Telugu Songs: ‘జిగేల్‌’మనిపించేందుకు.. సమ్మర్ హీట్‌ పెంచేందుకు!

ప్రత్యేక గీతాల్లో మెరిసిన నాయికలు. ఎవరెవరు ఏఏ పాటలో నర్తించారంటే...

Published : 19 Apr 2022 11:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పూజాహెగ్డే.. కథానాయికగా మంచి ఫామ్‌లో ఉండగానే ‘జిగేలు రాణి’ (రంగస్థలం) అనే ప్రత్యేక గీతంలో నర్తించి వావ్ అనిపించుకుంది. ఇప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా దూసుకెళ్తూనే స్పెషల్‌ సాంగ్‌కు కాలు కదిపింది. అందరి దృష్టిని ఆకర్షించింది. అలా పూజాతోపాటు ఈ వేసవిలో హీట్‌ పెంచబోతున్న వారెవరంటే?

స్పెషల్‌ ఫన్‌..

అందరి ‘ఫ్రస్టేషన్‌’ పోగొట్టేందుకు, ‘ఎఫ్‌ 2’కు మించిన ‘ఫన్‌’ పంచేందుకు ‘ఎఫ్‌ 3’ సినిమాతో రాబోతున్నారు వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలు కాగా సోనాల్‌ చౌహాన్‌ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ ముగ్గురితోపాటు పూజాహెగ్డే అందం ‘ప్రత్యేకం’గా నిలువనుంది. ఈ చిత్రంలోనే ఆమె ఓ పార్టీ సాంగ్‌లో కనిపించనుంది. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్‌ను బట్టి పబ్‌ నేపథ్యంలో సాగే పాట అనిపిస్తుంది. మరి ఈ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రం మే 27న విడుదలకానుంది. ‘ఎఫ్‌ 3’.. గతంలో విజయవంతమైన ‘ఎఫ్‌ 2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌)కు సీక్వెల్‌ అనే సంగతి తెలిసిందే.


రెజీనాతో సానా కష్టం..

ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా రూపొందిన ‘ఆచార్య’ చిత్రంలో ‘సానా కష్టం’ అనే పాటతో సందడి చేయనుంది రెజీనా. మణిశర్మ స్వరపరిచిన ఈ పాట ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందింది. చిరు వేగానికి తగ్గట్టు రెజీనా ఓ రేంజ్‌లో డ్యాన్స్‌ చేసినట్టు లిరికల్‌ వీడియో చూస్తే అర్థమవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురానుంది.


ఊర్వశి తప్పేముంది

బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతేలాకు ప్రత్యేక గీతాలు కొత్తేమీ కాదు. హిందీ, బెంగాలీ చిత్రాల్లోని ఐటెం పాటలకు నర్తించిన ఈమె ‘బ్లాక్‌ రోజ్‌’ సినిమాలో ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అనే గీతంతో శ్రోతల్ని ఉర్రూతలూగించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాట శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది. మోహన్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే విడుదలకావాల్సింది. కానీ, అనివార్య కారణంగా వాయిదా పడింది. త్వరలోనే విడుదలకానుంది.


రవితేజ పక్కన?

ప్రభుత్వ అధికారిగా రవితేజ నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకుడు. ఇందులోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ భామ అన్వేషి జైన్‌ను ఎంపిక చేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన లేదు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్‌ 17న రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని