లకుండా రోమన్‌ (టైరీస్ గిబ్సన్) లీడ్‌గా టీమ్‌ను పంపిస్తాడు. ఆ తర్వాతే అదొక కుట్ర అన్న విషయం తెలుస్తుంది. ఇంతకీ ఆ కుట్ర చేసింది ఎవరు? తన టీమ్‌ను, కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో డొమినిక్‌ ఏం చేశాడు? (Fast X movie review telugu) అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ చిత్రాలకు కథతో పెద్దగా పనిలేదు. అయితే, మొదటి ఐదు భాగాలు కథతో మిళితమైన యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. ఆ తర్వాత నుంచే దర్శక-నిర్మాతలు కథను పూర్తిగా పక్కన పెట్టేసి, యాక్షన్‌ సన్నివేశాలు, ఛేజింగ్‌లతో సినిమాను చుట్టేయడం మొదలు పెట్టారు. దీంతో ఈ సిరీస్‌పై కాస్త ఆసక్తి సన్నగిల్లినా, యాక్షన్‌ సీన్స్‌ను చూడటానికి మాత్రం సినీ ప్రేమికులు థియేటర్‌లకు క్యూ కట్టేవారు. ఆ కోవలోనే ‘ఫాస్ట్‌ 10’ ఉంది తప్ప, వాటికి భిన్నంగా ఏమీ లేదు. దర్శకుడు లూయిస్ కూడా కథ కంటే కూడా యాక్షన్‌ సన్నివేశాల మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ సినిమా కథ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, తన తండ్రి (ఫాస్ట్‌-5లో విలన్‌)ని చంపిన హీరో(డొమినిక్‌) పై విలన్‌ కొడుకు డాంటే రేయీస్‌ (జాసన్‌ మోమోయ్‌) పగతీర్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడన్నదే ఈ చిత్ర కథ.

ఫాస్ట్‌-9ను కొనసాగిస్తూ ఛేజింగ్‌ సీన్‌తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా ప్లాట్‌ పాయింట్‌కు వచ్చాడు. తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకునేందుకు డాంటే రేయీస్‌ పథకం రచించడం, ఆ ఉచ్చులో డొమినిక్‌ టీమ్‌ పడటంతో అసలు కథ మొదలవుతుంది. ప్రమాదంలో పడిన తన కుటుంబ సభ్యులు, స్నేహితులను కాపాడుకునేందుకు డొమినిక్‌ ఎప్పుడైతే రంగంలోకి దిగుతాడో అక్కడి నుంచే సినిమా రోలర్‌ కోస్టర్‌ ఎక్కినట్లు ఉంటుంది. పది నిమిషాలకో యాక్షన్‌ సీన్‌ వస్తూనే ఉంటుంది. ఆ సన్నివేశాలన్నీ తెరపై గ్రాండ్‌గా ఒళ్లు గగురుపొడిచేలా ఉంటాయి. మరీ ముుఖ్యంగా రోమ్‌లో జరిగే యాక్షన్ ఎపిసోడ్, చివరి 40 నిమిషాలు సినిమాకే హైలైట్‌. ప్రతి సీన్‌ను చాలా పర్‌ఫెక్ట్‌గా రిచ్‌నెస్‌తో తీశారు. లాజిక్‌లు లేకుండా ‘ఫాస్ట్‌ X’ చూస్తే విజువల్‌ మేజిక్‌ కనపడుతుంది. ఈ వీకెండ్‌లో ఓ మాంచి యాక్షన్‌ మూవీ చూడాలంటే ‘ఫాస్ట్‌ X’ ప్రయత్నించవచ్చు. కొన్ని థియేటర్‌లలో తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది. అయితే, ఇందులోని పాత్రలు కాస్త అర్థం కావాలంటే సిరీస్‌ను ఫాలో అయి ఉండాలి. అవన్నీ చూసి సినిమాకు వెళ్లడం కష్టం కాబట్టి, విలన్‌ కొడుకు ఎందుకు పగతీర్చుకుంటున్నాడో కారణం తెలియాలంటే ‘ఫాస్ట్‌-5’ చూసి వెళ్లడం కాస్త నయం. ఏదేమైనా యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారిని మాత్రం ‘ఫాస్ట్‌ X’ నిరాశపరచదు.

ఎవరెలా చేశారంటే: ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సిరీస్‌ అంటే విన్‌ డీజిల్‌, యాక్షన్‌ సీన్స్‌ తప్ప మరెవరూ గుర్తుకురారు. తనకు అలవాటైన యాక్షన్‌ సన్నివేశాల్లో ఆయన అదరగొట్టేశాడు. విన్‌ డిజిల్‌కు ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’లో ఇదే ఆఖరి చిత్రం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇక హీరో పాత్ర ఎలివేట్‌ అవ్వాలంటే విలన్‌ క్యారెక్టర్‌ బలంగా ఉండాలి. గత చిత్రాలు తీర్చలేకపోయిన ఆ కొరతను ‘ఫాస్ట్‌ X’ తీర్చింది. ‘ఆక్వామెన్‌’ హీరో జాసన్‌ మోమోవా ప్రతినాయకుడిగా చాలా బాగా నటించారు. ఒకవైపు విలనిజం పండిస్తూనే కామెడీ పంచ్‌లతో అలరించాడు. ఒక రకంగా మిగిలిన అన్ని పాత్రలను ఆయన డామినేట్‌ చేశారు. సాంకేతికంగా పేరు పెట్టడానికి ఏమీ లేదు. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ల కోసం ఏకంగా 161 మంది స్టంట్ డైరెక్టర్లు, కో-ఆర్డినేటర్లు పని చేశారంటే అర్థం చేసుకోవచ్చు టీమ్‌ ఎంత కష్టపడిందో. అలాగే దాదాపు 200 కార్లను షూటింగ్‌ కోసం వినియోగించారు. వారి పనితనం తెరపై స్పష్టంగా కనపడుతుంది. యాక్షన్‌ సన్నివేశాలకు తగినట్లు నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. స్టీఫెన్‌ సినిమాటోగ్రఫీ అదుర్స్‌. (Fast X movie review telugu) కళ్లే చెదిరే యాక్షన్‌ సీన్స్‌ తెరపై చూపించారు. ఈ సినిమా కోసం నలుగురు ఎడిటర్లు ఉండగా, ఒక్కరూ సరిగా పనిచేయలేదేమో అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో చాలా సీన్స్‌ నెమ్మదిగా సాగుతాయి. పలు చోట్ల వాటిని ట్రిమ్‌ చేయొచ్చు. దర్శకుడు లూయిస్‌ కూడా బలమైన కథ, పాయింట్‌ లేకుండా సినిమా తీశాడు. అయితే, చివరిలో మాత్రం ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఎందుకంటే ‘ఫాస్ట్‌ X’ మూడు భాగాలుగా రాబోతోంది. ఇది తొలి భాగం కాగా, మిగిలిన రెండు పార్ట్‌లను తెరకెక్కించాల్సి ఉంది. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చూపించే క్రెడిట్‌ సీన్‌ తర్వాతి భాగాలపై ఆసక్తిని పెంచింది.

  • బలాలు
  • + యాక్షన్‌ సీన్స్‌
  • + విన్‌ డీజిల్‌, జాసన్‌ మోమోయ్‌ల నటన
  • బలహీనతలు
  • - కథ లేకపోవడం
  • - ద్వితీయార్ధంలో నెమ్మదిగా సాగే కథనం
  • - నిడివి
  • చివరిగా: ‘ఫాస్ట్‌ X’.. యాక్షన్‌ కిక్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు