ఓటీటీ మాలిక్‌.. ఫహద్ ఫాజిల్‌

‘నీదేం నటన’ అన్నవారితోనే నటనంటే ఫహద్‌దే అనిపించుకున్నాడు

Published : 13 Jul 2021 09:07 IST

థియేటర్లు బంద్‌, షూటింగ్‌లూ ఆగిపోయాయి. మరి సినిమానే ప్రాణంగా బతికే  కళాకారుల పరిస్థితి ఏంటి? వారందరికీ ఓ చుక్కాని అయ్యాడు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌. పూర్తయిన సినిమా విడుదల చేయాలనుకుంటే లాక్‌డౌన్‌.. థియేటర్‌లు తెరుచుకోని పరిస్థితి.. ఓటీటీల్లో విడుదల చేస్తే బహిష్కరిస్తామనే బెదిరింపులు.. ఇలా ఎన్నో అడ్డంకులు.. అన్నీ దాటుకుంటూ చిత్రీకరణ మొదలు పెట్టి, ఇప్పటివరకూ మూడు చిత్రాలను ఓటీటీలోనే విడుదల చేశాడు. జులై 15న మరో కొత్త చిత్రం ‘మాలిక్‌’ను డిజిటల్‌ వేదికపైకి తెస్తున్నాడు. కొవిడ్‌ కాలంలో ఫహద్‌ ఓటీటీ మాలిక్‌గా మారిపోయాడు. ఆ ప్రయాణంపై కథనం.

నటనంటే ఫహద్‌దే

ఫహద్‌ తొలి సినిమాతోనే దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. నటన రాని స్టార్‌ కిడ్‌ అనే ముద్ర పడింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాల్లో ఎక్కడా కనిపించకుండా మాయమయ్యాడు. మళ్లీ 2009 నుంచి కొన్ని సినిమాల్లో కనిపించడం మొదలుపెట్టాడు. అనుకున్న సక్సెస్ అందుకోలేదు. దీంతో రూటు మార్చాడు. విభిన్న కథాంశాలు, సరికొత్త పాత్రలతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. ‘బెంగళూరు డేస్’‌, ‘అన్నాయుం రసులుం’,  ‘మహేశింటి ప్రతీకారం’, ‘తొండిమొదులం ద్రిక్షాక్షియుం’, ‘కుంబలాంగి నైట్స్’‌, ‘ట్రాన్స్‌’ ‘జోజి’ ఇలా మాలీవుడ్‌కే వన్నె తెచ్చిన చిత్రాలెన్నో అందించాడు. ఒకప్పుడు ‘నీదేం నటన’ అన్నవారితోనే సూపర్‌స్టార్‌ అనిపించుకున్నాడు. నటనంటే ఫహద్‌దే అనేంతగా ప్రశంసలు పొందాడు.  ఇప్పుడు ఓటీటీల హవా మొదలయ్యాక సినిమా మీద ప్రేమంటే ఇది అని చాటుకుంటున్నాడు.


‘సీ యూ సూన్‌’ తో మొదలు 

కరోనా మహమ్మారి కారణంగా అంతా అస్తవ్యస్తమైంది. మిగతా వృత్తుల్లో ఏరోజుకారోజు, లేదా నెలకోసారి చేసిన పనికి వేతనమిస్తారు. కానీ, ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అలా ఉండదు.  థియేటర్లలో సినిమా విడుదలయ్యాక గానీ ఫలితం చేతికందదు. అలాంటి సమయంలో ఓటీటీలే మార్గమనిపించింది. తక్కువ బడ్జెట్‌లో ఓటీటీ కోసం చిన్న సినిమా చేయాలనుకున్నారు. ‘మాలిక్‌’ దర్శకుడు మహేశ్‌ నారాయణ్‌ చెప్పిన కథతో 50మంది కన్నా తక్కువ బృందంతో షూటింగ్‌ పూర్తిచేశారు. లాక్‌డౌన్‌ కాలంలో చిత్రీకరణ జరుపుకోవడం ఒక విశేషమైతే, కేవలం కంప్యూటర్‌, ఫోన్‌ తెరలతో సినిమా కథనమంతా సాగడం మరొక హైలైట్‌. అమెజాన్‌ ప్రైమ్‌లో గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైంది ‘సీ యు సూన్‌’.  మలయళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ ప్రేక్షకులు కూడా ఆ సినిమాను ఆదరించారు. అలా ఓ పెద్దస్టార్‌ ఓటీటీ వేదికపై బలమైన అడుగువేశాడు.


ముగ్గరితోనే ‘ఇరుల్‌’

‘సీ యూ సూన్‌’ తర్వాత ఓటీటీ కోసం ఫహద్‌ తీసిన రెండో చిత్రం ‘ఇరుల్‌’. నాసిఫ్‌ అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు. కరోనా ఫస్ట్‌ వేవ్‌ చివరిదశలో ఉండగా ఈ  షూటింగ్‌ మొదలైంది. కేవలం 30 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తయింది. సోబిన్‌ షాహిర్‌, దర్శన రాజేంద్రన్‌, ఫహద్‌ ఫాజిల్‌ ఇలా ముగ్గురి చుట్టే సినిమా అంతా తిరుగుతుంది. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ‘ఇరుల్’ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది ఏప్రిల్ ‌2న విడుదలైంది.  మిశ్రమ స్పందన లభించినా ఫహద్‌ ప్రయత్నానికి అభినందనలు దక్కాయి. ఈ సినిమా విడుదల కోసం ముంబయిలాంటి నగరాల్లో కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారంటే ఇండియన్‌ సినిమాపై ఫహద్‌ ఏ స్థాయిలో ముద్రేశారో అర్థం చేసుకోవచ్చు.


ఇండియన్‌ మెక్‌బెత్ ‘జోజి’

‘ఇరుల్’ విడుదలైన వారం రోజుల్లోనే మరో సినిమాను తీసుకొచ్చాడు ఫహద్‌. అలా  ఏప్రిల్‌ 7న  ఓటీటీ ప్రేక్షకులకు అందించిన ఆణిముత్యం ‘జోజి’. ఫహద్‌ మిత్రత్రయం దిలీశ్‌పోతన్‌, శ్యామ్‌ పుష్కరన్‌లతో కలిసి తీసిన మూడో చిత్రమిది. ఆంగ్ల రచయిత షేక్‌ స్పియర్‌ రాసిన మెక్‌బెత్ నాటకం ఆధారంగా  తెరకెక్కింది. నాలుగు వందల ఏళ్లక్రితం రాసిన నాటకాన్ని ఇప్పటికాలానికి అన్వయించి గొప్ప చిత్రంగా మలిచారు.  ఇదివరకూ ఈ ముగ్గురు కలిసి తీసిన ‘మహేశింటి ప్రతీకారం’, ‘తొండిముదులం ద్రిక్షాక్షియం’ సినిమాలు సూపర్‌హిట్లుగా నిలిచాయి. ఓటీటీ కోసం కలుస్తున్నారనే సరికి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇందులో జోజిగా ఫహద్‌ నటనకు  ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ సినిమాలో యువకుడిగా కనిపించేందుకు బరువు  తగ్గాడు. ఆ కష్టానికి తగిన ఫలితం దక్కింది.  ఒక్కసారిగా ఓటీటీ సూపర్‌స్టార్‌గా మారిపోయాడు. జోజి విజయంతో ఇతర పరిశ్రమల్లోనూ ఫాజిల్‌ గురించి మాట్లాడుకోవడం  పెరిగింది.


థియేటర్‌ నుంచి ఓటీటీకి మారిన ‘మాలిక్‌’

ఫహద్‌ ఫాజిల్‌ తీసినపై మూడు చిత్రాలు ఓటీటీలకోసం ప్రత్యేకంగా తీసినవే. వీటన్నింటికన్నా ముందే మాలిక్‌ చిత్రాన్ని మొదలెట్టాడు. ‘సీయూ సూన్‌’ తీసిన మహేశ్‌ నారాయణ్‌ ఈ చిత్రానికి దర్శకుడు.  అయితే దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా హాళ్లలోనే విడుదల చేయాలనుకున్నారు.  కానీ సెకండ్‌ వేవ్‌తో మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలవబోతోంది.  ‘మాలిక్‌’ ఓటీటీల్లోకి వెళుతుందని తెలిసిన కేరళ థియేటర్‌ యజమానులు ఆగ్రహానికి గురయ్యారు.  వారి నుంచి ఫహద్‌ను బహిష్కరించాలనే బెదిరింపులొచ్చాయి. ఈ సినిమా ఓటీటీ విడుదలను ఖరారు చేస్తూ ఫహద్‌ రాసిన ఓ లేఖ ఆయన అభిమానులను, ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. అందులోనే ఆయన తృటిలో ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయాన్ని ప్రస్తావించారు.  అన్ని అడ్డంకులను దాటుకొని మాలిక్‌ను డిజిటల్‌ వేదికపైకి తీసుకొస్తున్నారాయన. ఎప్పటిలాగే నటుడిగా ఆయన చేసే మాయాజాలం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మలయాళ సినీ పరిశ్రమ ఎల్లలు చెరిపేసి తన సినిమాలతో ఇండియన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడాయన. ఇలా నాలుగు సినిమాలను తెరకెక్కించి, వాటిని డిజిటల్‌ వేదికకు ఎక్కించి అసలైన మాలిక్‌ అనిపించుకున్నాడు ఫహద్‌ ఫాజిల్‌. ‘పుష్ప’లో విలన్‌గా నటిస్తూ తెలుగులోనూ తన విశ్వరూపం చూపేందుకు సిద్ధమవుతున్నాడు. కమల్‌ హాసన్‌, విజయ్‌సేతుపతిలతో కలిసి ‘విక్రమ్‌’లోనూ నటిస్తున్నాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు