Film Federation: తలసాని వద్దకు చేరిన సినీ కార్మికుల పంచాయితీ

వేతనాల పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న నిరసన కొనసాగుతోంది. రెండోరోజు కూడా వారు షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు.

Updated : 23 Jun 2022 11:53 IST

హైదరాబాద్‌: వేతనాల పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న నిరసన కొనసాగుతోంది. రెండోరోజు కూడా వారు షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. దీంతో 25కు పైగా సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. మరోవైపు సినీకార్మికులు షూటింగ్‌లకు హాజరైతేనే వేతనాల పెంపుపై చర్చిస్తామని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ చెబుతోంది. 15 రోజుల పాటు పాత పద్ధతిలోనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఫిల్మ్‌ ఛాంబర్‌ నిర్మాతలకు సూచించింది. ఈ నేపథ్యంలో పంచాయితీ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వద్దకు చేరింది. మంత్రిని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నేతలు, నిర్మాతల మండలి నేతలు వేర్వేరుగా కలిశారు. అనంతరం మంత్రి తలసాని, నిర్మాత సి.కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు.

షూటింగ్‌లు ప్రారంభమైతేనే వేతనాలు: సి.కల్యాణ్‌

తమ మాటకి కట్టుబడి ఉన్నామని.. షూటింగ్‌లు ప్రారంభమైతేనే వేతనాలపై చర్చిస్తామని సి.కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈరోజు కూడా షూటింగ్‌లు జరగడం లేదని.. నిర్మాతలంతా ఎవరితో పనిచేయించుకోవాలో వారితో చేయించుకుంటామని వ్యాఖ్యానించారు. అవసరమైతే నిరవధికంగా షూటింగ్‌లు ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

పంతాలు, పట్టింపులు వద్దు: మంత్రి తలసాని

అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ పంతాలు, పట్టింపులు వద్దని ఇరు పక్షాలకి చెప్పానని తెలిపారు. రెండు వైపులా సమస్యలు ఉన్నాయన్నారు. కరోనా పరిస్థితులతో కార్మికుల వేతనాలు పెరగలేదని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించామన్నారు. షూటింగ్‌లపై రెండు పక్షాలు రెండు రకాలుగా మాట్లాడుతున్నాయని.. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. రెండు వర్గాలకు న్యాయం జరిగేలా కూర్చొని మాట్లాడుకోవాలని తలసాని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని