Vivek Oberoi: సినిమా ఒక్కటే ఆదాయ మార్గం కాకూడదు కదా: వివేక్‌ ఒబెరాయ్‌

Vivek Oberoi: ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్‌ ఒబెరాయ్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Published : 10 Jul 2024 00:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాను చేసే సేవా కార్యక్రమాలకు ఎవరినీ డబ్బులు అడగకూడదనే ఉద్దేశంతోనే సినిమాలతో పాటు, వ్యాపారాలు చేస్తున్నట్లు బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ (Vivek Oberoi) తెలిపారు. రోహిత్‌ శెట్టి (Rohit Shetty) దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ (Indian Police Force). సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో నటుడిగా మారకముందు వ్యక్తిగత అవసరాలకి డబ్బు ఎలా సంపాదించే వారో తెలిపారు.

‘‘నా పాఠశాల విద్య అంతా బోర్డింగ్‌ స్కూల్లోనే సాగింది. అప్పుడు మా నాన్న సురేశ్‌ ఒబెరాయ్‌ పాకెట్ మనీ రూ.500 ఇచ్చేవారు. ఆవారాగా తిరుగుతూ ఆ మొత్తాన్ని ఒక్క రోజులోనే ఖర్చు పెట్టేసేవాడిని. ‘బాధ్యతగా ఉండటం ఎప్పుడు తెలుసుకుంటావ్‌’ అని నాన్న ఒకరోజు నన్ను తిట్టారు. డబ్బుని పొదుపుగా, తెలివిగా వాడాలని చెప్పారు. అప్పటికి నా వయసు 15 సంవత్సరాలు. నాకు కోపం వచ్చి ఆరోజు నుంచి నాన్న దగ్గర డబ్బు తీసుకోవడం మానేశా. వాయిస్‌ ఓవర్‌, వివిధ ప్రదర్శనలు ఇస్తూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టా. 17 సంవత్సరాల వయసులోనే స్టాక్‌ మార్కెట్‌పై పూర్తి అవగాహన ఏర్పడటంతో పెట్టుబడులు పెట్టేవాడిని. సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పటికీ ఆర్థికంగా నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు’’

‘‘బృందావన్‌ పాఠశాలను నడపడంతో పాటూ, క్యాన్సర్‌ బాధితులకు సాయం చేస్తున్నాను. సమాజానికి సేవ చేయటమనేది నా జీవితంలో భాగమైంది. అందుకే ఆర్థికంగా భద్రత ఉండటం అవసరం. డబ్బు కోసం ఎప్పుడూ ఎవరినీ చేయి చాచి అడగకూడదనుకున్నా. చిన్నప్పుడు నా తండ్రినే డబ్బులు అడగని వ్యక్తిని ఇతరుల వద్ద ఏమి అడుగుతాను. అందుకే ఎప్పుడూ బిజినెస్‌లో యాక్టివ్‌గా ఉంటాను. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు, పలు కంపెనీలు స్థాపించాను. కొన్ని టెక్నాలజీ సంస్థలు మంచి స్థాయికి చేరుకున్నాయి. నేను ఈ రోజు దాదాపు 29 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాను’ అని ఇంటర్వ్యూలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని