Jana Gana Mana: తక్షణ న్యాయంపై చర్చ... ‘జనగణమన’

డిజో జోస్‌ ఆంటోనీ తెరకెక్కించిన ‘జనగణమన’ సినిమా థియేటర్ల వేదికగా మంచి విజయం అందుకుని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా ఎందుకు చూడాలంటే...

Updated : 09 Jun 2022 17:45 IST

ఇన్‌స్టెంట్ కాఫీ.. ఇన్‌స్టెంట్ టీ.. ఇన్‌స్టెంట్ జ‌స్టిస్‌.. మొద‌టి రెండూ ఎంత సౌక‌ర్యంగా ఉంటాయో, మూడోది అంత ప్ర‌మాద‌క‌రం. హైద‌రాబాద్ శివారులో దిశ హ‌త్యాచార ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు, కొన్నాళ్ల ముందు దేశ రాజ‌ధాని దిల్లీలో జ‌రిగిన నిర్భ‌య కేసుతో పోల్చి చూశారు. ఈ కేసులో నిందితుల‌ను ఎప్పుడు అరెస్టు చేస్తారు? ఎప్ప‌టికి న్యాయం జ‌రుగుతుంద‌ని అంతా ప్ర‌శ్నించారు. చివ‌ర‌కు పోలీసుల చేతుల్లో నిందితులు ఎన్‌కౌంట‌ర్ అయిపోయిన‌ప్పుడు చాలామందిలో ఏదో తెలియ‌ని సంతృప్తి! 2020 సంవ‌త్స‌రంలో స‌గ‌టున భార‌త‌దేశంలో రోజుకు 77 అత్యాచార కేసులు న‌మోద‌య్యాయి. అంటే.. గంట‌కు 3. ఆ సంవ‌త్స‌రం మొత్తం క‌లిపితే భ‌ర‌త‌మాత క‌న్న‌బిడ్డ‌ల మీద జ‌రిగిన మొత్తం అత్యాచారాలు 28,046. మ‌హిళ‌ల మీద జ‌రిగిన నేరాల‌న్నీ క‌లిపి న‌మోదైన కేసులు 3,71,503.

ఇన్ని ఘోరాలు జ‌రుగుతున్నా, కొన్ని కొన్ని కేసుల విష‌యంలో మాత్ర‌మే ప్ర‌జ‌ల స్పంద‌న ఎక్కువ‌గా ఉంటోంది. దానికి కార‌ణం.. మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం. ఈ ప్ర‌చారాన్ని చూసి ఎక్కువ‌మంది ఆవేశ‌ప‌డ‌టం, దానికి స్పంద‌న‌గా త‌క్ష‌ణ న్యాయమనే మార్గాన్ని కొంద‌రు పోలీసులు అవ‌లంబించ‌టం చాలా సంవ‌త్స‌రాలుగా జ‌రుగుతోంది. కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం దీని వెన‌క కొన్ని శ‌క్తులు ప‌నిచేస్తున్నాయ‌న్న విష‌యాన్ని ఇతివృత్తంగా తీసుకుని కేవ‌లం 33 ఏళ్ల వ‌య‌సున్న మ‌ల‌యాళ యువ ద‌ర్శ‌కుడు డిజో జోస్ ఆంటోనీ తీసిన అద్భుత‌మైన సినిమానే ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’. యూనివ‌ర్సిటీల్లో జ‌రిగే వ్య‌వ‌హారాలు, కొంత‌మంది ప్రొఫెస‌ర్ల తీరు, దానివ‌ల్ల విద్యార్థులు ప‌డే ఇబ్బందులు, విద్యార్థి లోకానికి స‌హ‌జంగా ఉండే ఆవేశం, వారిని స‌రైన‌ దారిలో న‌డిపించాల‌నుకునే కొంద‌రు సిబ్బందికి ఎదుర‌య్యే క‌ష్టాలు.. వీట‌న్నింటినీ ఈ చిత్రంలో చాలా చ‌క్క‌గా చూపించారు.

ఒక మ‌హిళా ప్రొఫెస‌ర్ మృతి చెంద‌డం, దాన్ని రాజ‌కీయ నాయ‌కులు త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం.. అందుకోసం ఓ పోలీసు అధికారి తనయుడికి యాక్సిడెంట్ చేయించి, దాంతో ఆ పోలీసును త‌మ అవ‌స‌రాల‌కు వాడుకోవ‌డంలాంటి చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు ఎన్నో ఈ సినిమాలో క‌నిపిస్తాయి. ప‌లు ర‌కాల ఆలోచ‌న‌ల మ‌ధ్య నలిగిపోయే పోలీసు అధికారి పాత్ర‌లో సూర‌జ్ వెంజ‌ర‌మూడు, విద్యార్థుల కోసం ప‌రిత‌పించే ప్రొఫెస‌ర్ స‌బా పాత్ర‌లో మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, ఐపీఎస్ అధికారిగా ప‌నిచేసి, సొంత పోలీసుల వ‌ల్లే ఇబ్బంది ప‌డి చివ‌ర‌కు దివ్యాంగుడైన న్యాయవాదిగా అస‌లు విష‌యాన్ని వెలికితీసే బ‌ల‌మైన పాత్ర‌లో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, ఎలాగైనా గెలిచి ముఖ్య‌మంత్రి అవ్వాల‌నుకునే కుటిల రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో జీఎం సుంద‌ర్‌.. ఇలా ఒక‌రిని మించి ఒక‌రు న‌టించారు. మ‌ల‌యాళ సినిమాల్లో ఏదో తెలియ‌ని మ‌త్తు ఉంది. అంద‌రినీ అది క‌ట్టిప‌డేస్తుంది. స్టార్‌డ‌మ్‌ను దూరంగా పెట్టి, క‌థ‌ను మాత్ర‌మే న‌మ్ముకుని తీస్తారు కాబ‌ట్టే వాటిలో అంత డెప్త్ క‌నిపిస్తుంది. ప్ర‌తి పాత్రా మ‌న‌ల్ని వెంటాడుతుంది. మ‌న‌చుట్టూ జ‌రుగుతున్న విష‌యాల‌నే అవి క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తాయి. ‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ సినిమా ఉంది.

- రఘురాం పువ్వాడ

గమనిక: ఈ కథనం రచయిత దృష్టి కోణానికి సంబంధించింది. ఇది అతడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని