Film Chamber: ఏపీ కొత్త జీవో సంతృప్తినిచ్చింది.. చిరంజీవే మాకు పెద్ద: ఫిల్మ్‌ ఛాంబర్‌

టికెట్‌ ధరలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో అందరికీ సంతృప్తికరంగా ఉందని ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు అన్నారు.

Published : 08 Mar 2022 16:07 IST

హైదరాబాద్‌: టికెట్‌ ధరలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో అందరికీ సంతృప్తికరంగా ఉందని ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విషయంలో చొరవ చూపిన దర్శకనటుడు ఆర్‌. నారాయణమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతలు సి. కల్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్‌, చదలవాడ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు.

* ‘‘వివాదాలకు తెరదించుతూ ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలపై జీవో ఇవ్వడం ఆనందంగా ఉంది. తెలుగు పరిశ్రమ తరఫున సీఎంకు ధన్యవాదాలు. జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. దానికి మేం కూడా కృషి చేస్తాం. ఈ విషయమై మరోసారి సమావేశమవుతాం. త్వరలోనే తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులకు కలిసి సన్మానిస్తాం. పరిశ్రమలోని సమస్యలను తీర్చేందుకు చిరంజీవి ముందుకొచ్చారు. ఆయనే మాకు పెద్ద’’. - సి. కల్యాణ్‌.

* ‘‘మా విజ్ఞప్తిని స్వీకరించి, అమలు చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇతర సమస్యలకూ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం’’. - తమ్మారెడ్డి భదర్వాజ.

‘‘ఏపీ ప్రభుత్వం వెలువరించిన కొత్త జీవో ఎన్నో సంవత్సరాల సమస్యలకు చెక్‌ పెట్టినట్టైంది. కొవిడ్‌ కంటే పాత జీవో నం. 35తోనే డిస్ట్రిబ్యూటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడొచ్చిన జీవో అందరికీ సంతృప్తికరంగా ఉంది. ఇదే జీవో ‘భీమ్లా నాయక్’ ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. మిగిలిన చిన్న చిన్న సమస్యలను మేం పరిష్కరించుకుంటాం. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. సమస్యలను పరిష్కరించేందుకు చిరంజీవి ముందుకురావడం అభినందనీయం.’’ - ఎన్వీ ప్రసాద్‌.

‘‘టాలీవుడ్‌ నుంచి ఎన్నో ఉత్తమ చిత్రాలు వస్తున్నాయి. ప్రధానిమంత్రి కూడా వాటిని గుర్తించారు. నిర్మాతలు తాము రూపొందిన ప్రొడక్ట్‌ (సినిమా)ను మార్కెట్‌ చేసుకునేందుకు థియేటర్లు అవసరం. థియేటర్లు బాగుంటేనే సినీ పరిశ్రమ కళకళలాడుతుంది. చిత్ర పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారం కావాలి. ఫిల్మ్‌ ఛాంబర్‌కు స్థలం కేటాయించాలని వారిని కోరుతున్నాం’’. - చదలవాడ శ్రీనివాస్‌.

‘‘పదేళ్లుగా ఉన్న టికెట్‌ ధరల సమస్యకు సీఎం జగన్‌ తెరదించారు. కొత్త జీవోతో నిర్మాతలకు మంచి లాభాలొస్తాయి’’. - జెమిని కిరణ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు