Fathers day: నాన్నే తొలి హీరో!

తన కష్టాలకు, త్యాగాలకు ఏనాడూ ప్రతిఫలం ఆశించని నిస్వార్థ వ్యక్తిత్వం నాన్నది. అలాంటి త్యాగమూర్తికి ‘ఫాదర్స్‌ డే’ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు సినిమాలో గుర్తుండిపోయే కొన్ని తండ్రి పాత్రలను పరిశీలిద్దాం. 

Updated : 10 Sep 2022 15:05 IST

ఆయన కడుపున మోసి జన్మనివ్వలేదు. జోల పాడి నిద్రపుచ్చలేదు. పాలుపట్టి ఆకలి తీర్చలేదు. అయినా అమ్మకన్నా నాన్న ఎందులో తక్కువ? ఏది కోరినా చిటికెలో తెచ్చిస్తాడు. కుటుంబం కోసం ప్రపంచంతో పోరాడతాడు. కలల్ని త్యాగం చేసి పిల్లల శ్రేయస్సు కోసం బతుకుతాడు. కన్నతల్లి కన్నా నాన్న ఏం తక్కువ చేశాడు? ఆయన కోపం వెనకే ఉండే ప్రేమకు, వెన్నలాంటి మనసుకు అసలు గుర్తింపు ఉండదెందుకు? నాన్నే కదా కుటుంబానికి ధైర్యం, భరోసా. ఆయన త్యాగాలు, చెమట నెత్తుళ్ల మీదే కదా పిల్లలు కలల సౌధాలను నిర్మించుకునేది. అయినా నాన్న ఎందుకు వెనకబడ్డాడు! తన కష్టాలకు, త్యాగాలకు ఏనాడూ ప్రతిఫలం ఆశించని నిస్వార్థ వ్యక్తిత్వం నాన్నది. అలాంటి త్యాగమూర్తికి ‘ఫాదర్స్‌ డే’ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు సినిమాల్లో గుర్తుండిపోయే కొన్ని తండ్రి పాత్రలను పరిశీలిద్దాం. 

అల్లరి నాన్న

కూతురు.. నాన్నకూచీ అనడంలో సందేహం అవసరం లేదు. అమ్మాయిలకు నాన్నే తొలి హీరో. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం ఎంత మధురంగా ఉంటుందో ‘డాడీ’ సినిమా చూపిస్తుంది.  చిన్నారి కూతురు ఐశ్వర్యతో చిరంజీవి చేసే అల్లరి నచ్చనివారు ఎవరుంటారు! పిల్లలతో చేరి అల్లరి నాన్నగా ఆనందాలు పంచుతాడు. బిడ్డల కోసం చిన్నపిల్లాడైపోతాడు.  ‘గుమ్మాడి.. గుమ్మాడి’ అని కూతురి గురించి  తండ్రి పాడే పాట ఇందులోదే. నిజ జీవితంలో తమ కూతుళ్లని ఈ పాటలో చూసుకొనే నాన్నలు ఎందరు లేరు!  ఇలాంటి అల్లరి నాన్నలు టాలీవుడ్‌ సినిమాల్లో చాలామందే ఉన్నారు. అందులో ప్రభాస్‌ ‘డార్లింగ్‌’లో ప్రభు, ‘కిక్‌’లోని షాయాజి షిండే పాత్రలు అలాంటివే.

ఆకాశమంత.. ప్రేమున్నోడు

తొలి ప్రేమ, తొలి ముద్దు, తొలి విజయం ఇలా జీవితంలో మొదటివన్నీ ప్రత్యేకమైనవే. వీటన్నింటికన్నా ఎక్కువ ఆనందాన్నిచ్చే ముఖ్యమైన సందర్భం మరొకటి ఉంది. అదే నాన్నగా మారిన తొలి క్షణాలు.  పుట్టినప్పటి నుంచి స్కూల్‌, పై చదువులు, ప్రేమ, పెళ్లి.. ఇలా ప్రతి సందర్భంలో తండ్రి పొందే అనుభవాల సమహారంగా ఉంటుంది ‘ఆకాశమంతా’ సినిమా. కూతురే లోకంగా, పిచ్చిగా ప్రేమించే తండ్రిగా ప్రకాశ్‌రాజ్‌ నటించారు. తండ్రీకూతుళ్ల ప్రేమకు ప్రతీక లాంటి సినిమా ఇది. చిన్నతనంలో అల్లారు ముద్దుగా పెంచిన తండ్రికి కూతురు పెరిగే కొద్దీ వారి బంధంలో మార్పులు ఎలా ఉంటాయో ఇందులో చూపించారు. ప్రతి సందర్భంలో తన కూతురు సంతోషంగా ఉండాలని కోరుకునే తండ్రిగా ప్రకాశ్‌ జీవించారు. ఇలాంటి పాత్రనే ‘నువ్వే నువ్వే’ చిత్రంలోనూ చేశారు.  పిల్లలకు ఆకాశమంత ప్రేమ పంచడం తప్ప ఇంకేదీ తెలియని అమాయకుడు నాన్న. ఇలాంటి తండ్రి పాత్రలే ‘ఖుషి’, ‘చందమామ’ లాంటి మరికొన్ని చిత్రాల్లో తారసపడతాయి.

 నాన్నను మించిన స్నేహితుడు ఎవరు!?

తండ్రీకొడుకులు స్నేహితులుగా ఉంటే ఎంత బాగుంటుందో చూపించిన సినిమా ‘సుస్వాగతం’. తండ్రిగా లెజెండరీ యాక్టర్‌ రఘువరన్‌ నటిస్తే, కొడుకుగా పవన్‌ కళ్యాణ్‌ జీవించారు. అంతకుముందు వచ్చిన  సినిమాల్లోని తండ్రుల్లా కాకుండా జాలీగా ఉండే నాన్నగా రఘువరన్‌ పాత్ర ఆకట్టుకుంటుంది.  కుమారుడిని దండించే తండ్రిగా కాకుండా, సరైన దారి చూపే స్నేహితుడిగా ఆయన కనిపిస్తారు. స్వేచ్ఛనిస్తూనే బాధ్యతగా ఉంటారు. ప్రేమలో విఫలమైన గణేశ్‌(పవన్‌ కల్యాణ్‌)ను ఓదార్చేంత చనువు ఇద్దరి మధ్య ఉంటుంది. స్నేహంగా ఉంటే తండ్రిని మించిన ఓదార్పు, ధైర్యం ఎవరూ ఇవ్వలేరని ఈ సినిమాలోని పాత్రల ద్వారా తెలుస్తుంది. 

సగటు మధ్యతరగతి తండ్రి

కన్నబిడ్డ చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే ఏ తండ్రికి కోపం రాదు చెప్పండి.  ఏ లక్ష్యమంటూ లేకుండా స్నేహితులు, ప్రేమ అని చెడు తిరుగుళ్లు తిరిగే కుమారుడిని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు చంద్రమోహన్‌ ‘7జీ బృందావన్‌ కాలనీ’లో. మధ్య తరగతి తండ్రి ఆవేశమంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. బయట మనకు కనిపించే అందరి నాన్నల్లాగే ఈ పాత్రను తీర్చిదిద్దారు దర్శకుడు సెల్వరాఘవన్. ఓ సందర్భంలో రవి(రవికృష్ణ)ని చితకబాదిన తండ్రే.. ఉద్యోగం సాధించాడని తెలిసి కన్నీటి పర్యంతమవుతాడు.  ఇలాంటి పాత్రనే కోటశ్రీనివాస్‌రావ్‌ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో పోషించారు.  ‘నీది నాది ఒకే కథ’లోనూ కొడుకు కెరీర్‌ గురించి బాధపడే తండ్రిపాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ‘బొమ్మరిల్లు’ చిత్రంలో కుమారుడికి సంబంధించిన ప్రతిదీ తనకే తెలుసుననుకునే తండ్రిని ఎలా మరచిపోగలం? ఆ పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌ అంతలా జీవించేశారు మరి. కన్నబిడ్డల సౌఖ్యం, జీవితం తప్ప తండ్రికి వేరే ఆలోచన ఏముంటుంది చెప్పండి.

నాన్నే స్ఫూర్తి

పెద్దల నుంచే పిల్లలు నేర్చుకుంటారు. ముఖ్యంగా తండ్రుల నుంచే జీవితాన్ని ఎదుర్కొనే లక్షణాలు అలవర్చుకుంటారు.  ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ సినిమాలో తండ్రిపాత్ర అలా స్ఫూర్తి నింపేదే. సూర్య ప్రేమలో పడేందుకు కూడా తండ్రిపాత్ర స్ఫూర్తినిస్తుంది. ఆయనలాంటి ప్రేమకథనే తానూ కోరుకుంటాడు. అమ్మను నాన్న ఎంతలా ప్రేమించాడో అలాంటి ప్రేమనే తన జీవితంలోకి రాబోయే అమ్మాయికి పంచాలనుకుంటాడు సూర్య. ఒక్క ప్రేమ విషయంలోనే కాదు, చదువు, గొడవలు, జీవితం.. ఇలా ప్రతి విషయంలోనూ తండ్రినే మార్గదర్శకుడిగా భావిస్తాడు. ‘మీరే నా హీరో డాడీ’ అని సగర్వంగా చెప్పుకొనేంతలా స్ఫూర్తిగా తీసుకుంటాడు. నిజమే మరి నాన్నని మించిన స్ఫూర్తిని ఎవరు ఇవ్వగలరు! ఇలాంటి పాత్రే ‘కొత్త బంగారులోకం’లో ప్రకాశ్‌రాజ్‌ పోషించారు.

అమాయక తండ్రి

​​​​​​

మతి స్థిమితం లేని తండ్రిగా ‘నాన్న’ సినిమాలో విక్రమ్‌ జీవించేశాడు. తన చిన్నారి తల్లి అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని అమాయక తండ్రి ఆయన. మానసికంగా బలహీనుడైనా, ప్రేమను పంచడంలో ఆయన తక్కువేమీ కాదని చూపిస్తాడు దర్శకుడు. కూతురి మీద చూపించే ప్రేమ, శ్రద్ధ అబ్బురపరుస్తుంది. ఒంటరి తండ్రిగా కన్నబిడ్డను పెంచే క్రమంలో ఎదురయ్యే అవాంతరాలు, వాటిని ఎదుర్కొనేటప్పడు అతని అమాయకత్వం ఆకట్టుకుంటుంది. సినిమా అనే కాదు.. నిజజీవితంలోనూ పిల్లలకు అమాయకంగా కనిపిస్తూనే ఆనందాలు పంచుతాడు నాన్న. 

మా మంచి నాన్న 

మనతో పాటు మన చుట్టూ ఉండేవాళ్లు కూడా బాగుండాలనుకునే మంచి మనసు నాన్నది. కుటుంబంతోపాటు సమాజాన్ని సమంగా ప్రేమించే మంచినాన్నలు చాలామందే ఉంటారు. తెలుగులో ‘ఆ నలుగురు’లో రాజేంద్రప్రసాద్‌ అలాంటి పాత్రలో పోషించి రక్తి కట్టించారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని ప్రకాశ్‌రాజ్‌ పాత్ర కూడా అలాంటిదే. మనుషులందరూ మంచోళ్లే అని నమ్మే తత్వం ఆయనది. సినిమాలతో పాటు సమాజంలో, నిజజీవితంలో వెతికినా ఇలాంటి మంచినాన్నలు చాలామందే కనిపిస్తారు. 

త్యాగశీలి, ప్రేమమూర్తి, మార్గదర్శి అయిన నాన్నకు మరోసారి ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు చెబుదాం.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని